AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC Dual Degree Policy 2022: యూజీసీ డ్యూయల్‌ డిగ్రీ విధానం విద్యార్ధులకు లాభమా? నష్టమా? పూర్తి వివరాలు..

మిలియన్‌ డాలర్ల ప్రశ్న ఏంటంటే.. ఈ డ్యూయల్ డిగ్రీ విధానం దేశంలో  ఉన్నత విద్య ప్రాధాన్యతను మరింత దిగ జారుస్తుందని విద్యావేత్తలు విమర్శనలు గుప్పిస్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం..

UGC Dual Degree Policy 2022: యూజీసీ డ్యూయల్‌ డిగ్రీ విధానం విద్యార్ధులకు లాభమా? నష్టమా? పూర్తి వివరాలు..
Higher Education In India
Srilakshmi C
|

Updated on: Apr 16, 2022 | 3:48 PM

Share

Dual degree programme is ideal for students who can buy degrees and through their connections get job: ఒకే లేదా వివిధ యూనివర్సిటీల నుంచి ఏకకాలంలో (Physical mode) రెండు డిగ్రీలు అది కూడా రెగ్యులర్‌ విధానంలో పొందే వెసులుబాటునిస్తూ యూజీసీ ఛైర్మన్‌ జగదీష్ కుమార్ మంగళవారం (ఏప్రిల్ 12) ప్రకటించారు. విద్యార్ధుల ప్రయోజనార్థం ఏక కాలంలో రెండు డిగ్రీలు చదువుకునే అవకాశం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని యూజీసీ అన్ని యూనివర్సిటీ వీసీలకు లేఖలు కూడా రాసింది. కొత్త జాతీయ విద్యా విధానం (National Education Policy)లో ప్రకటించిన విధంగా విద్యార్థులకు బహుళ నైపుణ్యాలు పొందేందుకు వీలుగా ఒక విద్యార్ధి ఏకకాలంలో 2 డిగ్రీలు చదివేందుకు మల్టీడిసిప్లినరీ, హోలిస్టిక్ ఎడ్యుకేషన్‌ను అందిస్తోంది. అందుకు సంబంధించిన  గైడ్‌లైన్స్‌ను కూడా పేర్కొంది. అవేంటంటే..

  • ఒక విద్యార్ధి ఏక కాలంలో ఫిజికల్‌ మోడ్‌లో రెండు పూర్తిస్థాయి కోర్సులు చదవొచ్చు. ప్రత్యక్షంగా రెండు చోట్ల చదవాలనుకుంటే తరగతుల సమయాలు వేర్వేరుగా ఉండాలి.

ఉదాహరణకు.. ఒక యూనివర్సిటీలో బీఏ ఎకనామిక్స్‌ చదివే విద్యార్ధి, సాయంత్రం వేళల్లో మరొక డిగ్రీ ప్రోగ్రాం కొనసాగించొచ్చన్నమాట.

  • 2 కోర్సులను ఫిజికల్‌ మోడ్‌లోనే కాకుండా ఒకటి ప్రత్యక్షంగా, మరోటి దూరవిద్య లేదా ఆన్‌లైన్‌లో లేదా రెండు కోర్సులు కూడా దూరవిద్య/ఆన్‌లైన్‌లో చదవొచ్చు.
  • ప్రస్తుతానికి యూజీసీ ఆమోదించిన నాన్-టెక్నికల్ కోర్సులకు మాత్రమే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంకు అవకాశం ఉంది.
  • అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా ప్రోగ్రాంలతో సహా లెక్చర్-ఆధారిత కోర్సులకు మాత్రమే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులకు ఈ పథకం వర్తించదు.
  • యూజీసీ/కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న విద్యా సంస్థలు అందించే దూరవిద్య/ఆన్‌లైన్‌ విధానంలో చదివే రెండో డిగ్రీ చెల్లుబాటు అవుతుంది.
  • కొత్త విధానంలో అందించే కోర్సులకు యూజీసీ/ఇతర మండళ్ల నిబంధనలు వర్తిస్తాయి. ఆ సంస్థల నియంత్రణ ఉంటుంది. యూజీసీ నోటిఫికేషన్‌ ఇచ్చిన నాటి నుంచి అంటే ఏప్రిల్‌ 13 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకొస్తాయి. ఇప్పటి నుంచి రెండు డిగ్రీలు చెల్లుబాటవుతాయని అధికారికంగా ప్రకటించింది.

