- Telugu News Photo Gallery Spiritual photos Surya Gochar 2023: Astrological prediction for all zodiac signs in Telugu. Check details here
Surya Gochar: మిధున రాశిలోకి రవి గ్రహ సంచారం.. ఆ రాశులకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులకు అత్యంత అనుకూల సమయం..!
Ravi Gochar 2023: ఈనెల 16వ తేదీన రవి గ్రహం మిధున రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఈ మిధున రాశికి బుధుడు అధిపతి. బుధుడికి రవి మంచి స్నేహితుడు. బుధ గ్రహం విద్యలకు, నైపుణ్యాలకు, శిక్షణలకు, పరిశోధనలకు, వివేకానికి, తెలివి తేటలకు కారకుడు. మిధున రాశిలో విగ్రహం ప్రవేశించడం వల్ల వచ్చే నెల 16వ తేదీ వరకు విద్యార్థులకు, పరిశోధకులకు, నిరుద్యోగులకు చాలావరకు అనుకూల సమయం అని చెప్పవచ్చు.
Updated on: Jun 13, 2023 | 11:44 AM

ఈనెల 16వ తేదీన రవి గ్రహం మిధున రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఈ మిధున రాశికి బుధుడు అధిపతి. బుధుడికి రవి మంచి స్నేహితుడు. బుధ గ్రహం విద్యలకు, నైపుణ్యాలకు, శిక్షణలకు, పరిశోధనలకు, వివేకానికి, తెలివి తేటలకు కారకుడు. మిధున రాశిలో రవి గ్రహం ప్రవేశించడం వల్ల వచ్చే నెల 16వ తేదీ వరకు విద్యార్థులకు, పరిశోధకులకు, నిరుద్యోగులకు చాలావరకు అనుకూల సమయం అని చెప్పవచ్చు. పోటీ పరీక్షలకు, ప్రవేశ పరీక్షలకు, పరిశోధనలకు, అధ్యయనాలకు వెళ్లే విద్యార్థులకు ఈ నెల రోజుల సమయం చాలా వరకు అనుకూలంగా కనిపిస్తోంది. కర్కాటకం, వృశ్చికం, మకరం మినహా ఇతర రాశుల వారికి ఈ సమయం శుభ ఫలితాలను కలగజేస్తుంది. మిధున రాశిలో రవి సంచారం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలను ఇస్తుందో ఇక్కడ అధ్యయనం చేద్దాం.

మేష రాశి: వివిధ సంస్థలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు, పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రవి, విద్యా స్థానంలో బుధ గ్రహం సంచరించడం ఎక్కువగా విద్యాపరంగా చాలా మంచిది. ఈ రాశి వారు విద్యారంగానికి సంబంధించినంతవరకు ఎటు వంటి పరీక్షలనైనా ఎదుర్కోగలుగుతారు. సునా యాసంగా విజయాలు సాధించగలుగుతారు. నిరుద్యోగులకు మంచి సంస్థలో తప్పకుండా ఉద్యోగం లభించడం జరుగుతుంది.

వృషభ రాశి: ఈ రాశి వారికి విద్యా స్థానంలో రవి సంచారం వల్ల తప్పకుండా విద్యల్లో రాణించే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షల్లో నెగ్గటం జరుగుతుంది. విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొద్దిపాటి ప్రయత్నంతో ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు అన్ని విధాలుగాను చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడుతుంది. ఈ నెల 16 తరువాత ఏ ప్రయత్నం తలపెట్టినప్పటికీ అది విజయవంతం అవుతుంది. సకాలంలో ప్రయత్నాలు చేపట్టడం మంచిది.

మిథున రాశి: ఈ రాశి వారికి ప్రతిప్రయత్నం కలిసి వస్తుంది. విద్యారంగానికి సంబంధించినంతవరకు అనేక అవకాశాలు ఈ రాశి వారి ముందుకు వచ్చే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు లేదా ప్రవేశ పరీక్షల్లో సునాయాసంగా విజయాలు సాధించి తమకు ఇష్టమైన కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఎంత ప్రయత్నం చేస్తే అంతగా కలిసి వస్తుంది. దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యలు పరిష్కారమై ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.

కర్కాటక రాశి: తమకు అనుకూలమైన కోర్సులను ఎంపిక చేసుకోవడానికి విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఈ రాశిలో కుజ శుక్రులు సంచరిస్తున్నందువల్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. ఎంతో శ్రమ, మరెంతో ఖర్చుతో విద్యార్థులు విజయం సాధించడం జరుగుతుంది. పెద్దలతో లేదా కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో పూర్తి కావడం జరుగుతుంది.

