Snake Catches with Tail: స్నేక్ క్యాచర్స్ పాముని తోక పట్టుకునే ఎందుకు బంధిస్తారు.. కారణం ఇదే
భూమి మీద నివసించే జీవుల్లో పాములు ఒకటి.. ఈ పాముల్లో విషపూరితమైనవి, విషం లేనివి కూడా ఉన్నాయి. అయినా సరే పాము అంటే చాలు భయం వేస్తుంది. ఎటువంటి పాముని చూసినా సరే దానికి అందకుండా వీలైంత దూరమా పారిపోతాం. అయితే పాములు వివిధ కారణాలతో ఇంటి ఆవరణలోకి ఇళ్ళలోకి పరిసర ప్రాంతాల్లోకి వస్తాయి. ఆ పాము కనుక విష సర్పం అయితే అక్కడ ఏర్పడే పరిస్థతి గురించి చెప్పనలవి కానిది. భయంతో పాముని పట్టుకునే వారి కోసం పరుగులు పెడతారు. అయితే కొంతమంది ఎటువంటి పాముని అయినా సరే చాలా ఈజీగా పట్టుకుంటారు. అయితే వీరు పాముని ఎలా నియంత్రించి బంధిస్తారో తెలుసా..
Updated on: Jul 08, 2025 | 6:50 PM

అడవులు తరిగి పోవడం, విపరీతమైన ఎండ, భారీ వర్షాలు ఇలా వివిధ కారణాలతో ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో లేదా ఇంట్లో పాములు కనిపిస్తూ ఉంటాయి. ఇవి విషపూరితమైన పాములు అయితే అక్కడ ఒక్కసారిగా అలజడి ఏర్పడుతుంది. ఆ పాముని చంపడానికి లేదా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకొక్కసారి పాముని పట్టే సమయంలో విషపూరితమైన పాము అయితే దాని కాటుకి గురై మరణించిన వారు కూడా ఉన్నారు.

అయితే ఎక్కువ మంది పాములను పట్టుకుని బంధించేందుకు స్నేక్ క్యాచర్స్ ని లేదా స్నేక్ రెస్క్యూ టీమ్ సభ్యులను పిలుస్తారు. వారు ఎటువంటి విషపూరితమైన పాముని అయినా సరే చాకచక్యంగా పట్టుకుని దానిని ఒక గొనె సంచిలో వేసి తీసుకుని వెళ్తారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచి పెడతారు. అయితే వీరు పాముని పట్టుకునేందుకు పాము తోకని పట్టుకుంటారు. పాము తోకతో దానిని నియంత్రిస్తారంటే..

ఎటువంటి పాముని బంధించాలన్నా పాములను పట్టుకునేవారు వాటి తొకలను పట్టుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే.. పాము శరీరంలోని అన్ని భాగాలకంటే.. తోకలో తక్కువ ఎముకలు ఉంటాయి. దీంతో పాము తోకకు తక్కువ శక్తి ఉంటుంది. అందుకనే తోకని పట్టుకుని పామును నియంత్రించడం సులభం అవుతుంది.

పాము తోక చుట్టూ ఉన్న ప్రాంతం తక్కువ సంచలనాన్ని కలిగి ఉంటుంది. పాము తన తోకకి ఉన్న బలంతో తన శరీరాన్ని నియంత్రించలేదు. అది కోరుకున్నప్పటికీ ఏమీ చేయలేకపోతుంది. అంతేకాదు నిపుణులు పామును దాని తోకను పట్టుకున్నప్పుడు.. వారు తోకను కొద్దిగా తిప్పుతూ ఉంటారు.. తద్వారా పాము పాముని బంధించిన వారి శరీరానికి దూరంగా ఉంటుంది. కోరుకున్నా దగ్గరకు రాదు.

తోకని పట్టుకుని పాముని బంధించడం ప్రభావవంతం అయినప్పటికీ అన్ని రకాల పాములకు ఇది నమ్మదగిన పద్ధతి కాదు. కోబ్రాస్, వైపర్స్ వంటి కొన్ని పాములు.. వాటి తోకను పట్టుకున్నప్పుడు కూడా ఆశ్చర్యకరమైన వేగం, శక్తితో స్పందించి తమని బంధించిన వారిని కాటు వేయగలవు. అందువల్ల పాములను పట్టుకునేటప్పుడు పాము ప్రవర్తన గురించి అనుభవం, జ్ఞానం చాలా అవసరం

అందుకనే పామును పట్టుకునే పని నిపుణులు మాత్రమే చేయాలి. వారికి పాము జాతి, అలవాట్లు, దానిని నియంత్రించే విధానం, దాని హావభావాల పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. పొరపాటన కూడా మీరు స్వయంగా పామును పట్టుకోవడానికి ప్రయత్నించకండి. పాము చాలా చురుకైనది. ఒక చిన్న పొరపాటు ఖరీదు మీ ప్రాణాలు కావొచ్చు.( ఈ వార్త మీకు అవగాహన కల్పించడానికి మాత్రమే ఇవ్వబడింది. ఈ వార్తని మేము సాధారణ సమాచారం సహాయంతో పాఠకులకు అందించం. దీనిని tv9 తెలుగు నిర్ధారించలేదు.)




