- Telugu News Photo Gallery Spiritual photos Venus Debilitated in Virgo: These zodiac signs to have negative Impact details in Telugu
Shukra Necha: నీచ శుక్రుడి ఎఫెక్ట్.. దాంపత్య జీవితంలో ఈ రాశులకు కష్టనష్టాలు..!
Venus Debilitated: అక్టోబర్ 10 నుంచి నవంబర్ 2 వరకు శుక్రుడు కన్యారాశిలో నీచబడడం జరుగుతోంది. దాంపత్యం, శృంగారం, ప్రేమలు, పెళ్లిళ్లు, హనీమూన్లు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు నీచబడడం వల్ల ఈ కారకత్వాలన్నీ కొద్దో గొప్పో దెబ్బతినే అవకాశం ఉంది. మిగిలిన రాశులకు కొద్దిగా శుభ యోగాలు పట్టే అవకాశం ఉన్నప్పటికీ, మేషం, కర్కాటకం, కన్య, తుల, కుంభం, మీన రాశులకు మాత్రం కొన్ని కష్టనష్టాలు తప్పకపోవచ్చు. సుఖ నాశనానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశుల వారు శివ పార్వతులను ఎక్కువగా ప్రార్థించడం మంచిది.
Updated on: Sep 27, 2025 | 6:34 PM

మేషం: ఈ రాశికి ధన, సప్తమాధిపతి అయిన శుక్రుడు ఆరవ స్థానంలో నీచబడడం వల్ల ఆర్థికంగా నష్టపోవడం గానీ, రావలసిన డబ్బు చేతికి అందకపోవడం గానీ, అప్పులు చేయాల్సి రావడం గానీ జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది. దాంపత్య జీవితంలో కూడా కొద్దిపాటి అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు బాగా నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం: ఈ రాశికి చతుర్థ, లాభాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో నీచబడడం వల్ల ఆర్థిక నష్టా లకు బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు తగ్గిపోతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో జాప్యం జరగవచ్చు. రావలసిన సొమ్ము, బాకీలు ఒక పట్టాన చేతికి అందకపోవచ్చు.

కన్య: ధన, భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఈ రాశిలో నీచబడడం వల్ల ఆదాయం పెరిగే అవకాశాలు ఉండకపోవచ్చు. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందదు. శ్రమ తక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగావకాశాలు, పదోన్నతి అవకాశాలు ఆగిపోవడం జరుగుతుంది. విదేశీయానానికి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఒకటి రెండు దుర్వార్తలు వింటారు.

తుల: రాశ్యధిపతి శుక్రుడు వ్యయ స్థానంలో నీచబడడం వల్ల పేరు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పదోన్నతులు ఆగిపోతాయి. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది. ఉద్యోగంలో దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి.

కుంభం: ఈ రాశికి చతుర్థ, భాగ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో నీచ స్థితికి చేరడం వల్ల ఆస్తి సమస్యలు జటిలంగా మారుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ మిగిలే అవకాశం ఉంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. సొంత ఇంటి ప్రయత్నాలకు విఘాతాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బందుల్లో పడడం జరుగుతుంది.

మీనం: ఈ రాశికి తృతీయ, అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో నీచబడడం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా తగ్గుతాయి. ముఖ్య మైన ప్రయత్నాలు కలిసిరాకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మోసపోవడమో, నష్టపోవడమో జరుగుతుంది. ఉద్యోగంలో అదనపు రాబడికి అవకాశం ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.



