AAP: చిన్న ప్రాంతీయ పార్టీగా మొదలై.. నేడు జాతీయ పార్టీలనే ఊడ్చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ జర్నీ..
AAP: దశాబ్దం కిందట ఎలాంటి అట్టహాసాలు, ఆర్భాటాలు లేకుండా ఆవిర్భవించిన చిన్న ప్రాంతీయ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. పంజాబ్‌లో (Punjab Elections) గత రికార్డులను బద్దలు కొడుతూ ఘన విజయం సాధించిన..
AAP: దశాబ్దం కిందట ఎలాంటి అట్టహాసాలు, ఆర్భాటాలు లేకుండా ఆవిర్భవించిన చిన్న ప్రాంతీయ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. పంజాబ్‌లో (Punjab Elections) గత రికార్డులను బద్దలు కొడుతూ ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.. కేవలం పదేళ్ల వ్యవధిలోనే రెండు రాష్ట్రాలలో అధికారంలోకి రావడం అన్నది మామూలు విషయం కాదు.. గమ్మత్తేమిటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రెండు రాష్ట్రాలలోనే అధికారంలో ఉండటం. పంజాబ్‌లో ఆప్ సాధించిన విజయం కూడా అసాధారణమైనదే! గెలుపుతో పాటు 60 ఏళ్ల రికార్డును తుచిడిపెట్టేసింది చీపురు పార్టీ. 1962 తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓకే పార్టీ అంటే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా 92 సీట్లు గెలవడం ఇదే మొదలు. అప్పట్లో కాంగ్రెస్ 90 సీట్లు గెల్చుకుంది. 1997లో బీజేపీ- అకాలీదళ్ కూటమి 93 స్థానాలు గెల్చుకున్నా దాన్ని పరిగణనలోకి తీసుకోలేం. అన్నా హజారే లోక్‌పాల్ డిమాండ్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అచిరకాలంలోనే ఈ స్థాయికి చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదు. 2011 ఏప్రిల్ నెలలో సామాజిక కార్యకర్త అన్నా హజారే దేశ రాజధానిలో అవినీతి వ్యతిరేక దీక్ష చేపట్టారు.
డిసెంబర్ వరకు సాగిన ఈ దీక్షా సమయంలోనే కేజ్రీవాల్ పది మంది దృష్టిలో పడ్డారు. హజారే దీక్ష చేస్తున్న సమయంలో లభించిన ప్రజాదరణను చూసిన కేజ్రీవాల్‌కు అప్పుడే పార్టీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అన్నా హజారే నుంచి విడిపోయిన కేజ్రీవాల్ ఇతర ఉద్యమకారులతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. మొదట్లో ఈ పార్టీ పట్ల ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. ఇది కూడా మఖలో పుట్టి పుబ్బలో పోయే బాపతే అనుకున్నారు చాలా మంది. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేసినప్పుడు నవ్వుకున్నారు కూడా! కానీ ఆ ఎన్నికల్లో అనూహ్యంగా ఆప్ 28 స్థానాలను గెల్చుకుంది. బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీగా అవతరించింది. అప్పుడు కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చింది ఆప్. ఎందుకో కానీ ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించలేకపోయింది.
ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను విధించింది ప్రభుత్వం. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో పోటీ చేసింది ఆప్.. అందులో నాలుగు లోక్‌సభ స్థానాలను గెల్చుకుని జాతీయ పార్టీలకు షాకిచ్చింది. ఇది జరిగిన ఏడాదికి ఢిల్లీ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు వచ్చాయి. 2015 ఫిబ్రవరిలో జరిగిన ఆ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 54 శాతం ఓటు షేరుతో 70 స్థానాలలో 67 స్థానాలను గెల్చుకుంది. ఇదో రికార్డు. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో తనదైన మార్కును చూపించింది. కేవలం ఢిల్లీ వరకే పరిమితం కాకూడదని దేశమంతటా విస్తరించాలని అనుకుంది. అదే టార్గెట్‌గా పెట్టుకుంది.
