Lalit Modi: లలిత్ మోడీకి ఎదురుదెబ్బ.. టీవీ9 కథనాలతో మారిన ఆర్థిక నేరగాడి విధి రాత
భారత్‌లో నేరాలకు పాల్పడి దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోడానికి విదేశాల్లో పుష్కలమైన అవకాశాలున్నాయి. అక్రమార్జనతో దేశం విడిచి వెళ్తే చాలు.. వారిని వెనక్కి తీసుకురావడానికి యుద్ధం చేసినంత శ్రమించాల్సి వస్తోంది. ఆయా దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంటే సరి.. లేదంటే వెనక్కి తీసుకురావడం దాదాపు అసాధ్యంగా మారుతోంది. దీన్నే తనకు అనుకూలంగా మలుచుకున్న లలిత్ మోదీ..

భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోడీ (Lalit Modi)కి ఎదురుదెబ్బ తగిలింది. ఓ చిన్న ద్వీపదేశం వనౌటు నుంచి పౌరసత్వాన్ని పొంది భారత పౌరసత్వాన్ని వదులుకుని శాశ్వతంగా దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవాలనుకున్న అతని పన్నాగం ఫలించలేదు. TV9 NETWORK ఇన్వెస్టిగేటివ్ కథనాలతో లలిత్ మోడీ బండారం బట్టబయలైంది. అప్రమత్తమైన భారత ప్రభుత్వం.. లలిత్ పౌరసత్వాన్ని రద్దు చేయించేందుకు పావులు కదిపింది. పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా వనౌటు ప్రధాని జోథమ్ నపట్ ఆదేశాలు జారీ చేశారు.
లలిత్ మోడీ వనౌటు పౌరసత్వం – పాస్‌పోర్ట్ గురించి ఈ లింక్‌లో పూర్తి కథనం చదవండి
అసలేం జరిగింది?
భారత్‌లో నేరాలకు పాల్పడి దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోడానికి విదేశాల్లో పుష్కలమైన అవకాశాలున్నాయి. అక్రమార్జనతో దేశం విడిచి వెళ్తే చాలు.. వారిని వెనక్కి తీసుకురావడానికి యుద్ధం చేసినంత శ్రమించాల్సి వస్తోంది. ఆయా దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంటే సరి.. లేదంటే వెనక్కి తీసుకురావడం దాదాపు అసాధ్యంగా మారుతోంది. భారత్‌లో నేరాలకు పాల్పడి ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నవారిలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ వంటి ఆర్థిక నేరగాళ్ల వరకు చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలో ఉన్న లలిత్ మోడీ.. భారత దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోడానికి భారత్‌తో నేరస్తుల అప్పగింత ఒప్పందం లేని దేశాలకు పారిపోవడం ఒకెత్తయితే.. తాజాగా భారత పౌరసత్వాన్ని వదులుకుని ఓ చిన్న ద్వీప దేశం ‘వనౌటు’ పౌరసత్వాన్ని పొందాడు. ఆర్థికంగా బలంగా లేని చిన్న దేశాలు ‘గోల్డెన్ వీసా’ లేదా ‘గోల్డెన్ పాస్‌పోర్ట్’ విధానాలను అనుసరిస్తున్నాయి. తమ దేశంలో పెట్టుబడులు పెట్టేవారికి కానుకగా కోరుకుంటే పౌరసత్వాన్ని ఇస్తున్నాయి. ‘వనౌటు’ అనుసరిస్తున్న ఈ విధానాన్ని లలిత్ మోడీ తెలివిగా తాను తప్పించుకోడానికి ఉపయోగించుకున్నాడు. ఆ దేశ పౌరసత్వం తీసుకుని భారత పౌరసత్వాన్ని వదులుకోవాలని చూశాడు. భారతీయుడిగా విదేశాల్లో తప్పించుకుతిరిగేవాడిని వెనక్కి తీసుకురావడమే కష్టమైన ప్రక్రియ అంటే.. భారతీయత వదులుకుని విదేశీ పౌరసత్వం తీసుకున్న వ్యక్తిని వెనక్కి తీసుకురావడం దాదాపు అసాధ్యం. ఈ లొసుగును తనకు అనుకూలంగా మలచుకోవాలని చూసిన లలిత్ మోడీకి.. TV9 నెట్‌వర్క్ పరిశోథనాత్మక కథనం ద్వారా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
టీవీ9 కథనంలో కదిలిన డొంక
