- Telugu News Photo Gallery Spiritual photos Shukra Gochar 2023: Venus transit in leo 2023 positive impact on these zodiac signs relationship
Shukra Gochar 2023: సింహరాశిలో శుక్ర గ్రహ సంచారం.. వారు లైంగిక వాంఛలను అదుపులో పెట్టుకోకపోతే ప్రమాదమే..!
ఈ నెల 7వ తేదీ నుంచి సింహరాశిలో శుక్ర గ్రహ సంచారం ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న శుక్రుడు సింహరాశిలో ప్రవేశించి, ఆగస్టు 7 వరకూ అదే రాశిలో కొనసాగడం జరుగుతుంది. సింహ రాశిలో శుక్రుడికి కుజ గ్రహంతో కలయిక ఏర్పడడమే కాకుండా, ఈ కలయిక మీద శని, గురు గ్రహాల వీక్షణ కూడా ఉంటుంది.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Jul 05, 2023 | 3:27 PM

ఈ నెల 7వ తేదీ నుంచి సింహరాశిలో శుక్ర గ్రహ సంచారం ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న శుక్రుడు సింహరాశిలో ప్రవేశించి, ఆగస్టు 7 వరకూ అదే రాశిలో కొనసాగడం జరుగుతుంది. సింహ రాశిలో శుక్రుడికి కుజ గ్రహంతో కలయిక ఏర్పడడమే కాకుండా, ఈ కలయిక మీద శని, గురు గ్రహాల వీక్షణ కూడా ఉంటుంది. ఈ గ్రహాల కలయిక, వీక్షణల వల్ల శృంగార జీవితంలో లేదా లైంగిక జీవితంలో యథేచ్ఛా ప్రవర్తనకు అవకాశం ఏర్పడుతుంది. ఉచ్ఛ, నీచలకు, వావీ వరుసలకు కూడా అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే, ఈ అంశాలను వ్యక్తిగత జాతక చక్రాలను బట్టి కూడా విచారించాల్సి ఉంటుంది. వివిధ రాశులవారికి ఈ శుక్ర సంచారం ఏ విధంగా మేలు లేదా కీడు చేస్తుందో ఇక్కడ పరిశీలిద్దాం.

మేషం: ఈ రాశివారికి పంచమ స్థానంలో అంటే ఆలోచనా స్థానంలో శుక్ర, కుజుల కలయిక వల్ల నిరంతరం లైంగిక సంబంధమైన కోరికల మీదే దృష్టి ఉండే అవకాశం ఉంది. ఈ రాశిలో గురు చండాల యోగం కూడా ఏర్పడి ఉన్నందువల్ల శారీరక సుఖాల విషయంలో రాజీపడే లేదా కంట్రోల్లో ఉండే అవకాశం కూడా ఉండకపోవచ్చు. సాధారణంగా మంచి, చెడుల ఆలోచన కూడా తక్కువగా ఉంటుంది. కోరిక నెరవేరడమే ప్రధానంగా కనిపిస్తుంది. అక్రమ సంబంధాలకు, వివాహేతర సంబంధాలకు కూడా అవకాశం ఉంది.

వృషభం: లైంగిక జీవితంలో కాస్తంత అతిగా వ్యవహరించే ప్రవృత్తి కలిగిన ఈ రాశివారికి నాలుగవ స్థానంలో అంటే సుఖ స్థానంలో శుక్ర, కుజుల కలయిక వల్ల లైంగిక జీవితానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. రుచులు, అభిరుచులు పేట్రేగిపోయే అవకాశం ఉంది. లైంగిక సంబంధాల విషయంలో ఎటువంటి సాహసానికైనా తెగబడే సూచనలున్నాయి. ఒక్కోసారి వయసు తారతమ్యం కూడా ఉండకపోవచ్చు. సాధారణంగా ప్రయాణాలు, పర్యటనల్లో కొత్త పరిచయాలు, సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

మిథునం: ఈ రాశివారు కొత్త పరిచయాలు, అనవసర పరిచయాల విషయంలో కొద్ది ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. లైంగిక వాంఛలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మరీ అంతగా యథేచ్ఛగా వ్యవహరించే అవకాశం లేదు. సాధారణంగా ఈ రాశివారు లైంగిక కార్యకలాపాల విషయంలో ఎంతో గోప్యంగా వ్యవహరించడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం మితిమీరి వ్యవహరించే సూచనలు తక్కువగా కనిపిస్తున్నాయి. బాగా దగ్గరి బంధువులతో లేదా నమ్మకస్థులతో సంబంధం ఏర్పరచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

కర్కాటకం: లైంగిక సంబంధాల విషయంలో ఈ రాశివారికి పట్టపగ్గాలు ఉండకపోవచ్చు. తమ కోరికలు తీరడానికి ఎంతటి సాహసానికైనా, ఎంతటి తెగింపుకైనా సిద్ధపడే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో కూడా లైంగిక కార్యకలాపాలను అధికం చేయడానికి అవకాశం ఉంది. అక్రమ సంబంధాలు, అనవసర పరిచయాలు కూడా చోటు చేసుకోవచ్చు. వ్యసనాలకు, విలాస జీవితానికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. కోరికల మీద కంట్రోల్ ఉండకపోవచ్చు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

సింహం: ఈ రాశిలోనే కుజ, శుక్ర కలయిక చోటు చేసుకుంటున్నప్పటికీ, శని, గురు గ్రహాల ప్రత్యక్ష వీక్షణ వల్ల వీరి కోరికలు అదుపులో ఉండే అవకాశం ఉంది. ఘోటక బ్రహ్మచర్యం పాటించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. సాధారణంగా హద్దులు దాటే అవకాశం ఉండదు. ఇతరులతో లైంగిక సంబంధాల వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ కలయిక వల్ల ఈ రాశివారికి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది.

