Afghan Students: ముంబై, పుణె విశ్వవిద్యాలయాలలో చదువుతున్న ఆఫ్గాన్ విద్యార్థులు మంగళవారం మంత్రి ఆదిత్య ఠాక్రేని కలిశారు. తమ తల్లిదండ్రులు, బంధువుల సమాచారం తెలియడం లేదని ఎలాగైనా సాయం చేయాలని కోరారు. మంత్రి ఆదిత్య ఠాక్రే వారికి అభయ హస్తం ఇచ్చారు. ఆఫ్గాన్ ఉన్న వారితో మాట్లాడటానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అంతేకాదు మహారాష్ట్రలో ఆఫ్గాన్ విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన 5వేల మంది విద్యార్థులు మహారాష్ట్రలో విద్యనభ్యసిస్తున్నారు. భారతీయులు మాకు సోదరులలాంటి వారని అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి మెరుగుపడే వరకు స్టూడెంట్ వీసా పొడిగించాలని కోరుతున్నారు. తాలిబాన్లకు పాకిస్తాన్ మద్దతు లభించిందని వారి సహాయంతోనే ఆఫ్ఘనిస్థాన్‌లోకి ప్రవేశించగలిగారని తెలిపారు. ఈ సందర్భంగా తాము తాలిబాన్లను వ్యతిరేకిస్తున్నామని, ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి విషమంగా ఉందన్నారు. అక్కడ మహిళలు సురక్షితంగా లేరని, మా కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కలవడానికి సమయం కేటాయించిన ఆదిత్య ఠాక్రే, మహారాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఆదిత్య ఠాక్రే వారి సమస్యలను విన్నారు. కొంతమంది విద్యార్థుల వీసా కాలం ముగిసింది. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానన్నారు. మహారాష్ట్రలో 3 వేల 500 నుంచి 4 వేల మంది ఆఫ్గాన్ విద్యార్థులు ఉన్నారు. మహారాష్ట్రలో ఈ విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని మంత్రి ఆదిత్య ఠాక్రే హామి ఇచ్చారు.
మరోవైపు అఫ్గాన్ తాలిబన్ల వశమైన దగ్గర్నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ వారి అరాచక పాలనను భరించే ఓపిక లేని ప్రజలు వేలాది మంది వేరే దేశాలకు వెళ్లిపోవడానికి కాబూల్ విమానాశ్రయంలోనే ఉన్నారు. విమానాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రజలందరికీ ఎలాంటి హాని తలబెట్టబోమని తాలిబన్లు హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు విశ్వసించడం లేదు. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితిపై తాజాగా మక్సార్ టెక్నాలజీ ఉపగ్రహ ఛాయా చిత్రాలను విడుదల చేసింది. ఈ చిత్రాల్లో తాలిబన్ల నుంచి దూరంగా పారిపోవాలని నిస్సహాయ స్థితిలో ఎదురు చూపులే కనిపిస్తున్నాయి.