- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips: How To Offer Every Day Puja Vidhi According To Days And Puja Tips in Telugu
Astro Tips: జాతక బలం కోసం వారంలో ఏడు రోజుల్లో ఏ రోజు ఏ గ్రహాన్ని, దేవతని పూజించాలి పూజ విధి నియమాలు..
జ్యోతిషశాస్త్రంలో వారంలోని ఏడు రోజులు వేర్వేరు దేవతలకు అంకితం చేయబడింది. ఈ ఏడు రోజులో ఒకొక్క రోజు ఒకొక్క గ్రహ ప్రభావం ఉంటుంది. రోజు ప్రకారం ఆయా దేవతలను పూజించడం వల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. సనాతన ధర్మంలోని గ్రంధాలలో ఏడు రోజులు రోజు ప్రకారం దేవతలను పూజించడం గురించి ప్రాముఖ్యతను వివరించారు.
Updated on: Oct 13, 2023 | 10:50 AM

ఆదివారం సూర్యుడిని, సోమవారం చంద్రుడిని, మంగళవారం అంగారకుడిని, బుధవారం బుధుడిని, గురువారం గురు గ్రహాన్ని, శుక్రవారం శుక్రుడిని, శనివారం శనిని పూజించడం ఉత్తమం. వారానుసారంగా దేవతలను ఆరాధించడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. మత విశ్వాసాల ప్రకారం సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. చంద్రుడు సంపదను ఇస్తాడు. కుజుడు రోగాలను నయం చేస్తాడు. బుధుడు బలాన్ని ఇస్తాడు. బృహస్పతి ఆయుష్షును పెంచుతాడు. శుక్రుడు భౌతిక ఆనందాన్ని అందిస్తాడు. శని మృత్యుభయాన్ని తొలగిస్తాడు.

ఆదివారం సూర్య పూజ: ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుడికి అపారమైన శక్తి, ప్రకాశం సొంతం. సూర్యుని నుంచి వెలువడే కాంతి భూమిపై నివసించే ప్రతి జీవంపై చూపిస్తుంది. మన ఆత్మలోని కాంతి కూడా సూర్యుని ప్రతిబింబమే. సూర్యభగవానుని ఆశీర్వాదం పొందడానికి ప్రతిరోజూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆదివారం రోజున రాగి పాత్రలో నీళ్లు నింపి పూలు, అక్షతలు వేసి సూర్యుడికి అర్ఘ్యన్ని సమర్పించాలి.

సోమవారం చంద్రుని ఆరాధన: సోమవారం రోజున శంకరుడిని ఆరాధించడం ద్వారా, అన్ని గ్రహాలు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటాయి, అయితే చంద్రుడు ఆరాధన సోమవారం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. శివయ్య శిగలో చంద్రుడు ఉండి పూజలను అందుకుంటున్నాడు. అందువల్ల శివుడిని పూజించడంతో పాటు చంద్రుడి సోమవారం పూజిస్తే ఐశ్వర్యాన్ని పొందుతారు. జీవితంలో శ్రేయస్సు లభిస్తుంది.

మంగళవారం కుజుడి ఆరాధన: మంగళ దోషం లేదా కుజ దోష ప్రభావం తగ్గాలంటే మంగళవారం నాడు హనుమంతుడిని పూజించండి. ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల కుజ దోషం కూడా తగ్గుతుంది. మంగళ వారం శివలింగానికి ఎర్రటి పుష్పాలను సమర్పించండి. అంగారకుడిని శివలింగ రూపంలో మాత్రమే పూజిస్తారు. మంగళవారం శివలింగానికి ఎర్ర గులాబీలను లేదా మందార పువ్వులను సమర్పించండి.

బుధవారం నాడు బుధుడి ఆరాధన: వైదిక విశ్వాసాల ప్రకారం బుధవారం గణేశుకి అంకితం చేయబడిన రోజు. ఆ ఈరోజున గణపతిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీనితో పాటు ఆనందంగా జీవించాలంటూ బుధ గ్రహాన్ని కూడా ఈ రోజున పూజిస్తారు. ఎందుకంటే బుధ గ్రహం బుధవారానికి అధిపతి. గణేశుడు, బుధుడు ఇద్దరూ తెలివితేటలకు కారకాలుగా పరిగణిస్తారు. కావున జ్ఞాన ప్రదాత అయిన శ్రీ గణేశుడికి ఈ రోజున మోదకాన్ని నైవేద్యంగా సమర్పించి ఆరాధించడం ద్వారా జ్ఞాన వరం పొందుతారు. బుధ గ్రహం కూడా శాంతిస్తుంది. బుధ గ్రహానికి ప్రతి బుధవారం పెసలు దానం చేయండి. గణేశుడికి దర్భలను సమర్పించండి.

గురువారం బృహస్పతి పూజ: జ్యోతిషశాస్త్ర విశ్వాసాల ప్రకారం గురువారం దేవతల గురువైన బృహస్పతికి అంకితం చేయబడింది. ఈ రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం, ఉపవాసం ఉండటం వలన, విష్ణువు త్వరగా సంతోషిస్తాడు. బృహస్పతి అనుగ్రహంతో చేపట్టిన అన్ని కార్యాలు పూర్తవుతాయి. దేవగురు బృహస్పతిని కూడా శివలింగ రూపంలో పూజిస్తారు. అందుకే ప్రతి గురువారం శివలింగానికి శనగపప్పుని , శెనగపిండి లడ్డూలను సమర్పించండి.

శుక్రవారం శుక్రుడిని ఆరాధన: శుక్రుడు జాతకంలో బలంగా ఉంటే భౌతిక ఆనందం, కీర్తి, సంపద, సంతోషకరమైన వైవాహిక జీవితం లభిస్తుంది. శుక్రవారం నాడు శుక్రుడిని పూజించండి. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి శుభ్రమైన వస్త్రాలు ధరించి శుక్రుడుగా శివయ్య రూపాన్ని భావించి పూజించి తెల్లని తీపి పదార్థాలు, తెల్లని పువ్వులు సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన శుక్రుడు శాంతిస్తాడు.

శనివారం శని ఆరాధన: ప్రతి శనివారం గ్రహాల న్యాయాధిపతి.. కర్మ ప్రదాత శనీశ్వరుడిని పూజించండి. శనీశ్వరుడికి నూనె సమర్పించి హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడిని పూజించడం ద్వారా శనిదేవుడు ప్రసన్నుడవుతాడని నమ్ముతారు.





























