PRASHANT KISHORE: ఆశ్చర్యపరిచిన ప్రశాంత్ కిశోర్ నిర్ణయం.. రాజకీయ పార్టీ స్థాపన వెనుక ద్విముఖ వ్యూహం.. అదిరింది పీకే!
ప్రశాంత్ కిశోర్.. దేశంలో మేటి రాజకీయ వ్యూహకర్తగా పేరున్న వ్యక్తి. పదేళ్ళ క్రితం కేవలం కొందరికి మాత్రమే తెలిసిన ప్రశాంత్ కిశోర్ ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా పేమెంట్ తీసుకునే పెయిట్ స్ట్రాటెజిస్టుల్లో ఒకరు.
PRASHANT KISHORE STRATEGY POLITICAL ANALYSTS REPORTS INTERESTING: ప్రశాంత్ కిశోర్.. దేశంలో మేటి రాజకీయ వ్యూహకర్తగా పేరున్న వ్యక్తి. పదేళ్ళ క్రితం కేవలం కొందరికి మాత్రమే తెలిసిన ప్రశాంత్ కిశోర్ ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా పేమెంట్ తీసుకునే పెయిట్ స్ట్రాటెజిస్టుల్లో ఒకరు. ఆయన సేవలను వినియోగించుకోని ప్రధాన రాజకీయ పార్టీ దేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేశంలో పేరున్న ప్రతీ రాజకీయ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్‌ని ఏదో ఒక రకంగా సంప్రదించినవారే. తాజాగా ఆయన రాజకీయ పార్టీ పెడుతున్నట్లు చేసిన ట్వీట్ ఇపుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రశాంత్ కిశోర్ స్థాపించబోయే రాజకీయ పార్టీ ఎలాంటి స్వరూపంలో వుండబోతోంది ? జాతీయ పార్టీనా లేక బీహార్ అన్నారు కాబట్టి ప్రాంతీయ పార్టీనా? వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహకరించేలా పార్టీల కూటమిని ఏర్పాటు చేసేందుకు తన పార్టీ ద్వారా ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తారా ? లేక తనను బహిష్కరించిన జెడీయూ అధినేత నితీశ్ కుమార్‌ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించేందుకే పార్టీ పెడుతున్నారా ? ఇత్యాది ప్రశ్నలు ఇపుడు రాజకీయ పరిశీలకుల మదిని తొలుస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ జన్మత: బిహారీ. రాజకీయ వ్యూహకర్తగా వెలుగులోకి వచ్చింది 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత. అప్పట్లో నాలుగోసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న నరేంద్ర మోదీ.. తొలిసారి పీకే సేవలను వినియోగించుకున్నారు. సక్సెస్‌ఫుల్‌గా నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దేశంలో అత్యంత ప్రజాకర్షక నేతగా మారిన నరేంద్ర మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆయన మరోసారి పీకే సేవలను వాడుకున్నారు. తద్వారా పీకే పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది. మోదీ చరిష్మా కావచ్చు.. పీకే వ్యూహాలు కావచ్చు 2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యారు. ఆ తర్వాత పీకేను పలు పార్టీలు వాడుకోవడం మొదలైంది. గత ఏడేళ్ళ కాలంలో ప్రశాంత్ కిశోర్ దేశవ్యాప్తంగా పలు పార్టీలతో కలిసి పని చేశారు. నితీశ్ కుమార్ ఆహ్వానం మేరకు జేడీయూలో చేరారు. 2017లో జేడీయూ అధికారంలోకి రావడానికి ఎంతో కొంత కారణమయ్యారు. అయితే.. ఆయన వ్యూహాలందించిన, కలిసి పని చేసిన పార్టీల్లో అన్నీ అధికారంలోకి రాలేదు. ఉదాహరణకు యుపీ బాధ్యతలను రాహుల్ చేపట్టినప్పుడు ఆయనతో కలిసి పని చేశాడు. కానీ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సానుకూల ఫలితాలను సాధించలేకపోయారు. 2017లో పంజాబ్‌లో అమరీందర్ సింగ్‌తోను, 2019లో ఏపీలో వైఎస్ జగన్‌తోను 2020లో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌తోను కలిసి పని చేశారు. వారికి అధికారం దక్కేలా వ్యూహాలు రచించారు. 