
రాత్రి 7-8 గంటలు నిద్ర తర్వాత కడుపు ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో కడుపులో సహజంగా కొంత 'ఆమ్లం' ఉత్పత్తి అవుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు దానిలోని కెఫీన్, టానిన్ ఈ ఆమ్లాన్ని మరింత పెంచుతాయి. అందుకే చాలా మంది ఉదయం టీ తాగిన తర్వాత గుండెల్లో మంట లేదా పుల్లటి త్రేనుపులతో బాధపడుతుంటారు.

టీలో చక్కెర కూడా ఉంటుంది కాబట్టి, మనకు కాసేపటి వరకు ఉత్తేజంగా అనిపిస్తుంది. కానీ ఈ శక్తి ఎక్కువసేపు నిలవదు. కొంతసేపటి తర్వాత రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోతుంది. అప్పుడు రోజంతా అలసటగా, నీరసంగా అనిపించడం మొదలవుతుంది. శరీరానికి నిజమైన శక్తి అవసరమైతే టీకి బదులుగా పోషకమైన బ్రేక్ పాస్ట్ తీసుకోవడం అవసరం.

టీలో 'టానిన్' అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థం మనం తినే ఆహారం లేదా పాల నుండి కాల్షియం, ఐరన్‌ను శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో టీ తాగితే శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. ఇలా ఎముకలకు తగినంత కాల్షియం అందకపోవడం వల్ల ఎముకల్లో నొప్పి మొదలవుతుంది.

ఉదయం నిద్రలేచిన తర్వాత శరీరానికి నళ్లు అవసరం అవుతుంది. కానీ నీళ్లకు బదులు టీ తాగడం వల్ల.. అదొక ఒక మూత్రవర్ధక పానీయంగా పని చేస్తుంది. అంటే టీ తాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది. దీనివల్ల శరీరంలో నీటి పరిమాణం మరింత తగ్గిపోతుంది. నిర్జలీకరణం (డీహైడ్రేషన్) కారణంగా కండరాల నొప్పులు, తిమ్మిర్లు, తలనొప్పులు సంభవిస్తాయి.

టీలోని కెఫీన్ మెదడుపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఖాళీ కడుపుతో ఎక్కువగా టీ తాగడం వల్ల చంచలంగా, ఆందోళనగా, ఒత్తిడికి గురైనట్లు అనిపిస్తుంది. అలాగే ఉదయం టీ తాగే అలవాటు రాత్రి మన నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల త్వరగా నిద్రపోవడం కష్టమవుతుంది.