- Telugu News Photo Gallery Political photos TDP's Rammohan Naidu Becomes youngest Union Minister in Modi Cabinet 3.0
Ram Mohan Naidu: వారెవ్వా.. పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రిగా రామ్మోహన్ నాయుడు రికార్డు
నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో కొత్త మంత్రి వర్గం కొలువుతీరింది. అందులో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు స్థానం దక్కించుకున్నారు. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ పదవి దక్కింది.
Updated on: Jun 09, 2024 | 8:49 PM

ఎర్రన్నాయుడు మరణంతో 2012లో 26 ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు.. 2014, 2019, 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి మూడుసార్లు గెలిచారు. 2014లో రెడ్డి శాంతిపై, 2019లో దువ్వాడ శ్రీనివాస్‌పై, 2024లో పేరాడ తిలక్‌పై గెలిచారు. ఈసారి 3.27 లక్షల ఓట్ల మెజార్టీని అందుకున్నారు.

కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వయసు 36 ఏళ్లు. దీంతో ఈసారి కేబినెబ్‌లో పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రిగా సిక్కోలు చిన్నోడు రికార్డు నెలకొల్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు రామ్మోహన్ నాయుడు.

(టీడీపీ అధినేతతో రామ్మెహన్ నాయుడు) శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో జన్మించిన రామ్మెహన్ నాయుడు బీటెక్, ఎంబీఏ పూర్తిచేశారు. 2017లో టీడీపీ సీనియర్ బండారు సత్యనారాయణ మూర్తి చిన్న కుమార్తె శ్రావ్యను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.

(జనసేన అధినేతతో రామ్మెహన్ నాయుడు) రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణ మూర్తి ఈ ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా మాడుగుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రామ్మోహన్ సోదరి ఆదిరెడ్డి భవానీ కూడా 2019లో రాజమండ్రి అర్బన్ ఎమ్యెల్యేగా గెలుపొందారు. ఆమె రాజమండ్రికి చెందిన ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను పెళ్లాడారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్మేల్యేగా పోటీ చేసి గెలుపొందారు.

(నారా లోకేశ్‌తో రామ్మెహన్ నాయుడు) రామ్మోహన్ నాయుడు బాబాయి, కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి శాసనసభ్యుడిగా గెలిచారు. అచ్చెన్నాయుడు తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.

లోక్‌సభలో కన్సల్టేటివ్ కమిటీ, హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ, అధికార భాష, వెకబడిన వర్గాల సంక్షేమ కమిటీలలో రామ్మోహన్ నాయుడు మెంబర్‌గా ఉన్నారు. లోక్‌సభలో ఆయన స్పీచ్‌లు చాలా పాపులర్. పార్లమెంట్ చర్చలో హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తారని రామ్మోహన్ నాయుడుకు పేరుంది. ఆయన యూత్‌లో ఫాలోయింగ్ ఎక్కువ.





























