- Telugu News Photo Gallery Spiritual photos Srivari Brahmotsavam 2022 Ankurarpanam Performed with Religious Fervour At Tirumala tirupati
Srivari Brahmotasavam: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ.. ఫొటోలు వీక్షించండి
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడుకి బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థిస్తూ అంకురార్పణ చేస్తారు.
Updated on: Sep 26, 2022 | 10:38 PM

తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం జరిగింది.

విశిష్టత: వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.

సూర్యాస్తమయం తరువాతే.. మరో ఆసక్తికరమైన విషయం సూర్యుడు అస్తమించిన తరువాత అంకురార్పణ నిర్వహించారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు.

సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ జరిగింది. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా అంతే గొప్పగా జరగుతాయని విశ్వసిస్తారు.

అంకురార్పణ క్రమం.. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహించారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.

అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఈసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.

ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం చేశారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు శ్రీ మారుతి ప్రసాద్, రాములు, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, ఇతర అధికారులు ఉన్నారు.

ప్రాముఖ్యత: విత్తనాలు మొలకెత్తడం - అంకురార్పణ అనేది వైకానస ఆగమంలో బ్రహ్మోత్సవం అన్ని ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని ప్రార్థించే ముఖ్యమైన క్రతువు.

సాంప్రదాయకంగా అంకురార్పణం పండుగను సూర్యాస్తమయం తర్వాత నిర్వహిస్తారు, ఎందుకంటే మహర్షి అత్రి సమూర్తార్చన సాధికరణకు అనుగుణంగా విత్తనాలు మొలకెత్తుతాయి.

ఈ విత్తనాలను వస్త్రంలో కప్పి, వేదమంత్రాలు, మంగళ వాద్యాల మధ్య పుణ్యహవచనం చేస్తారు.





























