- Telugu News Photo Gallery Cricket photos Ind vs eng team india captain dominates in england his eyes on 5 big records in england
IND vs ENG: 5 టెస్టుల్లో 5 రికార్డులపై కన్నేసిన టీమిండియా కెప్టెన్.. ఆ దిగ్గజాల సరసన చేరే అరుదైన అవకాశం!
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభమైన వెంటనే టీమిండియా కెప్టెన్.. పలు రికార్డుల భరతం పట్టేందుకు సిద్ధమయ్యాడు. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం..
Updated on: Aug 02, 2021 | 7:33 AM

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఘోర పరాజయం తరువాత టీమిండియా నూతనోత్సాహంతో ఇంగ్లండ్‌తో టెస్టులకు సిద్ధమైంది. ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ మొదలైన వెంటనే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను బ్రేక్ చేసే పనిలో ఉంటాడని తెలుస్తోంది. పరుగుల యంత్రంగా పేరుగాంచిన విరాట్.. జట్టు విజయంతోపాటు ఈ రికార్డులు సాధించేందుకు రెడీ అవుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే 5 టెస్టుల సిరీస్‌లో భారత కెప్టెన్ 5 రికార్డులపై కన్నేశాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో 8000 పరుగులు చేయడానికి 453 పరుగుల దూరంలో ఉన్నాడు. అతను ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో సులభంగా సాధించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం, అతను 92 టెస్టుల్లో 7547 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఒకవేళ విరాట్ ఇంగ్లండ్ నుంచి సిరీస్‌లో 8000 పరుగులు పూర్తి చేస్తే.. అతను టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల విషయంలో జస్టిన్ లాంగర్ (7696), ఇయాన్ బెల్ (7727), మైఖేల్ ఎర్తోన్ (7728) లను దాటేస్తాడు.

ఇంగ్లండ్‌పై 2000 టెస్టు పరుగులు పూర్తి చేయడానికి విరాట్ కోహ్లీ 211 పరుగుల దూరంలో ఉన్నాడు. రాబోయే టెస్ట్ సిరీస్‌లో ఈ ఫీట్ చేయగలిగితే రాహుల్ ద్రవిడ్, గవాస్కర్, సచిన్ క్లబ్‌లో చేరనున్నాడు.

టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన టాప్ 5 భారత బ్యాట్స్‌మెన్‌లలో విరాట్ కోహ్లీకి అవకాశం ఉంది. ప్రస్తుతం, అతను ఆరో స్థానంలో ఉన్నాడు. కానీ కోహ్లీ మరో 3 అర్ధ సెంచరీలు సాధిస్తే.. సచిన్, ద్రవిడ్, గవాస్కర్, లక్ష్మణ్‌ల క్లబ్‌లో చేరనున్నాడు.

ప్రస్తుతం, విరాట్ కోహ్లీ.. స్టీవ్ స్మిత్‌తో సమానంగా టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించాడు. ఇద్దరూ 27 సెంచరీలు చేశారు. విరాట్ 2019 నవంబర్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీలు చేయడం మరిచిపోయాడు. ఈ సిరీస్‌లో సెంచరీల కరవును అధిగమిస్తే.. స్మిత్‌ని అధిగమించడమే కాకుండా ఆమ్లా, మైఖేల్ క్లార్క్‌ల(28 సెంచరీలు) సరసన చేరనున్నాడు.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు గెలిచిన విషయంలో వెస్టిండీస్ క్లైవ్ లాయిడ్‌ని కూడా దాటేసే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మొదటి టెస్ట్‌లో విజయం సాధిస్తే.. విరాట్ ఈ రికార్డును సాధిస్తాడు. ప్రస్తుతం ఇద్దరూ 36 టెస్టులు గెలిచారు. లాయిడ్ 74 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ చేయగా, విరాట్ 61 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ చేరుకున్నాడు.




