- Telugu News Photo Gallery Spiritual photos Karthika masam: Sri Someswara Janardhana Swamy Temple and Shivaling here changes colors according to Lunar Aspect
చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం.. పౌర్ణమికి అమావాస్యకు రంగులు మారే శివయ్య.. ఆలయం ఎక్కడంటే
అన్ని మాసాలలో కార్తీక మాసం విశిష్టమైనదిగా చెబుతారు. అందులోనూ పౌర్ణమి, కృత్తికా నక్షత్రం రోజున శివాలయాలకు వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు సైతం విశేషంగా జరుపుతుంటారు. ఇక ప్రతి నెలా వచ్చే పౌర్ణమి, అమావాస్య తిధులకు ఒక శివాలయానికి అవినాభావ సంభంధం ఉంది. ఆ బంధం భక్తులను దైవసన్నిధికి నడిపిస్తూ ముక్తిని ప్రసాదిస్తూటుందని ఒక నమ్మకం. దీంతో కార్తీక మాసం వస్తే చాలు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ శివాలయానికి పోటెత్తుతూ ఉంటారు. ఆ విశిష్ట ఆలయం ఎక్కడ ఉందంటే
B Ravi Kumar | Edited By: Surya Kala
Updated on: Nov 15, 2024 | 9:54 AM

శివాలయాల్లో పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పంచారామాల్లో విశిష్టమైన క్షేత్రం సోమారామం. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడిలో శ్రీ సోమేస్వరస్వామి ఆలయం ఉంది. ఈ సోమారామం చాలా ప్రత్యేకమైనది. సోమారామంలో శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారు కొలువై ఉంటారు.

సోమేశ్వరస్వామి లింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్టించాడని పండితులు చెబుతారు. అందువల్ల స్వామి వారి లింగంలో ఇప్పటికీ చంద్రకళలు స్పష్టంగా కనిపిస్తాయి.

చంద్రుడు పౌర్ణమి తిధిలో ఎలాగైతే పూర్ణబింబంతో కాంతులీనుతూ ఉంది.. క్రమక్రమంగా అమావస్య నాటికి ఎలా క్షీణిస్తూ ఉంటారో అవే లక్షణాలు ఇక్కడ ఆలయంలో ఉన్న స్వామిలో కనిపిస్తుంటాయి. \

సోమేశ్వర స్వామి లింగం అమావాస్యకు ముదురు గోధుమ రంగులో దర్శనం ఇస్తుంది.. అనంతరం పౌర్ణమి రోజుకు తెలుపు రంగులోనికి మారుతూ ఉంటుంది. ఇలా నెలలో రెండుసార్లు స్వామి లింగం రంగులు మారుతూనే ఉంటుంది.

ఇక్కడ మరో విశేషమేమిటంటే స్వామివారి శిరస్సు పై భాగాన అన్నపూర్ణమ్మ వారు కొలువై ఉంటారు. ఆలయానికి రెండవ అంతస్థులో అన్నపూర్ణ అమ్మవారు ఉంటారు. ఇలా శివుని తల పైభాగాన అమ్మవారు ఉన్న ఆలయం చాలా అరుదుగా చెప్తారు ఇక్కడ అర్చకులు.

ఆలయానికి క్షేత్రపాలకుడిగా జనార్ధన స్వామి ఉంటారు. ఇంతటి మహిమ కలిగిన సోమేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయి అని, సిరిసంపదలు కడుగుతాయని, మనశ్శాంతి కలుగుతుందని, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

మహా శివరాత్రి, దసరా, వినాయక చవితి, కార్తీక మాసం పర్వదినాల్లో ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామి వారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమె కాదు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు.

ముఖ్యంగా ఏపిఎస్ ఆర్టీసీ కార్తీక మాసంలో భక్తుల సౌకర్యం కోసం పంచారామాల క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలను ఈ యాత్రలో భాగంగా భక్తులు దర్శించుకుంటారు. ఒక్కరోజులో అన్ని క్షేత్రాల దర్శనం అత్యంత పుణ్యమైనదిగా భక్తులు భావిస్తుంటారు.





























