Lay-Offs in IT Sector: మరింత వేగంగా లే-ఆఫ్స్.. మాంధ్యం దెబ్బకు ఐటీ రంగం బేజారు.. జాబ్స్ కోల్పోతున్న టెకీలు లక్షలు
అమెరికాలో మొదలైన ఆర్థిక మాంధ్యం ఇతర దేశాలపైనా, ఇతరత్రా రంగాల మీద ఏ మేరకు ప్రభావం చూపుతుందో కానీ టెక్ కంపెనీల మీద మాత్రం పెను ప్రభావాన్ని చూపుతోంది.
ప్రపంచ ఆర్థికవేత్తలు ఊహించినట్టుగానే అమెరికా ఆర్థిక మాంధ్యంలో కూరుకు పోతోంది. అమెరికాలో మొదలైన ఆర్థిక మాంధ్యం ఇతర దేశాలపైనా, ఇతరత్రా రంగాల మీద ఏ మేరకు ప్రభావం చూపుతుందో కానీ టెక్ కంపెనీల మీద మాత్రం పెను ప్రభావాన్ని చూపుతోంది. దాంతో ప్రధాన టెక్ కంపెనీలు వేలాది సంఖ్యలో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇందులో వేల కోట్ల డాలర్ల బిజినెస్ చేసే ఫేస్బుక్, మెటా, అమెజాన్ మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఉండగా తాజాగా రిసెషన్ దరిచేరదనుకున్న గూగుల్ సంస్థ కూడా వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు కార్యక్రమానికి పూనుకుంది. గూగుల్ మాతృ సంస్థగా భావించే ఆల్ఫాబెట్ కూడా లే- ఆఫ్ ప్రకటించింది. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న ఆర్థికవేత్తలు అమెరికాలో మొదలైన ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పలు ప్రపంచ దేశాలకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సత్యనాదెళ్ళ లాంటి వారైతే ఆర్థిక మాంధ్యం ప్రభావం 2023 జూన్, జులైదాకా వుండే అవకాశం వుందంటున్నారు. ఆర్థిక మాంద్యం ఒక్క టెక్ కంపెనీలపైనే కాకుండా అన్ని రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ మాంద్యం తొలుత ఐటి కంపెనీల మీద ప్రభావం చూపుతుండగా మెల్లిగా మాంధ్యం ప్రభావం ఇతర రంగాలపై కూడా చూపే అవకాశం ఉందంటున్నారు. 2022 జనవరి నుంచి అమెరికాలో పలుటెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. నవంబర్ నుంచి ఉద్యోగాల తొలగింపు ఊపందుకుంది. 2023 జనవరి మొదటి వారంలో ఈ ప్రక్రియ మరింత జోరందుకుంది. జనవరి ఒకటవ తేదీ నుంచి 24వ తేదీ మధ్యకాలంలో రోజుకు సగటున 3 వేల మంది ఐటీ ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయారని అంచనా. మొత్తమ్మీద 166 ఐటీ కంపెనీలు 65 వేల మందికిపైగా ఉద్యోగులను ఇప్పటివరకు తొలగించినట్లు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు భారతీయులు కాగా అందులో తెలుగువారే అత్యధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. అంటే అమెరికాలో మొదలైన ఈ ఆర్థిక మాంధ్యం ప్రభావం మెల్లిగా తెలుగు రాష్ట్రాలకు పాకే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే అమెరికాలో పనిచేస్తున్న టెకీలలో చాలామంది హెచ్1బీ వీసాలపై కొనసాగుతున్న వారే. ఈ వీసాలపై కొనసాగుతున్న వారిలో ఉద్యోగాలు కోల్పోయిన వారు 60 రోజులలోగా మరో ఉద్యోగంలో చేరకపోతే వారి వీసాలు త ఫలితంగా వారు ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
టెకీల మెడపై కత్తి
ఐటీ కంపెనీల ఉద్యోగుల్లో మెడపై కత్తులు వేలాడుతున్నాయి. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని అందరూ భయం భయంగా ఉన్నారు. ఏ క్షణంలో పింక్ స్లిప్పు వస్తుందోనని వారంతా భయపడుతున్నారు. వర్క్ ఫ్రొం హోమ్‌తో దాదాపు మూడేళ్ళుగా రిలాక్స్డ్గా ఫీలవుతున్న టెకీలు ఇప్పుడు ఆర్థిక మార్గం దెబ్బతో ఆందోళనకు గురవుతున్నారు. దాంతో దిగ్గజ కంపెనీలలో పనిచేస్తున్న వారు కూడా తమకు ఉద్యోగ భద్రత లేదని వాపోతున్నారు. భవిష్యత్తులో ఆర్థిక మాంధ్యం మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్న ఐటీ కంపెనీలు వీలైనంతవరకు కాస్ట్ తగ్గించుకునే ప్రయత్నాలు తీవ్రతరం చేశాయి. అందుకే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకునే పనిలో, వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల కుదింపు ప్రధాన అంశంగా టెక్ కంపెనీలకు కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఉద్యోగుల సేవలను వినియోగించుకొని కోట్లు కొల్లగట్టిన ఐటీ సంస్థలు ఇప్పుడు ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తూ తమ కంపెనీల బాగోకులకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నాయి. ఆయా దిగ్గజ కంపెనీల ఎదుగుదలలో తాము భాగస్వాముల మైనప్పటికీ ఇప్పుడు తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని అమెరికాలోని పలు కంపెనీలలో పని చేస్తున్న భారతీయులు కలవరం చెందుతున్నారు.
కరోనా కొట్టిన దెబ్బ ప్రభావం
2020, 21 సంవత్సరాలలో యావత్ ప్రపంచం కరోనా కాటుకు గురైంది. నెలల తరబడి వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడంతో చాలా కంపెనీలు ఆర్థికంగా కూదేలయ్యాయి. అయితే పూర్తిస్థాయిలో తమ కంపెనీలు దెబ్బతినకుండా చూసుకునేందుకు ఉద్యోగులను వెంటనే తొలగించుకోకుండా వారందరినీ వర్క్ ఫ్రం హోం చేయించాయి ఆల్మోస్ట్ అన్ని ఐటీ కంపెనీలు. తాజాగా 2022 సంవత్సరం మొదటి భాగం నుంచి కరోనా కనుమరుగవ్వడం, తమ వ్యాపార లావాదేవీలు మాత్రం సాధారణ స్థాయికి చేరుకోకపోవడంతో కాస్ట్ కటింగ్‌పై దృష్టి సారించాయి.టెక్ కంపెనీలు. కరోనా కారణంగా ప్రజలు, కంపెనీల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో టెక్ కంపెనీలకు రాబడులు తగ్గిపోయాయి. దాంతో కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఉద్యోగుల తొలగింపునకే కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. 2022 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 965 కంపెనీలు మొత్తం మీద లక్షన్నర మoది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గత నవంబర్ నుంచి ఇప్పటివరకు అంటే కేవలం మూడు నెలల కాలంలో దాదాపు రెండు లక్షల మందికి పైగా ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయారని డేటాబేస్ ప్రకటించింది. జరుగుతున్న పరిణామాలను చూస్తే వచ్చే ఆరు నెలల కాలం మరింత గడ్డు కాలమని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగుల సంఖ్యకు కోతపెట్టే పనిలో పడ్డాయి. రెండు నెలల క్రితం ట్విట్టర్‌ని పూర్తిస్థాయిలో టేకోవర్ చేసిన ఎలాన్ మస్క్.. వచ్చి రావడంతోనే 12 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్‌తో పాటు మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ దిగ్గజ కంపెనీలతోపాటు చాలా ఐటీ సంస్థలు కూడా ఉద్యోగుల కుదింపునకు పూనుకున్నాయి.