2019లో మహారాష్ట్రంలో ఉద్ధవ్ థాక్రేతో కలిసి పని చేశారు. కానీ వారక్కడ అధికారాన్ని పొందడానికి చిరకాల మిత్రపార్టీ బీజేపీకి దూరమై.. ఆజన్మాంతం వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ సపోర్టుతో అధికారాన్ని చేపట్టగలిగారు. ప్రశాంత్ కిశోర్ కలిసి పని చేసిన వారందరు అధికారంలోకి రాలేదు.. అలాగని ఆయన సేవలు ఎవరికీ ఉపయోగపడలేదు అనడానికి లేదు. కాకపోతే.. తాజాగా విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాల ప్రకారం ఎవరికి గెలిచే అవకాశాలు కనిపిస్తే వారితో తెలివిగా జతకట్టి తన క్రెడిబిలిటీ పెంచుకోవడం పీకే వ్యక్తిగత వ్యూహమని తెలుస్తోంది. ఇందుకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులను, ఆనాడు పీకే కదలికలను ఉదాహరణగా చూపిస్తున్నారు. గత సంవత్సరం జరిగిన తమిళనాడు ఎన్నికలకు పూర్వం.. పీకే నాలుగైదు తమిళపార్టీలతో మంతనాలు నడిపారు. చరిష్మా వున్న సినీ నటులను కలిసి, వారిని రాజకీయ బరిలోకి లాగేందుకు యత్నించారు. కానీ చివరికి గెలిచే అవకాశాలు కనిపించి డిఎంకే పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. నిజానికి పీకే, స్టాలిన్ జతకట్టడానికి ముందే అక్కడి రాజకీయాల్లో డిఎంకే ఆధిపత్యం కనిపించింది. జయలలిత మరణం తర్వాత చాలా వీక్ అయిన అన్నా డిఎంకేను స్టాలిన్ ఈజీగా ఓడిస్తారని చాలా మంది ముందే ఊహించారు. చివరికి అదే జరిగింది. స్టాలిన్ విజయంలో పీకే పాత్ర ఎంతా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. పశ్చిమ బెంగాల్లోను అదే పరిస్థితి. బీజేపీని ఓడించే దిశగా దూకుడు మీదున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సిట్టింగ్ సీఎం మమతాబెనర్జీ దగ్గర భారీ రెమ్యూనరేషన్ తీసుకుని మరీ పీకే ఆమె కోసం గత అసెంబ్లీ ఎన్నికల్లో పని చేశారు. పీకే వ్యూహాలతో అనేకంటే ప్రచార పర్వం చివరి అంకంలో దీదీ అభినయంతోనే బెంగాల్లో విజయం సాధించిందని చెప్పుకోవచ్చు.
My quest to be a meaningful participant in democracy & help shape pro-people policy led to a 10yr rollercoaster ride!
As I turn the page, time to go to the Real Masters, THE PEOPLE,to better understand the issues & the path to “जन सुराज”-Peoples Good Governance
शुरुआत #बिहार से
— Prashant Kishor (@PrashantKishor) May 2, 2022
PRASANT KISHORE తాజా నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించిందనే చెప్పాలి. మే రెండో తేదీన ఉదయమే ప్రశాంత్ కిశోర్ చేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. మీడియాకు బ్రేకింగ్ న్యూస్ అందించింది. తన ట్వీట్ ద్వారా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించడమే కాకుండా తన పార్టీ పేరు ‘‘ జన సురాజ్’’ PEOPLE’S GOOD GOVERNANCE అని కూడా వెల్లడించేశారు పీకే. అయితే ఆయన నిర్ణయం కొందరికి షాకివ్వగా.. చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే కేవలం వ్యూహాలే ఎన్నికల్లో విజయానికి ఉపయోగపడవన్నది రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్‌కు తెలియనిది కాదు. రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు, చరిష్మా కలిగిన అధినేత అవసరమన్నది ఈరోజుల్లో ఎవరిని అడిగినా చెబుతారు. బలగం కూడా రాజకీయాల్లో పెద్ద పాత్రే పోషిస్తుంది. ప్రశాంత్ కిశోర్‌కు ఈ కీలకాంశాలు తెలియదు అనుకోలేం. మరి కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలో చేరకుండా సొంత కుంపటి పెట్టుకోవాలని పీకే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఏప్రిల్ రెండోవారం నుంచి పీకే కాంగ్రెస్ ఎంట్రీపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. పీకే వ్యూహాలపై సోనియా తొలుత సానుకూలంగా స్పందించింది. ఆయనిచ్చిన నివేదికపై అధ్యయనంతోపాటు పీకే పార్టీలో చేరితే ఎలాంటి హోదా ఇవ్వాలనే దానిపై కూడా సోనియా సమాలోచనలు జరిపింది. చివరికి రాహుల్ ప్రాబల్యాన్ని, ప్రాధాన్యతను తగ్గుతుందన్న భయంతో సోనియా పీకేకు కేవలం సామాన్య ఎంట్రీని ఆఫర్‌గా ఇచ్చి.. పొమ్మనక పొగబెట్టింది. తనను తాను అతిగా ఊహించుకున్న ప్రశాంత్ కిశోర్ సాధారణ సభ్యునిగా ఉండలేనంటూ సోనియా ఆఫర్‌ను తిరస్కరించారు. వ్యూహకర్తగా తనకు రాజకీయ పార్టీల్లో క్రేజీ వుండొచ్చు కానీ ప్రజల్లో ఆయనకు ఏ మాత్రం చరిష్మా లేదన్నది నిర్వివాదాంశం. వ్యూహకర్తగా ఆయన్ను ఇష్టపడే, ఆయన సేవలను కోరుకునే రాజకీయ నేతలుండొచ్చు కానీ ఒకసారి ఆయన పూర్తిస్థాయిలో రాజకీయ నేతగా అవతరిస్తే మాత్రం గతంలో ఆయన్ను డబ్బులిచ్చి ఉపయోగించుకున్న రాజకీయ పార్టీలే ఆయన్ను వ్యతిరేకిస్తాయి. ప్రత్యర్థిగా చూస్తాయి. ఇక డబ్బు పరంగా చూస్తే వ్యూహకర్తగా ఆయన వందల కోట్లలో రాజకీయా పార్టీల నుంచి సర్వీస్ ఛార్జీలను వసూలు చేసి వుండొచ్చు. అందులో కొంత తన రాజకీయ గమనానికి వినియోగించాలని ప్రస్తుతం భావిస్తుండొచ్చు. కానీ ఒకసారి ధనాన్ని వెచ్చించడం మొదలుపెడితే రాజకీయ పార్టీ నడపడంలో ఎంత ధనమైనా కరిగిపోక తప్పదు. ఇదంతా తెలియకనా ప్రశాంత్ కిశోర్ సొంత పార్టీ స్థాపించాలని నిర్ణయించుకున్నారు ? అందుకే ఆయన వ్యూహాన్ని మరోకోణంలో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీహార్ రాష్ట్రంలో అధికారంలో వున్న జేడీయూతో పీకే కొంత కాలం పనిచేశారు. నితీశ్ కుమార్‌తో ఆయన తొలుత సఖ్యతతోనే వున్నారు. కానీ నితీశ్ కుమార్‌తో పొసగక పోవడంతో ప్రశాంత్ కిశోర్ జేడీయూకి దూరమయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను ఓడించేందుకే ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ సొంత పార్టీకి రెడీ అవుతున్నారని కొందరు భావిస్తున్నారు. బీహార్ బరిలో జేడీయూ, ఆర్జీడీల మధ్య ప్రశాంత్ కిశోర్ పార్టీ చేరితే.. పోటీ ముక్కోణమై పరోక్షంగా ఆర్జేడీకీ లాభిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ఇక మరికొందరు పీకే వ్యూహంలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ కూటమి కోణంలోనే ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ పార్టీలో చేరకుండా సొంతంగా పార్టీ పెట్టుకుంటున్నారని వారు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరాన్ని పాటించే పార్టీలతో కలిసి ఏర్పడే కూటమి గనక జాతీయ స్థాయిలో అధికారాన్ని సాధించే పరిస్థితే వుంటే కేంద్రంలో చక్రం తిప్పగలిగిన వ్యూహకర్తగా తాను మారొచ్చన్నది పీకే భవిష్యత్ ప్రణాళిక అని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్‌తో రెండ్రోజుల భేటీ తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కొత్త వ్యూహానికి పీకే తెరలేపి వుంటారని భావిస్తున్నారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ కూటమి (ఫెడరల్ ఫ్రంట్ అనే పేరు ఇప్పుడు కేసీఆర్ ప్రవచించడం లేదు) అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉత్పన్నమైతే.. దానికి నేషనల్ ఫిగర్, జాతీయ అంశాలపై పట్టు, వ్యూహం వున్న నేత అవసరం ఏర్పడుతుంది. ఆ అవసరాన్ని తాను తీర్చడం ద్వారా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాలన్నది పీకే వ్యూహంగా అంచనా వేస్తున్నారు కొందరు. మొత్తానికి పీకే ట్వీట్ ఇపుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.