Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UKRAINE CONFLICT: ఉక్రెయిన్‌పై మిస్సైళ్ళతో విరుచుకుపడ్డ రష్యా.. రెఫరెండమ్‌తో మొదలైన దూకుడు.. జెలెన్స్కీ అంతమే లక్ష్యం!

కెర్చ్ బ్రిడ్జి పేల్చివేతయత్నం తర్వాత రష్యా దూకుడు పెంచింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్దానికి సారథ్యం వహించే బాధ్యతలను తన నమ్మినబంటు, యుద్ద నేర్పరి సెర్గీకి అప్పగించారు పుతిన్. దాంతో గత మూడు రోజులుగా ఉక్రెయిన్‌ నగరాలపై మిస్సైళ్ళ దాడిని పెంచింది రష్యన్ సైన్యం.

UKRAINE CONFLICT: ఉక్రెయిన్‌పై మిస్సైళ్ళతో విరుచుకుపడ్డ రష్యా.. రెఫరెండమ్‌తో మొదలైన దూకుడు.. జెలెన్స్కీ అంతమే లక్ష్యం!
Zelenski And Putin
Follow us
Rajesh Sharma

| Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2022 | 3:39 PM

ఏడు నెలలకుపైగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్దంలో మళ్ళీ తీవ్రత పెరిగింది. ఉక్రెయిన్ ప్రధాన నగరాలు మరీ ముఖ్యంగా రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా మిస్సైళ్ళను ప్రయోగిస్తూ మరోసారి విధ్వంసం సృష్టిస్తోంది. అక్టోబర్ 8,9 తేదీలలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో వున్న జఫ్రోజియా నగరంలో విధ్వంసం సృష్టించిన రష్యన్ బలగాలు అక్టోబర్ 10న రాజధాని కీవ్ సిటీని లక్ష్యంగా చేసుకుని క్షిపణుల వర్షం కురిపించింది. జఫ్రోజియా నగరంలో దాదాపు 70 భారీ బహుల అంతస్తుల భవనాలపై మిస్సైళ్ళను ప్రయోగించిన రష్యన్ బలగాలు దాదాపు ముప్పై మంది దుర్మరణానికి కారణమయ్యారు. దాదాపు 700 మందికిపైగా పౌరులు గాయాల పాలయ్యారు. జఫ్రోజియాలో దాడులు కొనసాగిస్తూనే ఆక్టోబర్ 10వ తేదీన కీవ్ సిటీపై మిస్సైళ్ళతో విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆఫీసుపై కూడా మిస్సైళ్ళతో దాడి చేయడం విశేషం. అయితే, గత రెండు, మూడు నెలలుగా రోటీన్ దాడులకు పరిమితమైన రష్యన్ బలగాలు తాజాగా ఉన్నట్లుండి ఒక్కసారి దాడుల తీవ్రతను ఎందుకు పెంచాయి ? ఇదిపుడు చర్చనీయాంశంగా కనిపిస్తోంది.