ఐతే మిలియన్‌ డాలర్ల ప్రశ్న ఏంటంటే.. ఈ డ్యూయల్ డిగ్రీ విధానం దేశంలో  ఉన్నత విద్య ప్రాధాన్యతను మరింత దిగ జారుస్తుందని విద్యావేత్తలు విమర్శనలు గుప్పిస్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం..

అభ్యసనం ముఖ్య ఉద్దేశ్యాలకు ఈ పద్ధతి వ్యతిరేకం: తన్వీర్ ఐజర్

తన్వీర్ ఐజర్ ఏమంటున్నారంటే.. ఈ విధమైన వెసులుబాటు వల్ల విద్యార్ధులకు సర్టిఫికేట్లను సులువుగా కొలుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. అడ్డదారుల్లో ఉద్యోగాలు సంపాదించే అవకాశం కూడా లేకపోలేదు.

ఐతే మనదేశంలోని ఉన్నత విద్యా విధానంలో కోర్సుల పరిధి చాలా విస్తృతమైనది, జఠిలమైనది కూడా. అంతేకాకుండా కోర్సు కరిక్యులంతో సంబంధం లేని అనేక మార్పులు దీనిలో చోటుచేసుకుంటున్నాయి. ఐతే డ్యూయల్ డిగ్రీ విధానం ఇందుకు పూర్తిగా  భిన్నమైనది.  ఇది కాలేజీలు, యూనివర్సిటీలు అందించే డిగ్రీల విలువలను దిగజారుస్తుందనడంలో సందేహం లేదు. ఒక విద్యా సంవత్సరంలో ఒక డిగ్రీని అభ్యసించడమే చాలా కష్టం. వారికి మిగిలేది చాలా తక్కువ సమయం మాత్రమే. ఈ కొంచెం టైంలో మరొక డిగ్రీ చేయవల్సి వస్తే అది ఖచ్చితంగా పెడదారిలో నడిచే ప్రమాదం ఉంది.

స్టూడెంట్స్ గైర్హాజరు

ప్రస్తుత పరిస్థితుల్లోనే కాలేజీలకు వెళ్లే విద్యార్ధుల్లో.. మొత్తం క్లాస్‌లోని 40 శాతం మంది విద్యార్ధులు ఫిజికల్ క్లాస్‌లకు హాజరవ్వడం లేదు. వీళ్లంతా పరీక్షలకు ముందు గైడ్స్ లేదా ఇతర మెటీరియల్లను చదివి మమా..! అనిపించేస్తున్నారు. మా కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో చాలా మంది ఆనర్స్ కోర్సులను అభ్యసిస్తున్నారు. ఎందుకంటే వీళ్లందరికీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అవసరం మాత్రమే. వీరికి కోర్సును చదివి, నేర్చుకుని, పూర్తి చేయాలనే ఆలోచన లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డ్యుయల్ డిగ్రీ విధానమును ప్రవేశ పెడితే అది విద్యా వ్యవస్థను మరింత దిగజారుస్తుంది. అభ్యసనం ముఖ్య ఉద్ధేశ్యం ఇది కాదు. విద్యాభ్యాసంలో ఎటువంటి గైర్హాజరు (absenteeism) లేకుండా నిరంతరం ఉపాధ్యాయులు చెప్పే పాఠాలపై దృష్టి నిలపగలిగితేనే అది అభ్యసనం సామర్థ్యాలను నెరవేరుస్తుంది.

నా క్లాస్‌లో మొత్తం 100 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్లలో రోజూ 50 నుంచి 60 మంది మాత్రమే హాజరవుతారు. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ప్రవేశపెడితే మరింత మంది విద్యార్ధులు ఈ సాకుతో క్లాసులకు ఎగనామం పెట్టే అవకాశముంది. ఎందుకంటే ఒకటే రోజు రెండు క్లాసులకు హాజరవ్వవల్సి వస్తుంది. అందువల్ల విద్యార్ధుల గైర్హాజరు 2 రెట్లు అధికంగా ఉంటుంది.

