TELANGANA POLITICS: తెలంగాణలో రాజకీయ పార్టీల దూకుడు.. మే 5,6,7 తేదీల్లో తరలి రానున్న జాతీయ నేతలు.. ఊపందుకున్న మాటల యుద్ధం

నువ్వొకటంటే నేను రెండంటా అంటూ మూడు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు దూకుడు ప్రదర్శిస్తుండడంతో తెలంగాణ పాలిటిక్స్ రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికల రేపేనా అన్న అనుమానం కలిగిస్తున్నాయి.

TELANGANA POLITICS: తెలంగాణలో రాజకీయ పార్టీల దూకుడు.. మే 5,6,7 తేదీల్లో తరలి రానున్న జాతీయ నేతలు.. ఊపందుకున్న మాటల యుద్ధం
Whatsapp Image 2022 05 04 At 8.00.20 Pm
Follow us

|

Updated on: May 04, 2022 | 8:46 PM

TELANGANA POLITICS HEATING UP NATIONAL LEADERS FLOW TO STATE:  తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలకు గడువు ఎంతుందో ఇదమిత్తంగా తెలియకపోయినా రాజకీయ పార్టీల హడావిడి.. నేతల హంగామా ఎన్నికల సమరాన్ని తలపిస్తున్నాయి. వివిధ అంశాల ఆధారంగా రోడ్డెక్కుతున్న రాజకీయ పార్టీలు, స్థానిక నాయకులకు అండగా బరిలోకి దిగుతున్న జాతీయ స్థాయి నేతల రాకపోకలతో తెలంగాణలో రాజకీయం రంజుగా మారింది. వరి ధాన్యం సేకరణతో మార్చి నుంచి తెలంగాణలో ఆరోపణల పర్వం, యాత్రల జోరు మొదలైనా.. ఏప్రిల్ నెల రెండో పక్షం నాటికి అవి మరింతగా ఊపందుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలు బీజేపీ BJP, కాంగ్రెస్ CONGRESS PARTY ప్రజలతో మమేకమయ్యేలా ప్రోగ్రామ్స్ రూపొందించుకుంటున్నాయి. అందుకు అనుగుణంగా కార్యాచరణతో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ BANDI SANJAY KUMAR చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పాదయాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతోంది. గద్వాల్ జిల్లా జోగులాంబ-ఆలంపూర్ నుంచి సంజయ్ పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకు పలువురు జాతీయ స్థాయి నేతలు సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు. కేసీఆర్ KCR ప్రభుత్వంపై సమర శంఖం పూరించారు. తాజాగా మే 5వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా J P NADDA వస్తున్నారు. సంజయ్ పాదయాత్ర సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతోపాటు పార్టీ నేతలకు (రాష్ట్ర పదాధికారులకు) దిశానిర్దేశం చేసేందుకు నడ్డా రానున్నారు. ముందుగా ఆయన మహబూబ్‌నగర్ సమీపంలోని భూత్పూర్ వద్ద పార్టీ రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత బండి సంజయ్ సారథ్యంలో జరగబోయే బహిరంగసభలో నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు. మే 14వ తేదీన బండి సంజయ్ పాదయాత్ర రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఎండ్ కాబోతోంది. మహేశ్వరం సమీపంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చెంత బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. దానికి కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాను రప్పించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు యధాశక్తి యత్నిస్తున్నారు. ఆయన రావడం ఖాయమేనని బీజేపీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయి నేతల రాక.. గులాబీ దళంపై పదునైన విమర్శలు, ఆరోపణలతో కాషాయదళం ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దమని చాటుతోంది. జాతీయ స్థాయి నేతల రాక సందర్భంగా ఇతర పార్టీల నుంచి కీలక నేతలను బీజేపీలో చేర్చుకునేలా కమలదళం పావులు కదుపుతోంది. తాజాగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మే 3వ తేదీన మరో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని కలిసిన కొండా.. మే 4వ తేదీన పాదయాత్రలో వున్న బండి సంజయ్‌తో భేటీ అయ్యారు. మే 5న జేపీ నడ్డా సమక్షంలో కొండా విశ్వేశ్వర రెడ్డి KONDA VISWESHWAR REDDY బీజేపీలో చేరుతున్నట్లు తాజాగా తెలుస్తోంది. తెలంగాణలోని కీలక నేతలను చేర్చుకోవడంతోపాటు.. గ్రౌండ్ లెవెల్లో కీలకాంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళి క్యాడర్‌ని పెంచుకునేందుకు, బూత్ స్థాయిలో బలపడేందుకు కమలం పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇక రేవంత్ రెడ్డి REVANTH REDDY రాష్ట్ర అధ్యక్షుడయ్యాక తెలంగాణ కాంగ్రెస్ TELANGANA CONGRESS పార్టీలో దూకుడు పెరిగింది. వరి ధాన్యం అంశం ఆధారంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం దొందూదొందేనంటూ రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ నేతలు మార్కెట్ యార్డుల్లో రైతుల్లో చైతన్యం తెచ్చేందుకు కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ రెడ్డి స్వయంగా తెలంగాణ జిల్లాల్లో పర్యటనకు వెళ్ళారు. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేపట్టారు. రైతాంగ సమస్యలను హైలైట్ చేసేందుకు యత్నించారాయన. ఈక్రమంలోనే తెలంగాణ పర్యటనకు అధినేత రాహుల్ గాంధీ RAHUL GANDHI ని ఒప్పించారు. వచ్చే ఎన్నికలకు సన్నాహక సభగా వరంగల్ WARANGAL సమీపంలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తమకు సెంటిమెంటుగా భావించే ఓరుగల్లు నుంచే వచ్చే ఎన్నికల సమరశంఖారావాన్ని పూరించాలన్నది వారి అభిమతం. మే 6,7 తేదీలలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఇందులో భాగంగా ఓరుగల్లు సభనుద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారు. అదేసమయంలో ఉస్మానియా యూనివర్సిటీ OSMANIA UNIVERSITYలో విద్యార్థులతో భేటీకి కూడా ప్లాన్ చేశారు. అయితే విద్యాసంస్థల్లో రాజకీయం ఏంటంటూ రాహుల్ సభకు ఓయూ విసి అనుమతి తిరస్కరించడంపై రాజకీయ దుమారం రేగింది. టీఆర్ఎస్ నేతల ఒత్తిడి వల్లనే వైస్ ఛాన్స్‌లర్ రాహుల్ సభకు అనుమతి నిరాకరించారంటూ కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ అనుబంధ విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. పలు మార్లు వీసీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఓయూలో రాహుల్ సభకు ఇంఛార్జీగా వున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కూడా వీసీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీసీని కలిసేందుకు యత్నించారు. అదేసమయంలో సభకు అనుమతి కోసం హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పాలకులు ఓయూలో రాజకీయ పార్టీల సభలకు అనుమతి లేదంటూ ఎన్నో సభలను అడ్డుకున్న ఉదంతాలు చూశాం. చాలా సార్లు ఓయూ ఎంట్రీ గేటు దగ్గర ఫైరింగ్ దాకా పరిస్థితి తీవ్రత చేరిన విషయం చూశాం. అదే పార్టీ నేతలు ఇపుడు ఓయూలో సభకు పట్టుబట్టడం కనిపిస్తోంది.  రాహుల్ పర్యటన తర్వాత వరుస కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోకి వెళ్ళేలా కాంగ్రెస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ముందుగా ఖరారైన షెడ్యూల్‌ ప్రకారం 6వ తేదీన రాహుల్‌ హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. మే7న ఓయూ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. 7న హైదరాబాద్‌లో వరుస కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొంటారు. తొలుత సంజీవయ్య పార్కుకు వెళ్లి సంజీవయ్య సమాధికి నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని పింగళి వెంకట్రాంరెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌కు వస్తారు. అక్కడ తెలంగాణ అమరుల కుటుంబాలను రాహుల్‌గాంధీ పరామర్శిస్తారు. మేధావి వర్గాలతోనూ తన భావాలను పంచుకోనున్నారు. అనంతరం గాంధీభవన్‌కు చేరుకుని టీపీసీసీ కార్యవర్గంతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకుని విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనాలని భావించారు. అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు వెళ్లి అక్కడ ఉన్న ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలను పరామర్శించేలా ప్లాన్ చేశారు.

అయితే.. బీజేపీలా దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా పార్టీలో వున్న లుకలుకలు మైనస్ పాయింట్‌గా కనిపిస్తున్నాయి. ఓరుగల్లు సభకు సన్నాహకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవల నిర్వహించిన సభకు పార్టీ రాష్ట్ర ప్రచార సారథి (స్టార్ క్యాంపెయినర్) కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దూరంగా వుండడం పెద్ద చర్చనీయాంశమైంది. విశేషమేంటంటే.. పార్టీ సన్నాహక సభకు డుమ్మా కొట్టిన వెంకట రెడ్డి.. బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరైన రహదారుల శంకుస్థాపన కార్యక్రమంలో తేలారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణకు 8 వేల కోట్లు కేటాయించడంతో.. దానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని హైదరాబాద్ శివారులోని శంషాబాద్ సమీపంలో ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో కమలం నేతలతో వెంకట రెడ్డి చట్టపట్టాలేసుకుని కనిపించారు. అయితే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాలో రహదారుల విస్తరణ కార్యక్రమం కాబట్టి ఆయన హాజరవడం సహజమే. కానీ సొంత పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సన్నాహక సభకు గైర్హాజరవడంపై మాత్రం పెద్ద చర్చే జరిగింది. ఆ రోజు సభ పెడితే తాను రాలేనని ముందే చెప్పేసినట్లు వెంకట రెడ్డి చెబుతున్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దూకుడుకు ధీటుగా గులాబీ నేతలు స్పందిస్తున్నారు. ఆ రెండు పార్టీల నాయకులు చేస్తున్న ప్రచారంపైనా.. లేవనెత్తుతున్న అంశాలపైనా ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. గ్రూప్ 1 పరీక్షలో ఉర్దూకు అనుమతించడంపై బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురితోపాటు అధ్యక్షుడు సంజయ్ అభ్యంతరం తెలిపారు. ఇంటర్వ్యూ కూడా లేని గ్రూప్ 1 సెలెక్షన్‌లో కేవలం ముస్లింలకు మాత్రమే వచ్చిన భాషలో పరీక్షకు అనుమతిస్తే వారు ఏమి రాసినా దానికి అధికంగా మార్కులేస్తే.. గ్రూప్ 1 ఉద్యోగాలన్నీ ముస్లింలకే దక్కుతాయన్నది బీజేపీ నేతల వాదన. బీజేపీ ఈ వాదన లేవనెత్తగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఎదురు దాడి చేశారు. పసుపుబోర్డు సంగతేంటని నిజామాబాద్ ఎంపీని నిలదీశారు కవిత. ఇలా నువ్వొకటంటే నేను రెండంటా అంటూ మూడు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు దూకుడు ప్రదర్శిస్తుండడంతో తెలంగాణ పాలిటిక్స్ రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికల రేపేనా అన్న అనుమానం కలిగిస్తున్నాయి.