- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2021: Teamindia openers Fine and Spinners struggle in Warm up matches 6th bowler still hiding
T20 World Cup 2021: వార్మప్ మ్యాచుల్లో బయటపడ్డ కీలక విషయాలు.. ఆ ప్రశ్నకు సమాధానమే దొరకలే.. కోహ్లీ సేన ఏం చేయనుందో?
ప్రపంచకప్‌లో ఆరంభ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీంలతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లలో భారత జట్టు విజయం సాధించింది. అయితే ఈ రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా ముందు కొన్ని మంచి విషయాలతోపాటు మరికొన్ని ఆందోళనకరమైన అంశాలు బయటపడ్డాయి.
Updated on: Oct 21, 2021 | 7:39 AM

virat kohli

ఫుల్ ఫాంలో ఓపెనర్లు- భారత జట్టు ముగ్గురు ఓపెనర్లతో ప్రపంచకప్ బరిలో నిలిచింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ప్రధాన ఓపెనర్లు కాగా, ఇషాన్ కిషన్ రిజర్వ్ ఓపెనర్. తొలి మ్యాచ్‌లో రోహిత్‌కు విశ్రాంతినిచ్చారు. అటువంటి పరిస్థితిలో రాహుల్, ఇషాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇంగ్లండ్‌పై, ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు. రాహుల్ ఆస్ట్రేలియాపై కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేసి ఫాంలోకి వచ్చాడు.

మిడిల్ ఆర్డర్ పై అంచనాలు- టీమిండియాలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యలతో మిడిలార్డర్ బలంగా కనిపిస్తోంది. మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు, కానీ రిషబ్ పంత్ బలమైన ఇన్నింగ్స్‌తో లైన్‌లోకి వచ్చాడు. ఇక రెండవ మ్యాచ్‌లో, సూర్యకుమార్ యాదవ్ కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. వేగంగా 38 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేయడానికి రాలేదు. కానీ, బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అయితే కొన్ని మంచి షాట్లతో ఆకట్టుకున్నాడు.

స్పిన్నర్ల పరిస్థితి - భారత జట్టు నలుగురు స్పిన్నర్లతో సిద్దమైంది. అయితే ఈ వార్మప్ మ్యాచ్‌లలో రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే సమర్థవంతంగా రాణించాడు. జట్టులోకి తిరిగి వచ్చిన అశ్విన్ ఇంగ్లండ్‌పై ఆర్థికంగా బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియాపై రెండు వికెట్లు తీసుకున్నాడు. అయితే, అశ్విన్ మినహా మరే ఇతర స్పిన్నర్ ఆకట్టుకోలేకపోయాడు. లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ మొదటి మ్యాచ్‌లో ఘోరంగా విఫలం కాగా, రెండో మ్యాచ్‌లో ఆర్థికంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి రెండో మ్యాచ్‌లో అడుగుపెట్టారు. కానీ, అంతగా ప్రభావం చూపించలేకపోయారు.

పేసర్ల ప్రదర్శన అద్భుతం- జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ టీమిండియా పేస్ దాడికి మారుపేరుగా నిలిచారు. మొదటి మ్యాచ్‌లో ముగ్గురు తమను తాము పరీక్షించుకున్నారు. వారిలో, బుమ్రా అత్యంత పదునైన బంతులతో ఆకట్టుకున్నాడు. ఆర్థికంగా బౌలింగ్ చేసి ఓ వికెట్ కూడా తీసుకున్నాడు. మరోవైపు, షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. భువీ విషయానికి వస్తే, మొదటి మ్యాచ్‌లో పూర్తిగా లయ తప్పి విఫలమయ్యాడు. అయితే రెండవ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి, బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టగలిగాడు. శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు. ఇందులో 3 ఓవర్ల బౌలింగ్‌లో 30 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీసుకోకుండా నిరాశపరిచాడు.

6 వ బౌలర్ ఎవరు- టీమిండియా ముందున్న అతి పెద్ద ప్రశ్న 6 వ బౌలర్. రెండు వార్మప్ మ్యాచ్‌లలో సమాధానం దొరకలేదు. హార్దిక్ పాండ్యా ఏ మ్యాచ్‌లోనూ బౌలింగ్ చేయలేదు. మొదటి మ్యాచ్‌లో కేవలం ఐదుగురు బౌలర్లను మాత్రమే ఉపయోగించగా, రెండో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 2 ఓవర్లను బౌలింగ్ చేసి ఆరవ బౌలర్ కొరతను తీర్చాడు. కానీ ప్రధాన మ్యాచ్‌లలో కోహ్లీ బౌలింగ్ చేయడనే తెలుస్తోంది. అంటే, ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు.





























