- Telugu News Photo Gallery 2024 Medaram Mahajatara Dates Finalises by The Medaram Priests Association
Medaram Jathara: 2024 మేడారం మహాజాతర తేదీలు ఖరారు..
మేడారం జాతర వచ్చిందంటే చాలు. కోట్లాది మంది భక్తులు కుటుంబ సమేతంగా అక్కడికి తరలివెళ్తారు. 4 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతర జరుగుతుంది. విగ్రహాలు లేని విశిష్ట జాతరగా గుర్తించబడిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. 2024లో జరగనున్న జాతర తేదీలను మేడారం పూజారులు ప్రకటించారు.
Updated on: May 03, 2023 | 4:42 PM

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అందుకే ఈ జాతరకు తెలంగాణ కుంభమేళా అనే పేరుకూడా ప్రసిద్ధి.

ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ఈ మహా జాతర జరుగుతుంది. జాతర సమయంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మను పూజించేందుకు కోట్లాది భక్తులు తరలివస్తారు. రెండేళ్లకోకసారి మేడారం మహాజాతరను నిర్వహిస్తారు. అయితే మధ్యలో ఏడాది మినీ మేడారం జాతరను నిర్వహిస్తుంటారు.

ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధిక మంది హాజరయ్యే పండుగ మేడారం. ఈ గిరిజన జాతరకు సుమారు 10 కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒడిషా లాంటి ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.

ఈ జాతరకు వచ్చే భక్తులు గద్దెలపై సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకొని, పసుపు, కుంకుమ, నైవేద్యం, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేస్తారు.

2023లో మేడారం మినీ జాతర ముగిసింది. వచ్చే ఏడాది మేడారం మహాజాతర జరగనుంది. అయితే 2024లో సమ్మక్క సారలమ్మ మహాజాతర జరిగే తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఆ జాతర నిర్వహించనున్నట్లు పేర్కొంది.

2024 ఫిబ్రవరి 21న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ, గోవింద రాజులు, పగిడిద్ద రాజులు దేవుళ్లను గద్దెల మీదకు తీసుకొస్తారు. 22న సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు. 23 న ఈ దేవుళ్ళుకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే చివరి రోజు 24న దేవుళ్లు వనప్రవేశం చేస్తారు.





