కెరీర్ ఎంపికలో గందరగోళం..

మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఏక కాలంలో ఒకే విద్యార్ధి రెండు సబ్జెక్టులను చదవం అనేది అసాధ్యమనే విషయం పాలసీ మేకర్స్ అర్ధం చేసుకోవాలి.

ఉదాహరణకు ఒక విద్యార్ధి పొలిటికల్ సైన్స్, బిజినెస్ స్టడీస్‌ రెండు సబ్జెక్టుల్లో డిగ్రీలు చేస్తే.. భవిష్యత్తులో కెరీర్ ఎంపికలో గందరగోళానికి గురయ్యే అవకాశముంది. నిర్ణీత కాల వ్యవధిలో మరింత నేర్చుకోవడానికి సంఘర్షణకు గురౌతాడు. ఈ విధానం ధోషపూరితమైనది. లేదంటే.. మేమే నేరుగా స్టూడెంట్స్‌కు సర్టిఫికేట్లను అమ్ముతాం కదా!

డ్యూయల్ డిగ్రీ విధానం సర్టిఫికేట్లను కొనుగోలు చేసేందుకు, అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు సంపాదించేందుకు మార్గాలను తెరుస్తుంది. దీనిని కొనసాగిస్తే విద్యార్ధులు విద్యా నైపుణ్యాలు ఎలా సంపాదిస్తారు? అందువల్లనే ఏకకాలంలో 2 డిగ్రీలు చదవడమనేది అసాధ్యం. ఒక రోజుల్లో ఒక విద్యార్ధి 10 గంటల సమయం ఉంటుంది. మిగిలిన సమయాన్ని సోషల్ మీడియాకు కేటాయిస్తారు. ఈ టైంను రెండో డిగ్రీకి కేటాయిస్తే ఇతర విషయాలకు సమయం ఎక్కడ దొరుకుతుంది? తీవ్ర గందరగోళానికి, అసౌకర్యానికి గురౌతారు.

అభ్యసనంపై ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఎక్కువ..

అంతేకాకుండా 2 వేర్వేరు కాలేజీల్లో ఫిజికల్ మోడ్‌లో 2 వేర్వేరు క్లాసులకు హాజరవ్వడం మరో ఇబ్బంది. విద్యార్థి సమయం అంతా ప్రయాణాల్లో, భిన్న డిగ్రీల సముపార్జనలో గడిచిపోతుంది. దీని వల్ల స్టూడెంట్స్‌ లెర్నింగ్‌పై ఆసక్తి కోల్పోవచ్చు. యూజీసీ ఈ విధమైన సంస్కృతిని ప్రోత్సహించడం సరైనది కాదు.

ఐతే జాతీయ విద్యావిధానానికి (NEP 2020)కి నేను వ్యతిరేకినికాను. ఈ విధానం ద్వారా ఒక విద్యార్థి వివిధ స్ట్రీమ్‌ల నుంచి విభిన్న సబ్జెక్టులను నేర్చుకొవచ్చు. నిజానికి.. పాఠశాల స్థాయిలోనే ఈ విధమైన వెసులుబాటును కల్పించే విధానం ఇప్పటికే అందుబాటులో ఉంది. హైయర్ ఎడ్యుకేషన్‌ను దీనిలోకి లాగడమెందుకు? అందుకు బదులుగా.. విద్యార్ధుల పూర్తిస్థాయి సామర్ధ్యాలను డ్యూయల్ డిగ్రీపైకాకుండా, చదవడం, రాయడం, విశ్లేషణ పెంపుపై వినియోగిస్తే వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని తన్వీర్ ఐజర్ సూచిస్తున్నారు.

భిన్న వాదన

డ్యూయల్ డిగ్రీ విధానం వల్ల ఉపాధి అవకాశాలు మెండు: జాస్మిన్ గోహిల్ 

జాస్మిన్ గోహిల్ వాదన ఏంటంటే.. డ్యూయల్ డిగ్రీ విధానం విద్యార్ధులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ప్రవేశపెట్టిన డ్యూయల్ డిగ్రీ విధానం చాలా ప్రగతిశీలమైన చర్య. ఇది విద్యార్ధులను సరైన దారిలో నడిపిస్తుంది. మల్టీ-డిసిప్లిన్ ఎడ్యుకేషన్ విధానం ప్రవేశపెట్టడం ఇది మొదటిసారేం కాదు. ఇప్పటికే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా పాఠశాల విద్యార్థులకు అందిస్తున్నదే. ఐతే ప్రతి విధానానికి దాని లాభనష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. నిజానికి.. డ్యూయల్ డిగ్రీ విధానంలో ప్రతికూలతల కంటె ప్రయోజనాలే 2 రెంట్లు ఎక్కువ. ముందుగా విశ్లేషించినట్లు.. విద్యార్ధికి నిర్ణీత కాల వ్యవధిలో వివిధ సబ్జెక్టులను అభ్యసించడం వల్ల కోర్సులను ముగించేనాటికి పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుకుంటాడు. కెరీర్‌లోనూ ఉపయోగపడుతుంది. మరిన్ని ఉపాధి అవకాశాలకు తలుపు తెరుస్తుంది.

ఉదాహరణకు ఫ్యాషన్‌లో డిగ్రీని చదివే విద్యార్ధి టెక్స్‌టైల్ డిజైన్‌లో కూడా మరో డిగ్రీని చదవొచ్చు. ఉద్యోగ సముపార్జనలో ఒకే డిగ్రీ చదివిన విద్యార్ధికంటే రెండు డిగ్రీలు చదివిన విద్యార్ధి ముందంజలో ఉంటాడు.

నేడు విద్యార్ధులు ప్రపంచవ్యాప్తంగా పోటీలో నిలబడగలిగేలా తయారవ్వాలి. మల్టీ టాస్కులు చేయగలిగిన భిన్న ప్రతిభావంతుల కోసం యాజమాన్యాలు వెతుకుతున్నాయి. అందువల్ల ఉన్నత విద్యావిధానంతో ఏక డిగ్రీని మాత్రమే సముపార్జించాలనే సంప్రదాయాన్ని మనం బ్రేక్ చేయకతప్పదు. ఆర్కిటెక్చర్ చదివే విద్యార్ధి బిల్డింగ్‌ల డిజైన్ గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోదు.. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గురించి కూడా అవగాహన కలిగి ఉండటానికి ఎకనామిక్స్ కూడా తెలుసుకోవాలి. ఒకే స్పెషలైజేషన్లో డిగ్రీ చేసే విద్యార్ధికి ఇది సాధ్యం కాదు. ఈ అవకాశం డ్యూయల్ డిగ్రీ కల్పిస్తుందని జాస్మిన్ గోహిల్ సమర్ధిస్తున్నారు.

ఏది ఏమైనా డ్యూయల్ డిగ్రీ విధానం.. విద్యార్దుల్లో నైపుణ్యాల కొరతకు కారణమౌతుందనేది వాస్తవం. ఈ విధానం రెండు సబ్జెక్టులకు సంబంధించిన నాలెడ్జ్‌ను ఇస్తుందే గానీ, లోతుగా అధ్యయనం చేసే వెసులుబాటు ఉండదు. ఫలితంగా సర్టిఫికేట్ చేతిలో ఉన్న పూర్తి పరిజ్ఞానం కొరవడుతుంది. అందుకే కదా.. పాఠశాల విద్య తర్వాత స్పెషలైజేషన్లో డిగ్రీలు చదవడమనేది అనాదిగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేయడం కుదురుతుందో? లేదో? విద్యార్ధులు, వారికి విద్యా బుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు తేల్చాలి..!  ఎందుకంటే విద్యావరణంలో స్వేచ్ఛగా పెరిగే మొక్క విద్యార్ధి.. తోటమాలి ఉపాధ్యాయుడు. మొక్క స్వభావం తోటమాటికి తెలిసినట్టు.. మరెవ్వరికీ తెలియదు..

Also Read:

CUET 2022 exam date: సీయూఈటీ 2022కు దరఖాస్తు చేసుకుంటున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి..