INS Sandhayak : 40 సంవత్సరాల పాటు దేశానికి సేవలందించిన భారతీయ నావికా దళానికి చెందిన హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్ "ఐఎన్ఎస్ సంధాయక్". ఇక సెలవంటూ నిష్క్రమించింది...
Follow us
దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించిన మొట్టమొదటి నౌక సంధాయక్. ఈ నౌకకు ఇవాళ్టితో (జూన్ 04 శుక్రవారం) శాశ్వతంగా విరామం తీసుకుంది. ఐఎన్ఎస్ సంధాయక్ డీకమిషన్ కార్యక్రమం నావల్ డాక్ యార్డ్ విశాఖపట్నంలో ఈ సాయంత్రం జరిగింది.
కొవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ స్టేషన్ అధికారులు.. ఇంకా నావికులు మాత్రమే హాజరై నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐఎన్ఎస్ సంధాయక్ సేవలిక ముగిసాయనడానికి ప్రతీకగా శుక్రవారం సూర్యాస్తమయంలో ఆ నౌక వేదికగా నావల్ జెండా, కమిషనింగ్ పతాకాన్ని చివరిసారి అవనతం చేశారు.
ఈఎన్ సి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్, ఎవిఎస్ఎమ్, విఎస్ఎమ్ సమక్షంలో ఈ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. తన అద్భుతమైన 40 సంవత్సరాల ప్రస్థానంలో సంధాయక్ నౌకకు మొత్తంగా 22 మంది కమాండింగ్ అధికారులు మారారు. చివరి కమాండింగ్ ఆఫీసర్ 17 జూన్ 19 న నౌక బాధ్యతలు స్వీకరించారు.
భారత నావికాదళంలోని హైడ్రోగ్రాఫర్లు ఈ నౌక నుండే అనేక పాఠాలను నేర్చుకున్నారు. తద్వారా ద్వీపకల్ప జలాల పూర్తి హైడ్రోగ్రాఫిక్ కవరేజీకి ఈ నౌక పునాదులు వేసింది. ఈ నౌక దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాలు, అండమాన్ సముద్ర జలాలు, పొరుగు దేశాలలో కూడా సుమారు 200 ప్రధాన హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, అనేక చిన్న సర్వేలను చేపట్టింది.