AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR POLITICAL MOVES: వ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులు.. జాతీయ రాజకీయాలపై ఇక మరింత ఫోకస్.. ఢిల్లీలో సుదీర్ఘ మంతనాలకు ప్లాన్

లఖీంపురా ఖేరీ దుర్ఘటన తర్వాత జరిగిన యుపీ ఎన్నికల్లో రైతు ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగిన పశ్చిమ యూపీలో బీజేపీ తప్పకుండా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ లఖీంపురా ఖేరీ సహా పశ్చిమ యూపీలో బీజేపీ సత్తా చాటింది. ఇపుడు అదే లఖీంపురా ఖేరీకి కేసీఆర్ వెళ్ళేందుకు సిద్దమవుతుండడంతో ఆ అంశాన్ని తిరగదోడేందుకేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

KCR POLITICAL MOVES: వ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులు.. జాతీయ రాజకీయాలపై ఇక మరింత ఫోకస్.. ఢిల్లీలో సుదీర్ఘ మంతనాలకు ప్లాన్
Kcr, Modi Lakhimpura Kheri
Rajesh Sharma
|

Updated on: Apr 16, 2022 | 4:06 PM

Share

KCR POLITICAL MOVES SPEEDING UP DELHI TOUR SOON LAKHIMPURA VISIT IN PLAN: గులాబీ దళపతి కేసీఆర్ పట్టిన పంతం వీడరు. ఈ విషయం తెలంగాణ (TELANGANA) ఉద్యమంలో ప్రస్ఫుటమైంది. ఆ.. తెలంగాణ రాష్ట్రమా ? ఎలా సాధ్యం ? అసెంబ్లీ తీర్మానం చేయకుండా, జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయ సాధన లేకుండా ఆంధ్రప్రదేశ్ (ANDHRA PRADESH) రాష్ట్ర విభజన సాధ్యమా అన్న వారితోనే.. చివరికి జై తెలంగాణ అంటూ రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానాలు చేయించిన పట్టు వీడని విక్రమార్కుడు కేసీఆర్. ఇప్పుడు మరోసారి తన పంతాన్ని నెరవేర్చుకునేందుకు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగారు. కేంద్రంపైనా, బీజేపీ (BJP)పైనా ఇక యుద్దమే అని చాటిన గులాబీ దళపతి.. ఆ దిశగా బహుముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. గత వారం 9 రోజుల పాటు ఢిల్లీ (DELHI)లో మకాం వేసి, తిరిగి వచ్చిన కేసీఆర్ మరోసారి ఢిల్లీ యాత్రకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈసారి వ్యూహాత్మక భేటీలు, పర్యటనలు, యాత్రలతో భారతీయ జనతా పార్టీ (BHARATIYA JANATA PARTY) నేతల్లో వణుకు పుట్టించేలా ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ వుంటుందని అంతా అనుకున్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దానికి అనుగుణంగానే ఫలితాలు వచ్చాయి. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి బొటాబొటీ మెజారిటీతో అధికారంలో వచ్చినా ఆ తర్వాత అపర చాణక్యుని అవతారమెత్తిన గులాబీ బాస్.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలమేసి.. సంఖ్యాబలాన్ని గణనీయంగా పెంచుకున్నారు. 2018లో వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్.. సెంచరీ మార్కుకు చేరువలో సీట్లు గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గెలుచుకున్న 17 మందిలో దాదాపు మూడింట రెండొంతుల మంది అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దాంతో కాంగ్రెస్ పార్టీ బలం తెలంగాణ అసెంబ్లీలో ఇపుడు కేవలం ఆరుగా కనిపిస్తోంది. మరోవైపు 2014 ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లను కూడా 2018 ఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయిన భారతీయ జనతా పార్టీ, 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. మోదీ చరిస్మాకు స్థానికంగా తమకున్న బలం తోడవడంతో ఆదిలాబాద్ (ADILABAD) నుంచి సోయం బాపూరావు, నిజామాబాద్ (NIZAMABAD) నుంచి దర్మపురి అరవింద్, కరీంనగర్ (KARIMNAGAR) నుంచి బండి సంజయ్ కుమార్ గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో తుక్కుగా ఓడిపోయిన జీ.కిషన్ రెడ్డి… మోదీ చరిస్మాతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ (SECUNDERABAD) నుంచి ఎంపీగా గెలిచారు. ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు. ఆ తర్వాత తెలంగాణలో వచ్చిన ఉప ఎన్నికల్లో రెండుసార్లు కమలం పార్టీ సత్తా చాటింది. తొలుత దుబ్బాకలో రఘునందన్ రావు విజయం సాధించగా.. ఆ తర్వాత జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ తరపున ఈటెల రాజేందర్ గెలుపొందారు. అంతకు ముందు 2018 ఎన్నికల్లో బీజేపీ ఒక్కటంటే ఒక్క సీటును గెలుచుకుంది. హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ ఒక్కరే బీజేపీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కానీ ఉప ఎన్నికల్లో మరో ఇద్దరు గెలిచి రావడంతో తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సంఖ్యాబలం మూడుకు పెరిగింది.

కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే వున్న బీజేపీ ఇపుడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాలు విసురుతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే ఎక్కువ దూకుడుతో కమలం నేతలు వాగ్బాణాలు సంధిస్తున్నారు. ప్రజల్లోకి చొచ్చుకువెళ్ళేందుకు తరచూ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. వరి ధాన్యం సేకరణ అంశంతో కేంద్రంపై కేసీఆర్ యుద్దం ప్రకటించగా.. బీజేపీ నేతలు పోటీ దీక్షలు, పర్యటనలతో హోరెత్తించారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి, ధాన్యం సేకరణకు రంగం సిద్దం చేయడంతో దాన్ని తాము సాధించిన విజయంగా కమలనాథులు ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కమార్ ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల్లోకి వెళ్ళారు. గద్వాల జిల్లాలోని శక్తిపీఠం జోగులాంబ ఆలయం నుంచి బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. గద్వాల, నాగర్ కర్నూలు, నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 105 గ్రామాల గుండా ఈ యాత్ర కొనసాగనున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరగనున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చేలా కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు.  మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వ వైఫల్యాల పేరిట జనంలోకి వెళుతున్నారు. తెలంగాణలో ఇలాంటి రాజకీయ వాతావరణం కొనసాగుతున్న తరుణంలో కేసీఆర్ జాతీయరాజకీయాల వైపు చూస్తుండడం వ్యూహాత్మకమని అంటున్నారు. తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతున్న బీజేపీని జాతీయ స్థాయిలో ఎండగట్టడం వల్ల రాష్ట్రంలోను పాగా వేయకుండా చూసేలా కేసీఆర్ కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. సాగునీటి వినియోగం, విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కేసీఆర్ తరచూ ఆరోపిస్తున్నారు. అదేసమయంలో దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ ఉనికిని విస్తరిస్తోందని, ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తుందని గులాబీ దళపతి అంటున్నారు. ఇందులో భాగంగానే శ్రీ రామనవమి నాడు కొన్ని రాష్ట్రాలలో రాళ్ళు రువ్విన సంఘటనలు చోటుచేసుకున్నాయన్నది కేసీఆర్ భావన. బీజేపీపై యుద్దం ప్రకటించిన కేసీఆర్ త్వరలో మరోసారి ఢిల్లీ పర్యటనకు రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. ఈసారి పర్యటన మరింత పక్కా ప్రణాళికతో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈసారి పదిరోజుల పాటు దేశ రాజధానిలో మకాం వేయనున్న కేసీఆర్.. బీజేపీని ఇరుకున పెట్టే కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దాదాపు ఏడాది కాలంపాటు కొనసాగిన వ్యవసాయ చట్టాల వ్యతిరేక అందోళనలో భాగంగా లఖీంపుర ఖేరీ వద్ద రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కారు దుంకించిన ఉదంతంలో బాధితులను ఓదార్చే కీలక కార్యక్రమానికి కేసీఆర్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. లఖీంపురా ఖేరీలో జరిగిన ఆనాటి దుర్ఘటనలో ఒకరు మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఇపుడా బాధితుల పరామర్శకు కేసీఆర్ వెళ్ళబోతున్నారు.

లఖీంపురా ఖేరీ దుర్ఘటన తర్వాత జరిగిన యుపీ ఎన్నికల్లో రైతు ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగిన పశ్చిమ యూపీలో బీజేపీ తప్పకుండా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ లఖీంపురా ఖేరీ సహా పశ్చిమ యూపీలో బీజేపీ సత్తా చాటింది. ఇపుడు అదే లఖీంపురా ఖేరీకి కేసీఆర్ వెళ్ళేందుకు సిద్దమవుతుండడంతో ఆ అంశాన్ని తిరగదోడేందుకేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ నిర్వహించిన దీక్షకు రైతు సంఘాల సమాఖ్య కన్వీనర్ రాకేశ్ టికాయత్‌ని ఆహ్వానించారు. ఆయన సమక్షంలోనే తిరిగి ఢిల్లీ వస్తానని, బీజేపీపై యుద్దం చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే అతి త్వరలోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళనున్నట్లు తెలిసింది. ఢిల్లీలో పలువురు ఆర్థిక వేత్తలతోను, రైతు సంఘాల నేతలతోను కేసీఆర్ సమాలోచనలు జరుపుతారని అంటున్నారు. దేశానికి సమగ్ర వ్యవసాయ చట్టం అవసరమని పదే పదే చెబుతున్న కేసీఆర్.. తన ఆలోచనా విధానాన్ని ఆర్థిక వేత్తలు, రైతు సంఘాల నేతలతోను పంచుకోనున్నారు. వారి సూచనల మేరకు కేంద్రానికి ఓ సమగ్ర వ్యవసాయం చట్టం ముసాయిదా పంపే వ్యూహంతో కేసీఆర్ ఈసారి ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్ళనున్న కేసీఆర్.. సీనియర్ రాజకీయ దిగ్గజం, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీకి సిద్దమవుతున్నారు. ఇదివరకే పలు సందర్భాలలో పవార్‌ని కలిసిన కేసీఆర్.. ఈసారి తాను చేయబోయే పెద్ద యుద్దానికి ఆయన గైడెన్స్‌కూడా తీసుకుంటారని అంటున్నారు. ఇటు రాష్ట్రంలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా బీజేపీ పెద్దఎత్తున ఆందోళనకు సిద్దమవుతోంది. విద్యుత్ ఛార్జీలను పెంచినా మళ్ళీ కరెంటు కోతలు మొదలవడంపై బీజేపీ పోరాటానికి దిగుతోంది. విద్యుత్ మిగులు రాష్ట్రంగా చేశామని కేసీఆర్ పలు సందర్భాలలో చేసిన ప్రకటనల వీడియోలను బీజేపీ నేతలు ప్రజలకు చూపిస్తూ.. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఛార్జీల పెంపు, కరెంటు కోతలని చెబుతోంది. గల్లీలో బీజేపీ తమ పార్టీపై చేస్తున్న ప్రాపగాండాకు జాతీయ స్థాయిలో పొలిటికల్ రివేంజ్ తీర్చుకునేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. అందులో భాగంగానే ఢిల్లీ పర్యటన, పలువురితో భేటీలను ప్లాన్ చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎన్నికలకు చాలా ముందస్తుగానే రాజకీయ వేడిని రగిస్తున్నాయి.