2022 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన రష్యన్ దురాక్రమణలో తొలి రోజుల్లోనే తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు రష్యా గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి. అందుకు రష్యన్ దాడులకు స్థానికంగా వున్న రష్యన్ జాతీయుల సహకారం లభించడమేనని అందరికీ తెలుసు. డోనెక్స్ట్, లూహాన్స్క్, ఖేర్సన్ వంటి ప్రాంతాలు రష్యా గుప్పిట చేరాయి. ఒకానొక సమయంలో డోనెక్స్ట్, లూహాన్స్క్ లను సొంత ప్రతిపత్తి కలిగిన దేశాలుగా గుర్తిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ మేరకు రష్యన్ ప్రెసిడెంటు వ్లాదిమిర్ పుతిన్ అప్పట్లో స్వయంగా ప్రకటన కూడా చేశారు. అయితే తాజాగా అంటే సెప్టెంబర్ చివరి వారంలో రష్యా తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెక్ట్స్, లూహాన్స్క్, ఖేర్సన్, జఫ్రోజియా ప్రాంతాలలో రెఫరెండమ్ (ప్లెబిసైట్) నిర్వహించింది. రష్యన్లు అధికంగా వున్న ఈ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ రెఫరెండమ్ సహజంగానే రష్యాకు అనుకూల ఫలితాన్నిచ్చింది. ఈ రెఫరెండమ్ నిర్వహణపై ఉక్రెయిన్ సహా పలు దేశాలు ఖండించాయి. అమెరికా, యుకే వంటి దేశాలు ఈ రెఫరెండమ్ ఫలితాన్ని అంగీకరించబోమని చాటాయి కూడా. అయితే, రెఫరెండమ్ తర్వాత పరిణామాలు రష్యాకు ప్రతికూలంగా పరిణమించాయి అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ దురాక్రమణలో రష్యా సాధించిందేమీ లేదన్న అభిప్రాయాలు బలపడ్డాయి. దీనిని పుతిన్ అవమానంగా భావించారు. మరోవైపు అక్టోబర్ 8వ తేదీన క్రిమియాను రష్యాకు అనుసంధానించే కెర్చ్ వంతెనపై ట్రక్ బాంబు పేలింది. ఫలితంగా కీలకమైన బ్రిడ్జి డ్యామేజీ అయ్యింది. దీనిని పుతిన్ తీవ్ర పరాభవంగా భావించారు. 2014లో రష్యా ఆక్రమించుకున్న క్రిమియా ద్వీపకల్పానికి జరిపే రవాణాలో కెర్చ్ బ్రిడ్జి అత్యంత కీలకం. అలాంటి బ్రిడ్జిని పేల్చి వేయాలన్న ప్రయత్నాన్ని టెర్రర్ కుట్రగా పుతిన్ అభివర్ణించారు. కెర్చ్ బ్రిడ్జి కూల్చివేత కుట్ర వెనుక ఉక్రెయిన్ సైనిక వ్యూహం దాగుందని రష్యన్ ప్రెసిడెంటు భావించారు.

కెర్చ్ బ్రిడ్జి పేల్చివేతయత్నం తర్వాత రష్యా దూకుడు పెంచింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్దానికి సారథ్యం వహించే బాధ్యతలను తన నమ్మినబంటు, యుద్ద నేర్పరి సెర్గీకి అప్పగించారు పుతిన్. దాంతో గత మూడు రోజులుగా ఉక్రెయిన్‌ నగరాలపై మిస్సైళ్ళ దాడిని పెంచింది రష్యన్ సైన్యం. అదేసమయంలో క్రిమియాపై పట్టు కోల్పోకుండా వుండేందుకు.. కెర్చ్ బ్రిడ్జి పునరుద్దరణ పనులను వెంటనే ప్రారంభించింది రష్యా. పునరుద్దరణ పనులను ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ అప్పగించారు. దాంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. కెర్చ్ బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టడం, క్రిమియాకు రాకపోకలను తక్షణం పునరుద్దరించడం ఇపుడు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ పనిగా మారింది. ప్రధాన బ్రిడ్జికి సర్వీస్ రోడ్డుగా వున్న బ్రిడ్జిపైన రవాణా వాహనాలను అనుమతించారు. క్రిమియాను ఎట్టి పరిస్థితిలోను వదులుకోకూడదని పుతిన్ భావించడమే తాజా చర్యలకు కారణమని తెలుస్తోంది. తాజాగా కీవ్ సిటీ లక్ష్యంగా మిస్సైళ్ళను ప్రయోగిస్తున్న రష్యా.. యుద్దంలో పైచేయి తమదేనని చాటేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. కీవ్ నగరంలోని అధ్యక్ష కార్యాలయమే టార్గెట్‌గా తాజా దాడులు జరిగాయి. దీనర్థం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అంతమొందించే వ్యూహాన్ని రష్యా అనుసరిస్తున్నట్లు బోధపడుతోంది. రాజధాని కీవ్‌తోపాటు పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతంలో వున్న ఎల్వీవ్ సిటీ సహా మొత్తం నాలుగు నగరాలపై రష్యా మిస్సైళ్ళను ప్రయోగించింది. మొత్తం 75 క్షిపణులను ఉక్రెయిన్ నగరాలపై వేసినట్లు తాజాగా తెలుస్తోంది. ఈ దాడులను పుతిన్ ప్రతీకారంతో చేస్తున్నవిగా వెస్టర్న్ మీడియా అభివర్ణిస్తోంది.