Rain Warning : తెలుగు రాష్ట్రాలపై ఆదివారం నుంచి బ్రేక్ మాన్‌సూన్ ప్రభావం మొదలైందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని కారణంగా కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తూ ఈ నెల 23 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రస్తుత వాతావరణం రైతులు వ్యవసాయ పనులు చేసుకునేందుకు అనువుగా ఉంటుందని, రైతులు నారుమళ్లు, దుక్కి ఇతర పనులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
కాగా, తెలంగాణ సహా ఉత్తరాది రాష్ట్రాలలో చెదురుమదురు జల్లుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఢిల్లీలలో భారీ వర్షాలు కురవగా ఏపీలో మాత్రం అంతగా వర్షపాతం లేదు. ప్రస్తుతం జూన్ నెలాఖరు వచ్చినా ఏపీలో వర్షాల ప్రభావం అంతగా కనిపిండం లేదు. రుతుపవనాల రాకతో వానలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేసినా అది ఏపీలో అంతగా ప్రభావం కనిపించలేదు.
ఇక, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి బలహీన పడటంతో వర్షాల ప్రభావం కాస్త తగ్గినట్లుగా వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రుతుపవన ద్రోణి బలహీన పడటం వలనే రాష్ట్రంలో వర్షాలు పడే సూచనలు అంతగా లేవని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.