తాను చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో ట్రాక్ సిస్టమ్ లేదని, అన్నీ లైవ్ రికార్డింగ్‌లే ఉండేవని శైలజ వివరించారు. సింగిల్ టేక్‌లో 30 మంది ఆర్కెస్ట్రాతో కలిసి పాడాల్సి వచ్చేదని, అది ఎంతో ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఆ పాటలకు అద్భుతమైన స్పష్టత, ప్రాణం ఉండేవని పేర్కొన్నారు. 1977లో హైదరాబాద్‌లో జరిగిన ఆల్ ఇండియా సింగర్స్ కాంపిటీషన్‌లో వసంత గారితో కలిసి పాల్గొన్నానని, తనకు రెండవ బహుమతి వచ్చిందని తెలిపారు. ఆ పోటీ తర్వాత, అన్నయ్య పిలుపుతో తమ ఇద్దరినీ చెన్నైకి రప్పించారని చెప్పారు. లలిత సంగీతం కూడా నేర్చుకున్నానని, తన అక్క రాసి స్వరపరిచిన ఒక లలిత సంగీత గీతాన్ని అన్నయ్యతో కలిసి డీడీలో పాడానని గుర్తు చేసుకున్నారు. శైలజ గారు తమ పెంపకం గురించి మాట్లాడుతూ, తన తల్లి, తండ్రి, అన్నయ్యల ప్రభావం తనపై ఎక్కువగా ఉందని చెప్పారు. తల్లి ఫ్రీడమ్ ఇచ్చినా, దానిని దుర్వినియోగం చేయకూడదని నేర్పారని, పద్ధతిగా ఉండాలని సూచించేవారని తెలిపారు.