
మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆదాయ వృద్ధికి సంబంధించిన వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. భూ లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలను రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు. ఇల్లు, స్థలం కొనే అవకాశం ఉంది. వాహన సౌకర్యం కలుగుతుంది. రావలసిన డబ్బును, బాకీలను పట్టుదలగా రాబట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

మిథునం: పట్టుదలకు, గుండె ధైర్యానికి, కార్యదీక్షకు మారుపేరైన ఈ రాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల తనకు సక్రమంగా రావలసినదాన్ని పోరాడైనా సాధించుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు, జీతభత్యాలు కూడా పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు, రాద ను కుని వదిలేసుకున్న డబ్బు కూడా వసూలవుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఎంతటి శ్రమకైనా ఓర్చుకుని ఆదాయం పెంచుకోవడం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది.

కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆస్తిపాస్తులు బాగా వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాన్ని గట్టి పట్టుదలతో పరిష్కరించుకోవడం జరుగుతుంది. లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బును గట్టి ప్రయత్నంతో వసూలు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి, అభివృద్ధి బాటపడతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.

సింహం: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. హోదా పెరగడానికి కూడా అవకాశం ఉంది. జీతభత్యాలు, అదనపు రాబడి పెరిగే సూచనలున్నాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. నిరుద్యోగులకు భారీ జీత భత్యాలతో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.

ధనుస్సు: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు లాభ స్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల ఏ రంగంలో ఉన్నా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. సంపాదనకు సంబంధించిన యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనేక మార్గాల ద్వారా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. రావలసిన డబ్బును, మొండి బాకీలను వసూలు చేసుకుంటారు.

మకరం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం కలిగింది. దీనివల్ల ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. చొరవ, దూసుకుపోయే తత్వం మరింత విజృంభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, బాధ్యతలు మారే అవకాశం ఉంది. జీతభత్యాలు పెరగడంతో పాటు, అదనపు ఆదాయ అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకున్నవి సాధిస్తారు.