MUNUGODU BY-ELECTION: జోరందుకున్న మునుగోడు ప్రచారం.. మూడు పార్టీలవి మూడు భిన్న ప్రచారాస్త్రాలు.. గుంభనంగా ఓటర్లు

ప్రధాన పార్టీలు ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నాయి ? ఈ అంశంపై కాస్త లోతైన చర్చ జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. అటు కేంద్రంలో గత ఎనిమిదేళ్ళుగా బీజేపీ అధికారంలో వుంది. ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఎనిమిదేళ్ళుగా అధికారంలో వుంది

MUNUGODU BY-ELECTION: జోరందుకున్న మునుగోడు ప్రచారం.. మూడు పార్టీలవి మూడు భిన్న ప్రచారాస్త్రాలు.. గుంభనంగా ఓటర్లు
Rajagopal, Sravanti And Prabhakar Reddy
Follow us

|

Updated on: Oct 26, 2022 | 1:42 PM

మునుగోడు ప్రచారంతో తెలంగాణ హోరెత్తుతోంది. ప్రచారపర్వంలో ఇంకా ఆరు రోజులే మిగిలి వుండడంతో ప్రధాన పార్టీలతోపాటు బరిలో దిగిన చిన్నాచితక పార్టీలు, ఇండిపెండెంట్లు కూడా ప్రచారం జోరుపెంచారు. మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని అన్ని విధాలా రక్తి కట్టిస్తుండగా.. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మునుగోడు అభ్యర్థి అయిన కే.ఏ.పాల్ తనలోని డిఫరెంట్ షేడ్స్‌ని, టాలెంట్స్‌ని మునుగోడు వీథుల్లో ప్రదర్శిస్తూ ఓటర్లకు ఆటవిడుపులా మారారు. మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు దక్కవంటూ నమ్మశక్యం కానీ మాటలతో ఓటర్లను బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. ఇదిలా వుంటే నవంబర్ 1వ తేదీ సాయంత్రానికి మునుగోడు ప్రచారానికి తెరపడనున్నది. ఈలోగా ఒక్కో ఓటరును కనీసం మూడుసార్లు కలిసేలా మూడు పార్టీలు చర్యలు తీసుకుంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరపున దాదాపు 15 మంత్రులు, 70 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎమ్మెల్సీలు, ఇతరత్రా వివిధ బాధ్యతల్లో వున్న వారు మరికొందరు మునుగోడులో గత 20 రోజులుగా మకాం వేశారు. వార్డుల వారీగా బాధ్యతలు చేపట్టి ఒక్కో ఓటరును పలు మార్లు కలిసి కారు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. బీజేపీ తరపున రాష్ట్ర, జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు నియోజకవర్గంలో మకాం వేశారు. దీపావళి పండుగను కూడా మునుగోడు ఓటర్ల సమక్షంలోనే జరుపుకోవాలన్న అధిష్టానం ఆదేశం మేరకు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా నేతలంతా మునుగోడులోనే ప్రజల సమక్షంలో గడిపారు. ఈ వ్యూహానికి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ ‘18 వేల కోట్ల’ ప్యాకేజీ అంటూ బాణాసంచాను కాల్చింది. ఇపుడు పండుగ ముగిసింది. ప్రచార హోరు మళ్ళీ జోరందుకుంది. ఈ క్రమంలో అక్టోబర్ 30న ముఖ్యమంత్రి కేసీఆర్ చండూరు సభలో పాల్గొనాలన్న నిర్ణయం వెలువడింది. మర్నాడే అంటే అక్టోబర్ 31న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అదే చండూరులో సభకు హాజరు కానున్నారు. ఇలా అగ్రనేతల రాకతో మునుగోడు ప్రచారం పీక్ లెవెల్‌కు చేరే అవకాశం వుంది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడం మునుగోడు ఓటర్లకు బాగా కలిసి వస్తోంది. కక్కా, ముక్కతో గత 20 రోజులుగా పొద్దున్నా సాయంత్రం విందు వినోదాలతో మునుగోడు ఓటరు మునిగి తేలుతున్నాడు. మొన్నామధ్య దసరా.. తాజాగా దీపావళి ఇలా ప్రధాన పండుగలు కూడా ప్రచారం మధ్యలో రావడంతో పార్టీలన్నీ ప్రజలను మందు, మద్యంతో ముంచెత్తాయి. కాస్ట్లీ మద్యం.. మటన్, చికెన్ పార్సిళ్ళతో అలరించాయి. దీనికి అదనంగా ఓటర్ల ప్రలోభానికి భారీ ఎత్తున డబ్బు పంపిణీ జరుగుతందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. తరచూ కారుల్లో దొరుకుతున్న కోట్ల రూపాయలు ఈ ఆరోపణలు నిజమని చాటుతున్నాయి. నియోజకవర్గానికి చెంది.. వివిధ కారణాలతో వేరే చోట్ల వుంటున్న ఓటర్ల పోస్టల్ బ్యాలెట్ కూడా భారీగా ధర పలుకుతున్నట్లు మీడియా కథనాలు కనిపిస్తున్నాయి. ఒక్కో పోస్టల్ ఓటుకు 5 వేల రూపాయలు చెల్లించేందుకు ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. కాకపోతే తమ ముందే ఓటు వేసి.. పోస్టు చేయాలని కండీషన్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే ప్రధాన పార్టీలు ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నాయి ? ఈ అంశంపై కాస్త లోతైన చర్చ జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. అటు కేంద్రంలో గత ఎనిమిదేళ్ళుగా బీజేపీ అధికారంలో వుంది. ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఎనిమిదేళ్ళుగా అధికారంలో వుంది. సో.. రెండు పార్టీలు తమ తమ ప్రభుత్వాల హయాంలో ఏ మేరకు ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశాయో చెప్పుకుంటున్నాయి. కాకపోతే ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు, ఆరోపణల తాకిడే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రచారాంశాలు పెద్దగా ప్రస్తావనకు రావడం లేదు. అయితే, టీఆర్ఎస్ పార్టీ గత ఎనిమిదేళ్ళుగా అమలు చేసిన సంక్షేమ పథకాలను గణాంకాలతో సహా కరపత్రాలు ముద్రించి పంచిపెడుతోంది. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలు రాకుండా వుండేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది గులాబీ పార్టీ. ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇందుకోసం కొందరు ఇంఛార్జీలను గ్రామాల వారీగా నియమించారు. వారు సరిగ్గా పని చేస్తున్నారా లేదా పరిశీలించేందుకు నిఘా బృందాలను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పనులతో పాటు మునుగోడు నియోజకవర్గానికి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందనే అంశాన్ని కూడా ప్రజలకు వివరిస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద మునుగోడు నియోజకవర్గంలోనే పదివేల కోట్ల రూపాయలను వెచ్చింది.. రెండు లక్షల 88 వేల మందికి లబ్ధి చేకూర్చినట్లు గులాబీ నేతలు వివరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారు విధిగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు సెంటిమెంటు రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాధ్యతలను నిర్వహించేందుకు ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఒక మంత్రి లేదా ఓ సీనియర్ ఎమ్మెల్యేను బాధ్యునిగా ఎంపిక చేశారు. ఆ బాధ్యుని కింద 20 నుంచి 25 మంది చక్కని తర్ఫీదునిచ్చిన సెకెండ్ లెవెల్ లీడర్లను నియమించారు. వీరందరు స్థానిక నేతలతో కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వీరంతా తమకు కేటాయించిన ప్రాంతాలలో తిరిగి తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు.

ఇక ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో వున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో తన వెంట నడిచిన శ్రేణులు ఏ పార్టీలో వున్నా తనకోసం పనిచేసేలా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈక్రమంలో బీజేపీ కూడా యువతే ప్రధాన లక్ష్యంగా పని చేస్తోంది. నియోజకవర్గంలో రెండు లక్షల 41 వేల 367 మంది ఓటర్లుండగా వీరిలో 40 ఏళ్ళకు లోబడి వున్నవారు ఏకంగా లక్షా 25 వేల మంది వున్నారు. వీరి ఓట్లను గంపగుత్తగా పొందేందుకు బీజేపీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. వీరిని ఆకర్షించగలిగితే వారే తమ కుటుంబీకుల ఓట్లు కూడా బీజేపీకి పడేలా ఒప్పిస్తారన్న అంచనాలో కమలనాథులున్నారు. యువతను ఆకట్టుకునేందుకు జాతీయతాభావాన్ని వారు వినియోగించుకుంటున్నారు. వీరికి మద్దతుగానే అయితే వేరుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) కార్యకర్తలు గుట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ తరహాలోనే ప్రతి 60 మంది ఓటర్లకు ఒకరు చొప్పున బాధ్యులను బీజేపీ నియమించింది. మండలాలు, సామాజిక వర్గాల వారీగా జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలకు బాధ్యతలప్పగించారు. పోల్ మేనేజ్‌మెంటులో నిష్ణాతునిగా పేరున్న సునీల్ బన్సల్ ప్రచార పర్వాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ ఈ పనులను చూసుకుంటోంది. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ బూత్‌లున్నాయి. ఒక్కో బూత్‌కు ఒక ముఖ్యనేతను నియమించారు. వీరు కాకుండా బీజేపీ మహిళా మోర్చకు చెందిన 20 బృందాలు కూడా నియోజకవర్గంలో కలియ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ఇక మూడో ప్రధాన పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని మహిళా ఓటర్లలో సెంటిమెంటును నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. అభ్యర్థిని పాల్వాయి స్రవంతి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమ తమ ప్రచారంలో తరచూ మహిళ స్వాభిమానం మునుగోడులో విజయం సాధించాలని పిలుపునిస్తున్నారు. ఆడబిడ్డను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. టీపీసీసీ సారథ్యంలో త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ పోలింగ్ బూత్ స్థాయి ప్రచారానికి మొత్తం 7 వేల 325 మందిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ప్రతీ 8 పోలింగ్ బూత్‌లకు ఒక క్లస్టర్ ఇంఛార్జిని నియమించారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 41 వేల ఓట్లలో లక్షా 19 వేల 859 మంది మహిళా ఓటర్లున్నారు. ఇది 50 శాతానికి కొంచెం తక్కువ. బరిలో వున్న ఏకైక మహిళ కావడంతో తమకే మహిళల ఓట్లు పోలరైజ్ అయితే.. స్రవంతి విజయం ఖామని టీపీసీసీ వ్యూహరచన చేసింది. కాంగ్రెస్ తరపున గెలిచిన రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయారంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడుకు చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆమె ప్రచారం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళలకు బొట్టు పెట్టి, గాజులిస్తూ స్రవంతి ఓట్లడుగుతున్నారు. బొట్టు పెట్టించుకున్న వారు సెంటిమెంటుతో తనకు ఓట్లేస్తారన్నది ఆమె భావనగా కనిపిస్తోంది. మొత్తమ్మీద ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు యధాశక్తి ప్రయత్నిస్తున్నాయి. సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. మునుగోడు ఓటరు మాత్రం గుంభనంగా వుంటున్నాడనే చెప్పాలి. పార్టీలిస్తున్న అన్నింటినీ తీసుకుంటున్న తన మనోభిప్రాయాన్ని వెల్లడించకుండా ప్రధాన పార్టీలను టెన్షన్ పెడుతున్న మునుగోడు ఓటరు నవంబర్ 3న ఏ తీర్పు ఇస్తాడో అన్నది ఆసక్తి రేపుతోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు