- Telugu News Photo Gallery Redeveloped ITPO complex which will host India’s G20 leaders meet to be inaugurated on July 26, Details here
G20 Summit: జీ-20 సదస్సుకు వేదిక రెడీ.. IECC కాంప్లెక్స్ ప్రత్యేకతలేంటో తెలిస్తే వావ్ అనాల్సిందే..
G20 Summit venue: భారత్ వేదికగా గ్రూప్ ఆఫ్ 20 (జీ20) సమావేశాలు సెప్టెంబర్‌లో అట్టహాసంగా జరగనున్నాయి. దీనికోసం భారత ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేస్తోంది. గత ఏడాది (2022) డిసెంబర్ 1న ఇండోనేషియా నుంచి జీ-20 సారథ్య బాధ్యతలు చేపట్టిన భారతదేశం..
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu | Edited By: Shaik Madar Saheb
Updated on: Jul 23, 2023 | 11:28 AM

G20 Summit venue: భారత్ వేదికగా గ్రూప్ ఆఫ్ 20 (జీ20) సమావేశాలు సెప్టెంబర్‌లో అట్టహాసంగా జరగనున్నాయి. దీనికోసం భారత ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేస్తోంది. గత ఏడాది (2022) డిసెంబర్ 1న ఇండోనేషియా నుంచి జీ-20 సారథ్య బాధ్యతలు చేపట్టిన భారతదేశం.. మరి కొద్ది నెలల్లో జరగనున్న జీ-20 లీడర్స్ సమావేశాల కోసం ఆతిథ్య వేదికను సిద్ధం చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) ఆధీనంలో ఉన్న సువిశాల కాంప్లెక్స్‌ను రీడెవలప్ చేసిన కేంద్ర ప్రభుత్వం జులై 26న ప్రారంభించనుంది.

కొత్తగా సిద్ధం చేసిన ఈ వేదికలో లోటుపాట్లను గుర్తించి సరిదిద్దేందుకు జీ-20 సన్నాహక సమావేశాలు సహా అనేక ఇతర సమావేశాలను ప్రభుత్వం ఇక్కడ ఇప్పటికే నిర్వహించింది. పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన వేదికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జులై 26న ప్రారంభించనున్నారు. ఈ ఆధునిక IECC కాంప్లెక్స్ ప్రపంచంలోని టాప్ 10 ఎగ్జిబిషన్, కన్వెన్షన్ కాంప్లెక్స్‌లలో ఒకటిగా నిలిచింది. దీని ప్రత్యేకతలు, విశేషాలు ఏంటో తెలుసుకోండి..

సుమారు 123 ఎకరాల క్యాంపస్ విస్తీర్ణంతో ప్రగతి మైదాన్ కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్ద MICE (మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు) గమ్యస్థానంగా నిలవనుంది. అత్యుత్తమ ప్రమాణాలతో, ప్రపంచ శ్రేణి ఎగ్జిబిషన్ సెంటర్‌తో పాటు ఈ కాంప్లెక్స్‌ను ప్రభుత్వం వివిధ రకాల ఈవెంట్‌ల నిర్వహణ కోసం సిద్ధం చేసింది. రీడెవలప్ చేసిన ఆధునిక "ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (IECC)" ప్రపంచంలోని టాప్-10 ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కాంప్లెక్స్‌లలో చోటు సంపాదించింది.

జర్మనీలోని హన్నోవర్ ఎగ్జిబిషన్ సెంటర్, షాంఘైలోని నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (NECC) వంటి టాప్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్లకు ధీటుగా న్యూఢిల్లీలోని IECC కాంప్లెక్స్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ కాంప్లెక్స్ స్థాయి, సామర్థ్యం, మౌలిక సదుపాయాల పరిమాణం ప్రపంచ స్థాయి భారీ సదస్సుల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఆధునిక భారతదేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

కన్వెన్షన్ సెంటర్ లెవల్-3 ఆస్ట్రేలియాలోని ఐకానిక్ సిడ్నీ ఒపేరా హౌజ్ కంటే ఎక్కువ మందికి సీటింగ్ కల్పించగలదు. సిడ్నీ ఒపేరా హౌజ్ సీటింగ్ సామర్థ్యం 5,500 మంది కాగా కన్వెన్షన్ సెంటర్లోని లెవెల్-3 సీటింగ్ సామర్థ్యం 7,000 మంది. ఈ ఆకట్టుకునే ఫీచర్ IECCని ప్రపంచ స్థాయిలో మెగా కాన్ఫరెన్స్‌లు, అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు, సాంస్కృతిక మహోత్సవాలను నిర్వహించడానికి తగిన వేదికగా గుర్తింపు తీసుకురానుంది. ఇక్కడున్న 7 సువిశాల ఎగ్జిబిషన్ హాళ్లను వివిధ రకాల ఉత్పత్తులు, ఆవిష్కరణలు, ఆలోచనలను ప్రదర్శించడానికి అనువుగా తీర్చిదిద్దారు. ఈ అత్యాధునిక హాళ్లు ఎగ్జిబిటర్లు, కంపెనీలు తమ టార్గెట్ కస్టమర్లను ఆకట్టుకోవడం, వ్యాపార వృద్ధి, నెట్‌వర్కింగ్ అవకాశాలను పెంపొందించడానికి అనువైన వేదికను అందిస్తాయి.

అది మూడు పీవీఆర్ థియేటర్లకు సమానం: ఈ IECCలో 3,000 మంది సీటింగ్ సామర్థ్యంతో అద్భుతమైన యాంఫీ థియేటర్ కూడా ఉంది. ఇది మూడు PVR మెగా థియేటర్‌లకు సమానం. ఈ గ్రాండ్ యాంఫిథియేటర్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే వాతావరణంతో ఆకర్షణీయమైన ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలకు వేదికగా మారనుంది. IECCలో సందర్శకుల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం 5,500 వాహనాల పార్కింగ్ సామర్థ్యాన్ని కల్పించింది. అలాగే ఎలాంటి సిగ్నళ్లు లేని రోడ్ల ద్వారా సందర్శకులు నేరుగా తాము వెళ్లాల్సిన వేదికను చేరుకునేలా ఇంటర్నల్ రోడ్లను కూడా సిద్ధం చేసింది.





