కన్య: ఈ రాశివారికి 12వ స్థానంలో అంటే శయన స్థానంలో కుజ, శుక్రుల కలయిక వల్ల లైంగిక సంబంధాల విషయంలో హద్దులు మీరి వ్యవహరించే అవకాశం ఉంది. ఈ సంబంధాల మీద, కోరికల మీదా బాగా ఖర్చయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండడం వల్ల మనసులోని కోరికలు తీర్చుకోవడానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. కొద్దిగా మంచి, చెడు విచక్షణ తగ్గే అవకాశం కూడా ఉంది. బలవంతాలు, అత్యాచారాల వంటివి చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

తుల: ఈ రాశివారికి లాభ స్థానంలో కుజ, శుక్రుల కలయిక జరుగుతున్నందువల్ల , ఈ రాశివారు శారీరక సుఖాల విషయంలో రాజీపడే లేదా సమాధానపడే అవకాశం ఉండకపోవచ్చు. ఈ విషయంలో కోరుకున్న పరిచయాలు ఏర్పడతాయి. బహుమతులు, ప్రయాణాల మీద ఖర్చులు పెరిగినప్పటికీ సంబంధాల విషయంలో వెనుకడుగు వేయడం ఉండదు. సాధారణంగా స్నేహితులతో లైంగిక సంబంధాలు కొనసాగించే సూచనలున్నాయి. అధిక కాముకత్వంతో అవస్థ పడే అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రాశివారిని అడ్డూ ఆపూ లేని కోరికలు ఆవహించే సూచనలున్నాయి. ఈ రాశి అధిపతి అయిన కుజుడు సింహరాశిలో శుక్ర గ్రహంతో కలుస్తున్నందువల్ల ఈ రాశివారిలో తప్పకుండా స్త్రీ వ్యామోహం లేదా లైంగిక వాంఛలు పెరగడం జరుగుతుంది. దీన్ని అదుపు చేసుకోగలిగినవారికి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. అదుపు చేసుకోలేనివారు దారితప్పే ప్రమాదం ఉంది. సాధారణంగా చెడు సంబంధాల వైపే మనసు మొగ్గుచూపుతుంది. అక్రమ సంబంధాలకు, వివాహేతర సంబంధాలకు అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశివారికి కుజ, శుక్ర గ్రహాల కలయిక ఏమంత అనుకూలంగా లేదు. జీవితం ఎప్పటి మాదిరిగానే సాగిపోయే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరగడం జరుగుతుంది. ఈ రాశి మీద రాశి అధిపతి అయిన గురు గ్రహం దృష్టి ఉండడం వల్ల సాధారణంగా అనవసర పరిచయాలకు, సంబంధాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ రాశివారికి నిగ్రహం, నియంత్రణలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే, ఈ రాశివారు ఆహార విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

మకరం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో అంటే రహస్య కార్యకలాపాల స్థానంలో కుజ శుక్ర సంచారం వల్ల కోరికలు విజృంభించే అవకాశం ఉంది. అయితే, ఈ రాశినాథుడైన శనీశ్వరుడు ఇటువంటి విషయాల్లో క్రమశిక్షణ పాటించే గ్రహం అయినందువల్ల ఎక్కువగా చొరవ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అందుకు ప్రతిగా దాంపత్య జీవితానికి ప్రాధాన్యం ఇవ్వడం, సుఖ సంతోషాలతో జీవితాన్ని కొనసాగించడం వంటి విషయాలకు పరిమితం కావడం జరుగుతుంది. అనవసర పరిచయాలకు అవకాశం లేదని చెప్పవచ్చు.

కుంభం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో శుక్ర, కుజుల సంచారం జరుగుతున్నందువల్ల కొద్దిగా తొందరపడే అవకాశం ఉంది. ఈ రాశిలో శనీశ్వరుని సంచారం వల్ల లైంగిక వాంఛలు కంట్రోల్ లో ఉండడం జరుగుతుంది. అనవసర పరిచయాలకు, వివాహేతర సంబంధాలకు అవకాశాలు చాలా తక్కువనే చెప్పవచ్చు. ఇటువంటి వ్యవహారాల వల్ల ఇబ్బందిపడే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువగా దాంపత్య జీవితానికే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి తొందరపాటు చర్యలకు, తొందరపాటు నిర్ణయాలకు అవకాశం లేదు.

మీనం: ఈ రాశివారు ఇతరులతో సంబంధాలకు ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ సంబంధాలు ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. అయితే, లైంగిక సంబంధాల విషయంలో చొరవ చూపించడం మాత్రం జరుగుతుందని చెప్పవచ్చు. మితిమీరిన వాంఛలతో ఈ రాశివారు ఇబ్బంది పడడం జరుగుతుంది. అతి కాముకత్వం ఆవహించే సూచనలు కూడా ఉన్నాయి. ప్రయాణాలు, పర్యటనల్లో ఇతరులతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. భారీగా ఖర్చయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.





























