Sucharitha: ‘పరామర్శల పేరుతో గందరగోళం..’ నారా లోకేష్‌కు హోంమంత్రి సుచరిత చురకలు

గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య ఉదంతంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని హోం మంత్రి సుచరిత తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి

Sucharitha: 'పరామర్శల పేరుతో గందరగోళం..'  నారా లోకేష్‌కు హోంమంత్రి సుచరిత చురకలు
Sucharitha On Nara Lokesh
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 17, 2021 | 8:46 PM

Home Minister Sucharitha: గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య ఉదంతంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని హోం మంత్రి సుచరిత తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సాయం చేస్తే, దానిని చేతులు దులుపుకోవడం అని లోకేష్ మాట్లాడ్డం దారుణమని ఆమె అన్నారు. బాధిత కుటుంబానికి సాయం చేయడాన్ని మానవత్వం అంటారని సుచరిత చురకలంటించారు. దిశ చట్టం ఎక్కడ ఉందని ప్రతిపక్షాలు మాట్లాడటం సిగ్గుచేటు అని సుచరిత అన్నారు.

దిశ చట్టం ఇంకా అమలులోకి రానప్పటికీ, ఆ చట్టాన్ని అనుసరించే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులపై రోజుల్లోనే విచారణ పూర్తి చేసి, త్వరితగతిన శిక్షలు పడే విధంగా చేస్తున్నామని హోం మంత్రి తెలిపారు. మహిళల రక్షణే మా ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమన్న సుచరిత.. మహిళా భద్రత విషయంలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం దేశంలోని అనేక రాష్ట్రాలకు మార్గదర్శకమైందని సుచరిత చెప్పుకొచ్చారు. మహిళల భద్రత కోసం ఉపయోగిస్తున్న దిశ యాప్‌ జాతీయ స్థాయిలో 5 అవార్డులను గెలుచుకుందని హోం మంత్రి వివరించారు. తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఏవైనా నేరాలు జరిగేతే, విచారణకు మూడు నుంచి నాలుగు నెలలు సమయం పట్టేదన్న హోం మంత్రి.. అదే 2019కి వచ్చేసరికి వంద రోజుల సమయం తీసుకుంటే, 2020కు వచ్చేసరికి 86 రోజులు, 2021లో 42 రోజుల్లోనే విచారణ పూర్తి చేసిన పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు.

మహారాష్ట్ర, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల ప్రదేశ్ తో సహా పలు రాష్ట్రాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నఈ దిశ చట్టం యొక్క తీరుతెన్నులను పరిశీలించిన ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయని సుచరిత తెలిపారు. “దిశ ఎస్‌వోఎస్‌ యాప్‌ ద్వారా దాదాపు 39 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మూడు లక్షల పదివేల మంది దిశ యాప్‌ను ఉపయోగించుకోవడం, దాని ద్వారా వచ్చిన ఫిర్యాదులల్లో 2988 కాల్స్‌ పై చర్యలు తీసుకుని, 436 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం.” అని సుచరిత వెల్లడించారు.

నారా లోకేష్‌ పరామర్శల పేరుతో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సుచరిత విమర్శించారు. బాధితురాలి కుటుంబీకులను ఇంటికి వెళ్లి పరామర్శించే అవకాశం ఉన్నా.. ప్రభుత్వాసుపత్రి వద్ద మృతదేహాన్ని కదలనివ్వకుండా తన పార్టీ నేతలను ప్రోత్సహించి హంగామా చేయించారని ఆమె ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు అంతా గమనించారని వ్యాఖ్యానించారు సుచరిత.

Read also: Kurnool: ప్యాలెస్‌ను ముట్టడించే రోజులు దగ్గర్లోనే, ఎర్రబాడులో లోకేష్ ఘాటు వ్యాఖ్యలు.. హై టెన్షన్ రాజకీయాలు