Shiva Prajapati |
Updated on: May 13, 2021 | 10:27 PM
ప్రపంచంలో అతిపెద్ద అడవులలో ఒకటి దక్షిణ అమెరికాలోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఈ వర్షారణ్యం అమెజాన్ బేసిన్‌లో విస్తరించి ఉంది. ఈ అడవిలో 25 లక్షల జాతుల కీటకాలు ఉన్నాయి. వేలాది మొక్కలు, రెండు వేల రకాల జంతువులు, పక్షులు నివసిస్తున్నాయి. అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అమెజాన్ ఫారెస్ట్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం. 5.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రెయిన్‌ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్దది. బ్రిటన్, ఐర్లాండ్ దేశాల వైశ్యాలంతో పోల్చితే 17 రెట్లు పెద్దది అని చెప్పాలి. ఇంత పెద్ద విస్తీర్ణం కలిగిఉండి.. ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్‌ను అందిస్తోంది.
దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ అడవి తొమ్మిది దేశాల సరిహద్దులో ఉంది. ఇందులో బ్రెజిల్, బొలీవియా, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా ఈ అడవికి సరిహద్దులుగా ఉన్నాయి. ఈ అడవి 60 శాతం బ్రెజిల్‌లో ఉంది.
అమెజాన్ నది వర్షారణ్యానికి ఉత్తరాన ప్రవహిస్తుంది. ఇది వందలాది జలమార్గాల నెట్‌వర్క్, 6,840 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అయితే, ఈ విషయానికి సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి. నైలు నది తరువాత అమెజాన్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద నది అని చాలా మంది శాస్త్రవేత్తలు అంటున్నారు.
2007 లో, మార్టిన్ స్ట్రాల్ అనే వ్యక్తి అమెజాన్ నదిని పూర్తిగా ఈదాడు. మార్టిన్ ఈ నదిని ఈదడానికి 66 రోజుల పాటు పట్టింది.
అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ 400-500 దేశీయ అమెరిండియన్ తెగలకు నిలయంగా ఉంది. వీరిలో 50కి పైగా తెగలకు బయటి ప్రపంచంతో సంబంధాలే లేవు.
అమెజాన్ ఫారెస్ట్ అమోఘమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. సుమారు 40 వేల జాతుల మొక్కలు, 1300 రకాల పక్షులు, 3000 రకాల చేపలు, 430 రకాల క్షీరదాలు, 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి.
ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన, ప్రమాదకరమైన జీవులు వర్షారణ్యంలో నివసిస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే పిర్హానా చేపలు, విష కప్పలు, జాగ్వార్‌లు, నదిలో జీవించే విషపూరిత పాములు ఉన్నాయి.
అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో పిరార్క్ అని పిలువబడే ఆసక్తికరమైన చేప కనిపిస్తుంది. ఈ చేప ఇతర చేపలను తింటుంది. దాదాపు మూడు మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. దాని నోరు మరియు నాలుక రెండింటికి దంతాలు ఉంటాయి.
అపారమైన ప్రకృతి సౌందర్యం కలిగిన అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ ప్రాంతం వాతావరణ మార్పులను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భారీ స్థాయిలో వృక్షసంపద కలిగిన అమెజాన్ ఫారెస్ట్.. గాలి నుండి కార్బన్ డయాక్సైడ్‌ను తీసుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.
అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లోని దట్టమైన చెట్ల కారణంగా, దాని ఉపరితలంపై ఎప్పుడూ చీకటి ఉంటుంది. చెట్లన్నీ దట్టంగా ఉండటంతో ఆకాశం నుంచి చూస్తే ఒక పొర మాదిరిగా కనిపిస్తుంది. వర్షం పడినప్పుడు నీరు దిగువకు చేరుకోవడానికి 10 నిమిషాలు పడుతుంది.