Bottle Gourd Juice: మండే ఎండల్లో చల్లగా ఈ జ్యూస్ తాగారంటే.. దిల్ ఖుష్!
మండే ఎండల నుంచి సేద తీరడానికి చల్లని శీతల పానీయాలు తాగేందుకు అందరూ ఇష్టపడతారు. అందుకే మార్కెట్లో లభించే పానీయాల వైపు అధిక మంది మొగ్గు చూపుతున్నారు. కానీ మీ ఇంట్లో సొరకాయ ఉంటే ఈ వేసవి మీకు తప్పక హాయినిస్తుంది..
Updated on: Mar 24, 2025 | 3:19 PM

గత కొన్ని రోజులుగా ఎండ వేడిమి క్రమంగా పెరుగుతోంది. భాణుడి ప్రతాపం కారణంగా బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. మండే ఎండల నుంచి సేద తీరడానికి చల్లని శీతల పానీయాలు తాగేందుకు అందరూ ఇష్టపడతారు. అందుకే మార్కెట్లో లభించే పానీయాల వైపు అధిక మంది మొగ్గు చూపుతున్నారు. కానీ మీ ఇంట్లో సొరకాయ ఉంటే ఈ వేసవి మీకు తప్పక హాయినిస్తుంది.

సొరకాయ జ్యూస్ తయారు చేసుకుని తాగితే శరీరాన్ని చల్లబరచడమే కాకుండా రక్తపోటును కూడా తగ్గిస్తుంది. డజన్ల కొద్దీ ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి ఇంట్లోనే ఈ సొరకాయ జ్యూస్ సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..

సొరకాయ జ్యూస్ చేయడానికి కావలసిన పదార్థాలు.. ఒక కప్పు సొరకాయ తరుగు, గుప్పెడు పుదీనా, అర టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ మిరియాల పొడి, అంగుళం అల్లం, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, నీళ్లు, ఐస్ క్యూబ్స్.

తయారు చేయాలంటే.. ముందుగా, ఒక కప్పు తొక్క తీసి తరిగిన సొరకాయ ముక్కలను బ్లెండర్‌లో వేసి మెత్తగా జ్యూస్ చేసుకోవాలి. తర్వాత గుప్పెడు పుదీనా, జీలకర్ర పొడి, కారం పొడి, అంగుళం అల్లం, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు పోసి బాగా జ్యూస్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులో పోసి ఐస్ క్యూబ్స్ వేస్తే, సొరకాయ జ్యూస్ రెడీ అయినట్లే. ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.





























