- Telugu News Photo Gallery Spiritual photos Thousands of Hindu Worshippers in Indonesia climbed Active Volcano to offer ritual sacrifices to their gods
Yadnya Kasada: మండే అగ్నిపర్వతంలో హిందూ పండుగ.. ప్రసాదం కోసం అగ్నిబిలంలోకి.. పూర్తి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ప్రపంచంలో అనేక రకాల పండుగలు జరుపుకుంటారు, కానీ హిందువులు పర్వదినాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. అయితే హిందువుల అన్ని పండుగల కంటే ఎంతో వైవిధ్యంగా ఉండే ఓ పండుగను ఇండోనేషియాలో జరుపుకుంటారు. ఈ పండుగ కోసం అక్కడి హిందువులు ప్రతి ఏటా జూన్ నెలలో స్థానికంగా ఉన్న అగ్నిపర్వతం(తప్పనిసరిగా మండుతూ ఉన్నది) వద్దకు చేరుకుంటారు. అసలు ఈ పండుగకు ఉన్న ప్రత్యేకతలు.. వాళ్లు అగ్నిపర్వతం వద్దకు చేరుకోవడానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jun 07, 2023 | 2:54 PM

ఇండోనేషియాలోని హిందువులు జూన్ నెల మొదటి వారంలో జరుపుకునే ఈ పండుగ పేరు యద్న్య కసాడ. స్థానికంగా ఉండే హిందూ తెంగెరీస్ కమ్యూనిటీ ప్రజలు దీన్ని ఎన్నో తరాల నుంచి ఆనవాతీగా పాటిస్తూ ఉన్నారు. ఇక ఈ పండుగ కోసం వారు ఇండోనేషియా జావా ప్రావిన్స్‌లోని ప్రోబోలింగోలో మండుతున్న అగ్నిపర్వతం బిలం వద్దకు వేలాది సంఖ్యలో గుమిగూడతారు. ఈ అగ్నిపర్వతం 7,641 అడుగుల ఎత్తు కావడం గమనార్హం.

హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కసాడ నెల 14వ రోజున యద్నన్య కసడ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను మొత్తం 14 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటారు. స్థానికుల ప్రకారం ఇండోనేషియాలోని హిందూ రాజ్యానికి రాజు అయిన మజాపాహిత్ రాజు నుంచి తెంగెరీస్ కమ్యూనిటీ వచ్చింది. ఇక్కడ మహాపాహిత్ వారసులు ఇప్పుడు అగ్నిపర్వతం ఉన్న బ్రోమో పర్వతం ఎత్తైన ప్రదేశాలలో నివసించారని వారంతా నమ్ముతారు. అందుకోసమే తమ పూర్వీకుల సన్నిధిలో పండుగ జరగాలని తెంగెరీస్ కమ్యూనిటీ ప్రజలు ఇక్కడ పూజలు చేస్తారు. తద్వారా తమ దేవుడు, పూర్వీకులు సంతోషిస్తారని, భవిష్యత్తులో మంచి జరుగుతుందని వారి నమ్మకం.

యద్న్య కసాడ పండుగ రోజుల్లో వేలాది మంది ప్రజలు అగ్నిపర్వతానికి చేరుకుంటారు. వారు తమతో పాటు ప్రసాదంగా పంట ధాన్యం, పండ్లు, కూరగాయలు లేదా ఏదైనా జంతువువు తీసుకువస్తారు. అక్కడకు తాము తెచ్చిన ప్రసాదాన్ని అగ్నిపర్వతంలోకి విసురుతారు. తెంగెరీస్ కమ్యూనిటీ ప్రజలు ప్రసాదం అందించడం ద్వారా దేవునికి తమ కృతజ్ఞతలు తెలుపుతున్నామని నమ్ముతారు.

అగ్నిపర్వతంలోని బిలంలోకి ప్రసాదాన్ని విసిరిన తరువాత, కొందరు అందులోకి దూకుతారు. దేవుడిని సమర్పించిన ప్రసాదంలో కొంత అయినా తీసుకోవాలని వారి భావన. అలాగే ఇలా చేస్తే భగవంతుని విశేష అనుగ్రహం తమపై ఉంటుందని వారి ప్రజల నమ్మకం. అయితే ఇలా చేయడం వల్ల అగ్నిపర్వతంలోని లావాలో పడి మరణించిన సందర్భాలు కూడా లేకపోలేదు.

అలాగే అగ్నిపర్వతంపై నిలబడి ఉన్న వ్యక్తులు లోపలికి విసిరిన ప్రసాదాన్ని పట్టుకోవడానికి కూడా కొందరు ప్రయత్నిస్తారు, ఇది తమ అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. కాగా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అగ్నిపర్వతాలను కలిగిన దేశం ఇండోనేషియా అని తెలిసిందే.





























