- Telugu News Photo Gallery Air India Crash: Indian Politicians Killed in Plane Crashes, A Tragic List
Air India Crash: విమాన ప్రమాదాల్లో ఇప్పటి వరకూ మరణించిన రాజకీయ నేతలు ఎంతమందో తెలుసా..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన 241 మందిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన వెంటనే బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడి మంటల్లో చిక్కుకుంది. విమాన ప్రమాదంలో రాజకీయ నాయకులు మరణించడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటివరకు ఎంతమంది రాజకీయ నాయకులు విమాన ప్రమాదాల్లో మరణించారో తెలుసా
Updated on: Jun 14, 2025 | 12:18 PM

బల్వంతరాయ్ మెహతా (1965): గుజరాత్ రెండవ ముఖ్యమంత్రి అయిన బల్వంతరాయ్ మెహతా 1965 లో భారత్ పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళ జెట్‌లు పౌర విమానాన్ని ప్రమాదవశాత్తూ కూల్చివేశాయి. ఈ ఘటనలో బల్వంత్ రాయ్ మరణించారు. ఆయన భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో అధికారిక పర్యటనలో ఉన్నారు.

గుర్నామ్ సింగ్ (1973): శిరోమణి అకాలీదళ్ నాయకుడు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గుర్నామ్ సింగ్ విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఉన్నారు. ఆయన మే 31, 1973న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. గుర్నామ్ సింగ్ రెండుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా విధులను నిర్వహించారు. ఆయన మార్చి 8, 1967 నుంచి నవంబర్ 25, 1967 వరకు, రెండవ సారి ఫిబ్రవరి 17, 1969 నుంచి మార్చి 27, 1970 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు.

సంజయ్ గాంధీ (1980): మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ కూడా విమాన ప్రమాదంలో మరణించిన నాయకులలో ఉన్నారు. ఆయన 1980 జూన్ 23న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. సంజయ్ గాంధీ రెండు సీట్ల విమానాన్ని నడుపుతున్నారు. ఈ విమానం సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది.

మాధవరావు సింధియా (2001): కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా దేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి. అంతేకాదు మాధవరావు సింధియా గ్వాలియర్ రాజకుటుంబ సభ్యుడు. ఆయన సెప్టెంబర్ 30, 2001న ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలోని భోగావ్‌లో జరిగిన చార్టర్డ్ విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరగనున్న ర్యాలీలో ప్రసంగించడానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

GMC బాలయోగి (2002): 2002 సంవత్సరంలో అప్పటి లోక్‌సభ స్పీకర్, టిడిపి నాయకుడు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని కైకలూరులో మార్చి 3, 2002న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్‌లో గాలిలో ఉన్నప్పుడు సాంకేతిక లోపం ఏర్పడిందని.. అందుకనే ఈ హెలికాప్టర్ ప్రమాదానికి కారణం అని చెప్పబడింది.

ఓపీ జిందాల్, సురేంద్ర సింగ్ (2005): ప్రముఖ పారిశ్రామికవేత్త ఓ.పి. జిందాల్, హర్యానా మాజీ ఇంధన మంత్రి, మాజీ కేంద్ర మంత్రి సురేంద్ర సింగ్ (మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ కుమారుడు) 2005 మార్చి 31న ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి (2009): అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2 సెప్టెంబర్ 2009న నల్లమల కొండలలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. భారీ శోధన ఆపరేషన్ తర్వాత ప్రమాద స్థలాన్ని గుర్తించారు.

దోర్జీ ఖండూ (2011): ఏప్రిల్ 30, 2011న అప్పటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ తన పవన్ హన్స్ హెలికాప్టర్ చైనా సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతంలో కూలిపోవడంతో మరణించారు. ఐదు రోజుల తర్వాత హెలికాప్టర్ శిథిలాలు కనుగొనబడ్డాయి.

విజయ్ రూపానీ (2025): గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన తన కుటుంబాన్ని కలవడానికి లండన్ వెళ్తున్నారు. గుజరాత్ బిజెపి అధ్యక్షుడు సిఆర్ పాటిల్ ఆయన మరణాన్ని ధృవీకరించారు.



