టీవీ9 భారత్‌వర్ష్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మనీష్ ఝా అంతర్జాతీయ వ్యవహారాలను రిపోర్టు చేస్తుంటారు. ఉక్రెయిన్ – రష్యా, ఇజ్రాయిల్ – హమాస్ వంటి యుద్ధాలతో పాటు దేశ, విదేశాల్లో ఎన్నో ప్రాంతాలను సందర్శిస్తూ వార్తలు అందిస్తుంటారు. ఈ క్రమంలో లలిత్ మోడీ కదలికలపై నిఘా పెట్టిన ఆయనకు.. కీలక సమాచారం లభించింది. దానిపై మరింత లోతుగా పరిశోధన చేసి లలిత్ మోడీ ‘వనౌటు’ పౌరసత్వాన్ని పొందిన విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. టీవీ9 నెట్‌వర్క్‌లో కథనాలతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా చర్యలు చేపట్టింది. వనౌటు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. లలిత్ మోడీపై ఉన్న కేసులు, వాటి తీవ్రతను వివరించింది. సాధారణంగా ఏ దేశమైనా నేరస్థులకు పౌరసత్వం ఇవ్వాలని కోరుకోదు. అయితే అంతర్జాతీయంగా అమలవుతున్న విధానాల ప్రకారం ఎవరైనా నేరస్థుడని తెలియాలంటే.. ఇంటర్‌పోల్ సంస్థ రికార్డుల్లో అతని గురించి ఉందా లేదా అన్నదే చూస్తారు. లలిత్ మోడీ గురించి భారత ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను పలుమార్లు ఆశ్రయించినప్పటికీ.. తగిన ఆధారాలు లేవన్న కారణంతో ‘రెడ్ కార్నర్’ నోటీసులు జారీ చేయలేదు. పరారీలో ఉన్న ఉగ్రవాదులు, కరుడుగట్టిన నేరస్థుల కోసం ఇంటర్‌పోల్ సంస్థ ఈ తరహా నోటీసులు జారీ చేస్తుంది. ఆ రికార్డుల్లో లలిత్ మోడీ పేరు లేకపోవడంతో వనౌటు ప్రభుత్వం పౌరసత్వాన్ని జారీ చేసింది. ఆ దేశపు పాస్‌పోర్టును జారీ చేసింది. పాస్‌పోర్ట్ నెంబర్‌తో సహా టీవీ9 లలిత్ మోడీ పౌరసత్వం వ్యవహారాన్ని చాటి చెప్పింది.
భారత ప్రభుత్వ ప్రయత్నాలతో ‘వనౌటు’ ప్రభుత్వం దిగొచ్చింది. ఆ దేశ ప్రధాని జోథమ్ నపట్ అధికారక ప్రకటన జారీ చేస్తూ.. “లలిత్ మోడీ వనౌటు పాస్‌పోర్ట్‌ను రద్దు చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని నేను పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించాను” అని వెల్లడించారు. లలిత్ మోడీ పాస్‌పోర్ట్ దరఖాస్తును పరిశీలించేటప్పుడు ఇంటర్‌పోల్ స్క్రీనింగ్‌తో సహా అన్ని ప్రామాణిక విధానాలను అనుసరించామని, ఆ సమయంలో అతనిపై నమోదైన ఎటువంటి క్రిమినల్ కేసు గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతోనే తాము పౌరసత్వాన్ని మంజూరు చేశామని వెల్లడించారు. లలిత్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ఇంటర్‌పోల్ రెండుసార్లు తిరస్కరించింది. తగినంత న్యాయపరమైన ఆధారాలు లేకపోవడం వల్ల రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఒకవేళ అప్పుడే రెడ్ కార్నర్ నోటీసు జారీ అయి ఉంటే.. అతని పౌరసత్వ దరఖాస్తు స్వయంచాలకంగా తిరస్కరణకు గురయ్యేది. లలిత్ మోడీ వ్యవహారంతో ఉలిక్కి పడ్డ వనౌటు ప్రభుత్వం తమ ‘గోల్డెన్ పాస్‌పోర్ట్’ కార్యక్రమాన్ని నేరస్థులు తప్పించుకునే మార్గంగా మారడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.
‘వనౌటు’ ప్రభుత్వ నిర్ణయంతో ఒక ముప్పు తప్పింది. కానీ లలిత్ మోడీని వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ ఇంకా మిగిలే ఉంది. ఇంటర్‌పోల్ సహాయంతోనే వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ సఫలమవుతుంది. అది జరగాలంటే.. ఆ సంస్థకు లలిత్ మోడీపై ఉన్న కేసులు, నేరారోపణలు, అందుకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తే.. లలిత్ మోడీ దేశాల మధ్య ప్రయాణాలు చేయకుండా నివారించవచ్చు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తే.. విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ చెక్ దగ్గర దొరికిపోతారు. ఇదంతా జరిగేలోపు లలిత్ మోడీ “గోల్డెన్ పాస్‌పోర్ట్” స్కీమ్ అమలు చేస్తున్న మరికొన్ని దేశాలను ఆశ్రయించే అవకాశం కూడా లేకపోలేదు.