హెచ్చరించిన సత్య నాదెళ్ళ
ఇటీవల భారత దేశ పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల ఈ సంవత్సరం జూన్, జూలై నాటికి ఆర్థిక మాంధ్యం చాలా దేశాలపై పెను ప్రభావాన్ని చూపుతోందని హెచ్చరించారు. ఇదే జరిగితే దీని ప్రభావం భారతదేశంలో ఎలా ఉంటుందన్న భయాందోళన ఇప్పుడు మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ శకం మొదలయ్యాక లక్షలాదిమంది తెలుగు టెకీలు అమెరికాతో పాటు పలు దేశాలకు వలస పోయారు. ఆయా కంపెనీలలో ఐటీ సంస్థల ఎదుగుదలలో భాగస్వాములయ్యారు. తాము ఆర్థికంగా బాగుపడటంతో పాటు తాము పని చేస్తున్న సంస్థలకు కోట్లు ఆర్జించే క్రతువులో భాగస్వాములయ్యారు. కానీ తాజాగా ఆ కంపెనీలు వారిని వదులుకునేందుకే సిద్ధపడటం ఆందోళనకు గురి చేసే పరిణామం. దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్లో పెద్ద ఎత్తున లే-ఆఫ్స్ మొదలయ్యాయి. మొత్తం ఉద్యోగుల సంఖ్య నుంచి ఆరు శాతం ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమయింది. అయితే వీరికి 60 రోజుల నోటీస్ పీరియడ్ ఉంటుందని గూగుల్ అధినేత సుందర్ పిచాయ్ వెల్లడించారు. తొలగించనున్న ఆరు శాతం ఉద్యోగులకు 16 వారాల వేతనాన్ని ఇవ్వడంతో పాటు, వారు సంస్థలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి రెండు వారాల వేతనాన్ని అదనంగా పరిహారం ప్యాకేజీ కింద ఇస్తామని వెల్లడించారు. తాజా ఆర్థిక మాంధ్యాన్ని కూలంకషంగా సమీక్ష జరిపిన తర్వాతనే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుందామని సుందర్ పిచాయ్ చెబుతున్నారు. ప్రస్తుతం దిగ్గజ ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో దాదాపు 40 శాతం వరకు భారతీయ ఐటీ ప్రొఫెషనల్ ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 80వేల మందికి పైగా భారతీయులు ఇప్పటివరకు ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇందులో 60 శాతం తెలుగు ప్రజలు ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే ఇప్పుడు వారంతా తమకక్కడ వేరే ఉద్యోగాలు దొరక్కపోతే, తమ స్వస్థలాలకు తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తే ఏమిటన్న ఆందోళన సర్వత్ర వినిపిస్తోంది. ఉద్యోగాల తొలగింపు కారణంగా హెచ్1బి, ఎల్1 వీసాల వారే అధికంగా ఉంటారు. వీరు తమ ఉద్యోగాలు కోల్పోయిన 60 రోజుల కాలంలో మరో ఉద్యోగంలో చేరకపోతే వారి వీసా రద్దవుతుంది. అప్పుడు ఇండియాకు తిరిగి రాక తప్పని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. వీరందరినీ ఆదుకునేందుకు అమెరికాలో పనిచేస్తున్న ప్రవాస భారతీయ సంఘాలు, మరీ ముఖ్యంగా తెలుగు సంఘాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘాల సాయంతో అక్కడే కొత్త జాబ్ వెతుక్కుని ఉండిపోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయన్నది తేల్చి చెప్పలేని పరిస్థితి. ఏళ్ల తరబడి తాము తమ సంస్థలను నమ్ముకొని పనిచేస్తున్నామని, ఇప్పుడు ఆర్థిక మాంధ్యం పేరిట తమను ఇంటికి పంపితే పరిస్థితి ఏమిటని వారంతా ఆందోళన చెందుతున్నారు.
హెచ్1బీ వీసా హోల్డర్ల పరిస్థితి అగమ్యగోచరం
నాన్ ఇమిగ్రెంట్ వర్క్ వీసాలైన హెచ్1బి, ఎల్1 వీసాలపై భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ అమెరికాలో చాలామంది ఉన్నారు. వీరు అక్కడ శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. ఉద్యోగం ఉన్నంతకాలం మట్టుకు మాత్రమే వారక్కడ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగాల కోతకే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి మళ్ళీ ఉద్యోగం దొరుకుతుందా అంటే కచ్చితంగా సమాధానం ఇవ్వలేని పరిస్థితి. టెక్ కంపెనీల్లో కాస్ట్ కటింగ్ దోవలో వున్నందున 60 రోజుల్లో వీరంతా కొత్త ఉద్యోగం వెతుక్కోవడం అనేది అసాధ్యమని చెప్పాలి. దాదాపు 15 సంవత్సరాల క్రితం ఉత్పన్నమైన ఆర్థిక మాంధ్యంలో.. ఆనాడు ప్రపంచవ్యాప్తంగా 60 వేల మందిని టెక్ కంపెనీలు తొలగించాయి. ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య ఆనాటి సంఖ్యతో పోలిస్తే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకునేందుకు భారత ప్రభుత్వం ముందుకు రావాల్సిన అగత్యం ఎంతైనా ఉంది.