సింహ రాశి: ఈ రాశి వారు సునాయాసంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో మంచి ర్యాంకు సంపాదించడం జరుగుతుంది. ఈ రాశి నాథుడైన రవి మిధున రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల సాధారణంగా కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, మాథ్స్, క్రీడలు వంటి రంగాలలో ఇటువంటి ప్రయత్నం చేసినప్పటికీ సఫలం అయ్యే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది.

కన్యా రాశి: ఈ రాశి వారికి రవి దశమంలోనూ, బుధుడు భాగ్యస్థానంలోనూ సంచరిస్తున్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ప్రస్తుత సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. కొద్ది శ్రమతో విజయాలు సాధించే అవకాశం ఉంది. ఇష్టమైన కోర్సులకు ఎంపిక కావచ్చు. సాధారణంగా కామర్స్, అకౌంటెన్సీ, మెడిసిన్, లా వంటి కోర్సులు ఈ రాశి వారికి అనుకూలిస్తాయి. నిరుద్యోగులు తమకు ఇష్టమైన ఉద్యోగాలకు లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

తులా రాశి: ఈ రాశి వారికి భాగ్య స్థానంలో రవి సంచారం వల్ల సునాయాసంగా విజయాలు లభించే అవకాశం ఉంది. విద్యారంగంలో లేదా ఉద్యోగ రంగాల్లో పోటీ పరీక్షల్లో తప్పకుండా ముందుకు దూసుకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల రోజుల సమయం చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది తప్పకుండా సత్ఫ లితాలను ఇస్తుంది. రవిగ్రహంతోపాటు ఇతర శుభగ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి రవి గ్రహం అష్టమ స్థానంలో సంచరిస్తున్నందువల్ల విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. చిన్న చిన్న పనులకు సైతం శ్రమ తిప్పట అనివార్యం అవుతాయి. పోటీ పరీక్షలు లేదా ప్రవేశ పరీక్షల మీద ఏకాగ్రతను, శ్రద్ధను మరింతగా పెంచవలసి ఉంటుంది. ఇష్టం లేని కోర్సులలో చేరవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. నిరుద్యోగులు కూడా ఒకటి రెండు వైఫల్యాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక విషయాల పట్ల ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. భారీగా డబ్బు నష్టం జరిగే సూచనలు ఉన్నాయి.

ధనూ రాశి: ఈ రాశి వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనులు క్షణాల మీద పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన విద్యార్థులకు సునాయాసంగా అప్రయత్నంగా విజయాలు సమకూరే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు ఉత్తమ స్థాయి ర్యాంకులు సాధించ గలుగుతారు. పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, శిక్షణలు, పరిశోధనలో వీరు రికార్డ్ స్థాయిలో ప్రతిభ కనబరుస్తారు. నిరుద్యోగులకు కూడా తప్పకుండా నచ్చిన సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారి ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి.

మకర రాశి: ఈ రాశి వారికి ఆరవ స్థానంలో రవి సంచారం వల్ల విద్యాపరంగా కొన్ని కష్ట నష్టాలు తప్పక పోవచ్చు. అయితే విద్యా కారకుడైన బుధ గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల కొంత ఆలస్యంగా నైనా అనుకున్న ఫలితాలు సాధించవచ్చు. ఈ రాశి వారు ఏకాగ్రతను పెంచవలసి ఉంటుంది. స్నేహితుల కారణంగా దృష్టి మరలే అవకాశం ఉంది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో సరిపెట్టుకోవలసి వస్తుంది. ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే మున్ముందు మంచి జరిగే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

కుంభ రాశి: ఈ రాశి వారికి ప్రస్తుతం సమయం చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం ఇది. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినప్పటికీ అది తప్ప కుండా శుభ ఫలితాలను, ఉత్తమ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. కోరుకున్న లేదా ఇష్టపడిన కోర్సుల్లో సీటు సంపాదిస్తారు. పట్టుదలతో అన్ని రకాల పరీక్షల్లోనూ విజయం సాధించే అవకాశం ఉంది. కొద్దిగా శ్రమ తిప్పట ఉన్నప్పటికీ నిరుద్యోగులు కూడా అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు.

మీన రాశి: విద్యా స్థానంలో రవి గ్రహ సంచారం వల్ల వీరు చదువుల పరంగా అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఏ రకమైన కోర్సుకు ప్రయత్నిం చినా వీరికి తప్పనిసరిగా సీటు లభిస్తుంది. సాధారణంగా ఈ రాశి వారు వృత్తి విద్యా కోర్సులను ఎంపిక చేసుకుని అవకాశం ఉంది. వీరి ప్రయత్నాలు సఫలం కావడంతోపాటు వీరి చదువు కూడా సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు రెండు మూడు ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఈ నెలరోజుల కాలంలో ఈ రాశి వారు తప్పకుండా ఉద్యోగ సమస్యల నుంచి గట్టెక్కే సూచనలు ఉన్నాయి.