2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ధైర్యం చేసి బరిలో దిగింది. 20 స్థానాలను గెల్చుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అదే సమయంలో గోవాలోనూ పోటీ చేసి 6.3 శాతం ఓట్లను సంపాదించుకోగలిగింది. అక్కడితో ఆగలేదు. అటు తర్వాత వచ్చిన చత్తీస్‌గఢ్, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, మహారాష్ట్ర, నాగాలాండ్, ఒడిషా, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 35 స్థానాల్లో పోటీ చేసిన ఆప్ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెల్చుకోగలిగింది. ఈ పరాజయాలు ఆప్‌కు గుణపాఠం నేర్పాయి. గ్రౌండ్ లెవల్లో పార్టీని బలోపేతం చేయకుండా వచ్చిన ప్రతీ ఎన్నకల్లోనూ పోటీ చేయడం వల్ల ఒనగూరేదేమీ ఉండదని తెలుసుకోగలిగింది. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మణిపూర్‌ను వదిలేసి మిగతా నాలుగు రాష్ట్రాలలోనూ పోటీ చేసింది. పంజాబ్‌లో ఘన విజయం సాధించిన ఆప్ మిగతా మూడు రాష్ట్రాలలోనూ చెప్పుకోదగ్గ ఓటు శాతాన్ని సంపాదించుకుంది. ఈ ఏడాదిలో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లకు ఎన్నికలు వస్తాయి. ఆ రెండు చోట్ల కూడా ఆప్ పోటీ చేయడానికి రెడీ అవుతోంది. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేయబోతున్నదన్న ఆసక్తి అప్పుడే అందరిలో మొదలయ్యింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. విజయాలను అందుకుని చాలా కాలమయ్యింది. గెలిచిన చోట్ల అధికారాన్ని నిలబెట్టుకోలేకపోతోంది.. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీల ఛరిస్మా పెద్దగా పని చేయడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ ప్లేస్‌ను భర్తీ చేయాలనుకుంటోంది ఆప్ . జాతీయ పార్టీలా ఎదగాలనుకుంటోంది. జాతీయ పార్టీగా అవతరిస్తే దేశమంతటా చీపురు గుర్తుతో పోటీ చేయవచ్చు. కానీ జాతీయపార్టీగా గుర్తింపుపొందడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఆషామాషీ కాదు. సాధారణ ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాలలో పోలైన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. లోక్‌సభ ఎన్నికల్లో రెండు శాతం ఓట్లతో 11 స్థానాలను సంపాదించాలి. నాలుగు అంతకు మించి రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీగా గుర్తింపైనా ఉండాలి. గోపాలో ఆ పార్టీ ఓటు షేర్ 6.77 శాతం ఉంటే, ఉత్తరాఖండ్‌లో ఇంచుమించు నాలుగు శాతం ఓట్లను సాధించింది. ఉత్తరప్రదేశ్‌లో మాత్రం 0.3 శాతం ఓట్లనే సాధించగలిగింది.
ప్రస్తుతానికి ఆప్‌కు ఒకే ఒక్క లోక్‌సభ స్థానం ఉంది. ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని చెప్పుకున్నాం కదా! ఆ రెండు చోట్లా గణనీయమైన ఓట్లను సాధించగలమనే నమ్మకంతో ఆప్ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీని చాలా మంది కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేని కూటమి కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ కూటమిలో ఆప్ కూడా చేరితే మాత్రం కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ సాధ్యం కాదన్నది కొందరి భావన.
Also Read: Heart Disease: పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా గుండె జబ్బులు.. కారణం ఏంటంటే..!
Kamal Haasan: పదేళ్లలో దుమ్ము దులిపేశారు.. కేజ్రీవాల్‌కు కంగ్రాట్స్ చెప్పిన కమల్ హాసన్
Angiogram: అసలు యాంజియోగ్రామ్ అంటే ఏమిటి.. ఏ సమయాల్లో చేస్తారు..? ఎందుకు చేస్తారు..?