KCR POLITICS RECEIVING HUGE RESPONSE MANY CHANGES SOON: కేసీఆర్ సెంట్రిక్‌గా జాతీయ రాజకీయాలు న్యూ టర్న్ తీసుకోబోతున్నాయా? అంటే ప్రస్తుత పరిస్థితులు… జరుగుతున్న పరిణామాలు అవుననే అనిపించేలా చేస్తున్నాయి. హుజూరాబాద్ ఓటమి తర్వాత వ్యూహాత్మక మౌనం పాటించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఆ తర్వాత కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌పై పెద్ద యుద్దమే ప్రకటించారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనడం లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఘాటైన వ్యాఖ్యలు.. పదునైన ఆరోపణలతో కేంద్రాన్ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. కేసీఆర్ దిశానిర్దేశంలో టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని పార్లమెంటు వేదికగా పలు మార్లు నిలదీశారు. తెలంగాణ మంత్రుల బృందం కూడా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు వారం రోజుల పాటు న్యూఢిల్లీలో మకాం వేశారు. అయినా వరి ధాన్యం కొనుగోళ్ళలో తెలంగాణ ప్రభుత్వ విఙ్ఞప్తులు పెద్దగా ఫలించలేదు. అయితే… టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని.. తెలంగాణలో పండిన ధాన్యంలో ఎక్కువ శాతం కేంద్రం సేకరించిందని కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్ పార్లమెంటు ఉభయసభల్లో గణాంకాలను వెల్లడించారు.
వరి ధాన్యం సేకరణ అంశం ప్రాతిపదికన తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పెద్దస్థాయిలో మాటల యుద్దం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ప్రచారం అవాస్తమని చాటేందుకు తెలంగాణ బీజేపీ నేతలు మార్కెట్ యార్డులను సందర్శించడం మొదలుపెట్టారు. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలోని పలు మార్కెట్ యార్డులలో పర్యటించారు. కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్ ప్రకటన తర్వాత వరి ధాన్యం సేకరణ అంశం కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే.. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలను వివిధ జోన్ల కింద పునర్విభజించిన కేసీఆర్ సర్కార్.. వాటి ఆధారంగా ఉద్యోగుల బదిలీలకు పూనుకుంది. అందులో భాగంగా జీ.వో. నెంబర్ 317 విడుదల చేసింది. అయితే.. ఈ జీ.వో.లోని లొసుగులున్నాయి.. దాంతో తాము ఇబ్బందులు పడుతున్నామంటూ ఉద్యోగులు ఉద్యమించారు. వారికి అండగా బీజేపీ బరిలోకి దిగింది. ఉద్యోగులకు సంఘీభావంగా కరీంనగర్‌లోని తన ఇంట్లో దీక్షకు పూనుకున్న బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద్భంగా సంజయ్ సహా బీజేపీ నేతలపై పోలీసులపై దాడికి పాల్పడ్డారంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సంజయ్ కొన్ని రోజులు రిమాండ్‌లో గడపాల్సి వచ్చింది.
ఈ ప్రహసనం టీఆర్ఎస్, బీజేపీల మధ్య వైరాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపైనా, బీజేపీపైనా, ప్రధాని మోదీపై ఘాటైన విమర్శలతో తెరమీదికి వచ్చారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతల్లో ఆగ్రహం పెంచాయి. ఆయనపై ప్రతివిమర్శలతో బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదురు దాడికి దిగినా.. కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలపై ప్రజల్లోకి ఎక్కువగా దూసుకు వెళ్ళాయి. మోదీపై కేసీఆర్ ఘాటైన విమర్శలు చేసిన రెండ్రోజులకే ప్రధాని హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఇక్రిసాట్‌లో అధికారిక కార్యక్రమానికి, ముచ్చింతల్‌లో ఆధ్యాత్మిక కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. అయితే.. మోదీని ఘాటుగా విమర్శించి ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవడం ఇష్టపడని కేసీఆర్.. తన ఇంట్లో ఇద్దరికి కరోనా వచ్చిందంటూ గైర్హాజరయ్యారు. ఆ తర్వాత మరికొన్ని రోజులకే మరోసారి మీడియా ముందుకొచ్చిన కేసీఆర్.. ఈసారి మోదీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. రాఫేల్ డీల్‌లో అవినీతి జరిగిందంటూ ఆ కేసును మరోసారి తెరమీదికి వచ్చేలా చేశారు. అదేసమయంలో ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ నిజమేనా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అందుకు సాక్ష్యం చూపాలన్నారు. ఒకవేళ స్ట్రైక్ నిజమే అయితే.. ఆ క్రెడిట్ సైన్యానికి దక్కాలి గానీ.. బీజేపీకి ఎందుకంటూ లాజికల్ క్వశ్చన్ కూడా రెయిజ్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది కాస్త.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య వైరాన్ని మరింత ముదిరేలా చేసింది. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బహిరంగ చర్చకు సిద్దమంటే సిద్దమంటూ.. సై అంటే సై అనుకున్నారు గులాబీ, కమలం నేతలు.
ఇదంతా ఓవైపు కొనసాగుతుండగా.. కేంద్రంపైనా, మోదీపైనా యుద్ధాన్ని ప్రకటించిన కేసీఆర్‌కు జాతీయ నేతల ప్రశంసలు మొదలయ్యాయి. బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా కేసీఆర్‌కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. మోదీని గద్దె దింపేందుకు కలిసి పని చేద్దామంటూ బీజేపీ, కాంగ్రెసేతర సీఎంల భేటీని ప్రతిపాదించారామె. అయితే.. సీఎంల సమావేశం కంటే.. పదవీ విరమణ చేసిన అఖిల భారత సర్వీసు ఉద్యోగుల భేటీని ముందుగా నిర్వహించడం ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగడదామని కేసీఆర్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్‌ని ఇటీవల కలిసి వచ్చిన కేసీఆర్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేని త్వరలో కలుస్తానని ప్రకటించారు. ఇదంతా ఒకెత్తైతే.. మాజీ ప్రధాని దేవెగౌడ స్వయంగా కేసీఆర్‌కు ఫోన్ చేసి.. సంఘీభావం ప్రకటించడం కేసీఆర్ సాధించిన పెద్ద విజయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో త్వరలో న్యూఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీయేతర ముఖ్యమంత్రుల భేటీ జరగబోతోందని తెలుస్తోంది. ఆ భేటీలో కేసీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావడం ఖాయమంటున్నారు. ఇటు పదవీ విరమణ చేసిన అఖిల భారత సర్వీసు ఉద్యోగుల భేటీ హైదరాబాద్ నగరంలోను, కాంగ్రెస్, బీజేపీయేతర ముఖ్యమంత్రుల భేటీ న్యూఢిల్లీలోను జరిగిన తర్వాత కేసీఆర్ జాతీయ స్థాయిలోకి ఎదుగుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆక్రమంలో కేసీఆర్ వ్యూహాలు అనితర సాధ్యంగాను, అనూహ్యంగాను వుంటాయంటున్నారు. మొత్తమ్మీద 2022 ద్వితీయార్థానికల్లా జాతీయ రాజకీయాల్లో విశేష మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.