- Telugu News Photo Gallery Is drinking too much water dangerous? Know these things for hydration and kidney health
Health Tips: వామ్మో.. నీరు ఎక్కువగా తాగితే ఆ సమస్యలు తప్పవంట.. జాగ్రత్త మరి..
ఎంత ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి అంత మంచిది అంటారు. దీన్ని వల్ల డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు. కానీ ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి హానికరమా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రధానంగా కిడ్నీలకు.. అధికంగా నీటిని తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Updated on: Sep 17, 2025 | 7:43 PM

శరీరానికి నీరు చాలా అవసరం. కొంచెం నీరు తగ్గినా డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే పుష్కలంగా నీరు తాగాలని వైద్యులు చెబుతారు. కానీ ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందా? అవును, మీరు ఎక్కువగా నీరు తాగితే మీ శరీరంలో ద్రవ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది కిడ్నీలపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది.

మన శరీరంలో కిడ్నీలు ఫిల్టర్ వ్యవస్థగా పనిచేస్తాయి. అదనపు నీరు రక్తప్రవాహంలో కలిసినప్పుడు, కిడ్నీలు దానిని ఫిల్టర్ చేయలేవు. అప్పుడు హైపోనాట్రేమియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే రక్తంలో సోడియం స్థాయిలు పలుచబడిపోతాయి. ఈ పరిస్థితి వల్ల కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఇది వెంటనే జరగకపోయినా దీర్ఘకాలంలో కిడ్నీల పనితీరుపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది.

రోజుకు ఎంత నీరు త్రాగాలి అనేదానికి ఒక సాధారణ నియమం లేదు. వాతావరణం, వయస్సు, ఆరోగ్యం వంటి అంశాలను బట్టి ఇది మారుతుంది. ఆరోగ్యకరమైన కిడ్నీలు గంటకు 0.8 నుంచి 1 లీటరు నీటిని ఫిల్టర్ చేయగలవు. రోజుకు 2.5 నుంచి 3.5 లీటర్ల నీరు సరిపోతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి కేవలం నీరు మాత్రమే కాదు, ఆహారం, పండ్లు, హెర్బల్ టీలు, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి వాటి నుంచి కూడా తీసుకోవచ్చు.

అధిక హైడ్రేషన్ లక్షణాలు: ఎక్కువ నీరు తాగడం వల్ల మెదడు వాపు, వికారం, గందరగోళం, మూర్ఛలు వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా వ్యాయామం చేసేవారు, కిడ్నీలు లేదా గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

ఒకేసారి ఎక్కువ నీరు తాగే బదులు, రోజంతా కొద్దికొద్దిగా తాగండి. నీటితో పాటు, నీటి శాతం ఎక్కువగా ఉండే దోసకాయలు, పుచ్చకాయ, నారింజ వంటి పండ్లు, కూరగాయలు తినండి. హెర్బల్ టీలు, కొబ్బరి నీరు, మజ్జిగ వంటివి తాగడం ద్వారా ఎలక్ట్రోలైట్‌లు సమతుల్యంగా ఉంటాయి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.




