- Telugu News Photo Gallery Spiritual photos Udupi Krishna Temple's Mystery: Why is Sri Krishna idol turned towards a window in Udupi temple?
ఆ ఆలయంలో వింత సాంప్రదాయం.. ప్రసాదాన్ని నేలపై ఉంచి తినే భక్తులు.. కిటికీ వైపు కృష్ణుడు తల.. ఎందుకంటే..
భారతదేశంలో అడుగడుగునా గుడి ఉంది. అత్యంత పురాతన క్షేత్రాలు, మర్మలకు నిలయమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు సంబంధించిన పౌరాణిక కథలు చాలా ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. అటువంటి దేవాలయాలలోని కొన్ని రహస్యాలను నేటి ఆధునిక సైన్స్ కూడా కనిపెట్టలేకపోయింది. అంతేకాదు అనేక ఆలయాలలోని అనుసరించే సంప్రదాయం కూడా బిన్నంగా ఉంటాయి. ఆ ఆలయాలపై ఉన్న నమ్మకం, సంప్రదాయంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిగాంచాయి. మన దేశంలోని ఒక ఆలయంలో భగవంతుడి ప్రసాదాన్ని పాత్రలు, ఆకుల వంటి వాటి మీద కాకుండా నేలపై పెట్టి తింటారు. ఆ ఆలయం ఎక్కడంటే
Updated on: Jun 10, 2025 | 3:53 PM

భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని దేవాలయాలు వాటి అద్భుతాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి, మరికొన్ని ఆలయాలు వాటి ప్రత్యేకమైన సంప్రదాయాలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వింత సంప్రదాయం ఉన్న ఆలయం ఒకటి కర్నాటకలో ఉంది. ఈ ఆలయంలో అనుసరించే ప్రత్యేకమైన సంప్రదాయం ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు.. ఎందుకు ఇలా అని మనస్సులో అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎందుకంటే ఈ ఆలయంలో భక్తులకు ప్రసాదాన్ని పంచి పెట్టే విధానం వెరీవెరీ స్పెషల్.

ఈ పురాతన ఆలయం దక్షిణ భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉడిపిలో ఉంది. ఈ ప్రదేశాన్ని దేవాలయాల భూమి లేదా పరశురామ క్షేత్రం అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని ఉడిపి కృష్ణ ఆలయం అని పిలుస్తారు. ఉడిపి శ్రీ కృష్ణ ఆలయ చరిత్ర సుమారు 1000 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. ఈ అద్భుతమైన ఆలయాన్ని 13వ శతాబ్దంలో వైష్ణవ సాధువు శ్రీ మధ్వాచార్యులు స్థాపించారని స్థానికులు చెబుతారు.

ఉడిపి కృష్ణుడి ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం భక్తుల్లో ప్రబలంగా ఉంది. ఈ ఆలయంలో భక్తులు స్వయంగా ప్రసాదాన్ని నేలపైనే వడ్డించమని అడుగుతారు. కోరికలు నెరవేరిన భక్తులందరూ ప్రసాదాన్ని నేలపైనే వడ్డించమని అడుగుతారు. ఆ ప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరిస్తారు. శ్రీ కృష్ణుడి ఈ ప్రసాదాన్ని ప్రసాదం లేదా నైవేద్యం అంటారు. దీనితో పాటు, ప్రసాదాన్ని అరటి ఆకులు, పాత్రలలో మాత్రమే ఇతర భక్తులకు వడ్డిస్తారు. ఈ ఆలయం నేల నల్ల కడప రాయితో తయారు చేయబడింది.

ఉడిపి శ్రీ కృష్ణ ఆలయానికి మాత్రమే చెందిన మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఆలయంలో కొలువైన బాల కృష్ణుడిని భక్తులు నేరుగా దర్శనం చేసుకోరు. ఈ ఆలయంలో తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీ ద్వారా శ్రీ కృష్ణుడిని దర్శించుకుని పూజిస్తారు. కిటికీలోని ఈ తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలతో అనుసంధానించబడి ఉన్నాయని చెబుతారు. ఈ కిటికీ ద్వారా శ్రీ కృష్ణుడిని పూజించిన తర్వాత ప్రజలు సంతృప్తి , ఆనందం , శ్రేయస్సు పొందుతారని కూడా నమ్మకం.

ఉడిపి శ్రీ కృష్ణ ఆలయానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ ఉంది. దాని ప్రకారం ఒకప్పుడు శ్రీ కృష్ణుడికి కనక దాసు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అయితే ఆ భక్తుడిని ఈ ఆలయంలోకి అనుమతించలేదు. తరువాత అతను ఈ ఆలయం వెనుకకు వెళ్లి శ్రీ కృష్ణుడిని ప్రార్థిస్తూ.. తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు, అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ భక్తుడికి తన దర్శనం ఇచ్చాడు. ఇది మాత్రమే కాదు, ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన విగ్రహం తలను తన ప్రియమైన భక్తుడు కూర్చుని తపస్సు చేస్తున్న వైపుకు తిప్పాడు. అప్పటి నుంచి నేటి వరకు ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన విగ్రహం తల గోడ వైపు ఉంది. దీంతో బాల కృష్ణుడి దర్శనం కోసం ఒక కిటికీ తయారు చేయబడింది. ఈ కిటికీ ద్వారానే శ్రీ కృష్ణుడు భక్తులకు దర్శనం ఇస్తాడు.



















