- Telugu News Photo Gallery Spiritual photos Kanuma Festival 2025: people draw Chariot rangoli know significance and importance
Kanuma 2025: కనుమని పశువుల పండగ అని ఎందుకు అంటారు? రథం ముగ్గు వేయడంలో అంతర్యం ఏమిటో తెలుసా..
హిందూ పండగలను జరుపుకునే సంప్రదాయంలో ఉన్న ఆచారాలు, నియమాలు వెనుక శారీరక, మానసిక, ఆధ్యాత్మికం అనే ప్రయోజనాలు దాగున్నాయి. హిందువులు జరుపుకునే అతి పెద్ద పండగలలో ఒకటి సంక్రాంతి. ధనుర్మాసం మొదలు దాదాపు నెల రోజుల పాటు సంక్రాంతి సందడి ఇంటింటా ఉంటుంది. సంక్రాంతి అంటే ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండివంటలు, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు.. ఈ సంప్రదాయాల వెనకున్న మర్మం.. శాస్త్రీయ కోణం కూడా దాగి ఉంటుంది.
Updated on: Jan 14, 2025 | 11:44 AM

సంక్రాంతి పండగ రైతుల పండగ. మూడవ రోజుని కనుమ పండగగా జరుపుకుంటారు. ఈ రోజును పశువుల పండుగ అని కూడ అంటారు. వ్యవసాయదారులు తమ పశువులను నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తారు. పసుపు కుంకుమలతో, పూలతో అలంకరిస్తారు. పశువులను పూజిస్తారు.

సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు.

ముగ్గులన్నీ మహాలక్ష్మిని ఆహ్వానం పలికేందుకన్నమాట. ధనుర్మాసం నెల్లాళ్లూ విభిన్నమైన ముగ్గులతో వాకిళ్లు కళకళలాడుతుంటాయి. ఇంటి ముందు రకరకాల ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులు నక్షత్ర మండలాలకు ప్రతిరూపాలని అంటారు. అంతేకాదు ప్రకృతిలోని జీవుల పట్ల భూతదయతో ఉండమని చెప్పడమే ముగ్గుల అంతరార్ధం.

ఈ ముగ్గులను బియ్యపు పిండితో వేస్తారు. ఆ పిండిని తినడానికి ఇంట్లోని సూక్ష్మక్రిములు, చీమలు, బొద్దింకలన్నీ లోగిళ్లలోకి వచ్చి చేరతాయి. ఇలా చేయడం వలన చిన్న జీవులకు ఆహారం అందించినట్లే..

ముగ్గు అనేది ఇంటికి అలంకరణే కాదు. ముగ్గులు పెట్టడం మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును ఏకాగ్రతను అందించే ఓ ప్రక్రియ. చుక్కలను పెట్టి వేస్తె ముగ్గు వస్తుంది. అదే విధంగా మనుషుల్ని కలుపుకుంటూ పోవాలని ముగ్గు చూచిస్తుంది.

ధనుస్మరం మొదలు నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులను వేస్తారు. అయితే కనుమ రోజున మాత్రం రథం ముగ్గువేస్తారు. ఆ రథాన్ని వీధిచివర వరకూ లాగుతారు. ఈ రథం ముగ్గు సామాజిక ఐక్యతకు, ఆధ్యాత్మికతకు చిహ్నం.

రథం ముగ్గు విశిష్టత ఏమిటంటే.. ప్రతీ మనిషి శరీరం ఒక రథం అని .. ఈ దేహమనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించటమే.. ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యం.

అంతేకాదు బలిచక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులూ గడుపుతాడని పురాణాల కథనం. పండుగ పూర్తయిన తరవాత బలిచక్రవర్తిని తిరిగి అతడిని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గువేస్తారని ఓ కథ

ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు శుభాలని కలిగించాలని కోరుతూ.. ఇంటి ముంగిట రథం ముగ్గుని వేసి పువ్వులు, పసుపు, కుంకుమతో పూజచేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకూ సాగనంపుతారు.




