- Telugu News Photo Gallery Special sweets made in the West Godavari district like Kanchi silk saree, roll, and rokali
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలి.. ఇలా ఇస్తే ఇక మీ కొంగు బంగారమే..!
పల్లెటూర్లలో పండుగల సమయములో పిండి వంటకాల కోసం పిండిని, అదేవిధంగా ఆవకాయ పచ్చడి కోసం కారాన్ని రోకలి కర్రతో రోళ్లలో కొట్టటం, అలాగే పప్పుల కోసం తిరగళ్ళను, పప్పు రుబ్బడం కోసం రుబ్బురోలు పోత్రం మనం చూసే ఉంటాం.. అయితే రాను రాను యాంత్రీకరణ పెరిగిపోవడంతో ఇప్పుడు అవేవీ పల్లెటూర్లలో సైతం అందుబాటులో లేవు. అయితే అటువంటి పల్లె పరికరాలను మనకు కంటికి కట్టినట్లు గుర్తుతెచ్చే విధంగా వాటి రూపంలో తినుబండారాలను చేసి ప్రస్తుతం ఫంక్షన్లలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంచుతున్నారు.
Updated on: Nov 26, 2024 | 5:42 PM

పశ్చిమగోదావరి జిల్లా తణుకు , పాలకొల్లు ప్రాంతాల్లో ని స్వీట్ షాపుల్లో వీటిని స్పెషల్ గా తయారుచేసి విక్రయిస్తున్నారు. వాటి కోసం స్థానికులు ముందుగా ఆర్డర్ ఇచ్చి మరి చేయించుకుంటున్నారు అంటే వాటి మీద వారికున్న ప్రేమ తగ్గలేదని ఇప్పటికీ మనకు తెలుస్తుంది.

సాధారణంగా బెల్లం పానకంతో తయారుచేసిన మరమరాలు ఉండ మనమందరం చిన్నతనంలో టేస్ట్ చేసే ఉంటాం. ఇప్పుడు అదే ఫార్ములాతో బెల్లం పాకం మిశ్రమంలో మరమరాలు కలిపి రోలు-రోకలి, రుబ్బురోలు-పోత్రం, తిరగలి, కుండ, సన్నికల్లు వంటి పరికరాలను తినుబండారాలో రూపంలో అచ్చు వేసి, భారీ సైజులలో తయారు చేస్తున్నారు.

ఇలా తయారైన బెల్లం మరమరాల తినుబండారాలు, పండ్లు కూరగాయల అచ్చులతో తయారు చేసిన స్వీట్లను స్థానికులు పండుగ సమయాలలో దేవతామూర్తులకు నైవేద్యంగా అర్పించి అనంతరం వాటిని ప్రసాదంగా స్వీకరిస్తున్నారు..

ఇక మరికొందరైతే పిల్లలలో స్పెషల్ ఎట్రాక్షన్ గా రకరకాల సారెలు తయారు చేస్తూ ఇలాంటి బెల్లం మరమరాల తినబండారాలు ప్రత్యేకంగా ఉండేటట్లు జాగ్రత్తలు వహిస్తున్నారు. ఆ వంటకాల కోసం స్వీట్ షాప్ ల వద్ద ముందుగానే అడ్వాన్సులు చెల్లించి వాటిని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు.

ఇది అందమైన కంచిపట్టుచీర అనుకుంటే పొరపాటే నండోయ్.. ఇది కూడా కమ్మటి నోరూరించే మిఠాయినే..అచ్చం పట్టుచీరను పోలిన ఆకారంలో తయారు చేసి స్వీట్ ఇక్కడ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇకపోతే, ఇది ముత్తాయిదువలు ఇచ్చుకునే వాయినం.. తమలపాకు, అరటి పండు, పొకలు.. కానీ, ఇది కూడా కమ్మటి బెల్లంతో చేసిన స్వీట్ అని తెలిస్తే మీకు నోరూరిపోవాల్సిందే..ఇలాంటి వెరైటీలు అనేకం ఇక్కడ తయారు చేస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నారు దుకాణదారులు.

పాలకొల్లులో స్వీట్ షాప్ ల వద్ద ప్రస్తుతం ఇలాంటి బెల్లం మరమరాల పరికరాలు మనకు దర్శనమిస్తున్నాయి.. అలనాటి తరంలో ఉపయోగించిన వస్తువులను ఇలా మళ్లీ గుర్తు చేసుకోవడమే కాకుండా మన పల్లె సంస్కృతిని మన తరాల వారికి చాటి చెప్పేలా వాటిని చూపించగలుగుతున్నామని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
