BJP South Expedition: దక్షిణాదిపై బీజేపీ ఫోకస్.. కర్నాటక మినహా ప్రతీచోటా ప్రతికూలమే.. సానుకూలత కంటే అవరోధాలే ఎక్కువ

మిత్ర పక్షాలతో కలిసి 333 సీట్లలో గెలుపొంది వరుసగా రెండోసారి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. తాజాగా మరో 12-13 నెలల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ హైకమాండ్‌లో అంతర్మధనం మొదలైంది.

BJP South Expedition: దక్షిణాదిపై బీజేపీ ఫోకస్.. కర్నాటక మినహా ప్రతీచోటా ప్రతికూలమే.. సానుకూలత కంటే అవరోధాలే ఎక్కువ
Bjp South Expedition
Follow us

|

Updated on: Mar 07, 2023 | 3:51 PM

భారతీయ జనతా పార్టీ.. మతతత్వ రాజకీయాలకు పాల్పడుతుందని దేశంలో వున్న రాజకీయ పార్టీల్లో దాదాపు 90 శాతం పార్టీలు ఆరోపించే పార్టీ. 1996, 1998, 1999 ఎన్నికల్లో మిత్ర పక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చిన పార్టీ. తొలిసారి 13 రోజులు, మలిసారి 13 నెలలే అధికారంలో వున్నా.. ఆ సానుభూతి కలిసి రాగా 1999లో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టి అయిదేళ్ళు అంటే 2004 దాకా దేశాన్ని పాలించిన పార్టీ. ఆ తర్వాత పదేళ్ళ పాటు అధికారానికి దూరమైన పార్టీ. అదేసమయంలో బీజేపీలో నాయకత్వం కూడా మారింది. 80వ దశకం మొదలు 2004 దాకా బీజేపీకీ సూర్యచంద్రులుగా వున్న అద్వానీ, వాజ్‌పేయిల తరం పోయి.. కొత్త తరం వచ్చిన కాలమది. వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీల సారథ్యంలో దాదాపు దశాబ్ధకాలంపాటు బీజేపీ పని చేసింది. అయితే వీరిలో ఏ ఒక్కరు కూడా సొంత చరిస్మాను సంతరించుకోలేకపోయారు. ఇదేకాలంలో పశ్చిమ భారత్‌లో ఉదయించిన నరేంద్రుడు మెల్లిగా జాతీయస్థాయి నేతగాను, 2012 నాటికి ఏకంగా ప్రధాన మంత్రి అభ్యర్థిగాను పరిణామం చెందిన పరిస్థితి. ఆ తర్వాత రాజకీయాలు, ఎన్నికల ఫలితాలపై పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మోదీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసుకుందో ఆ తర్వాత ఆ పార్టీ దశదిశా మారిపోయాయి. 2014, 2019 ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో ప్రత్యర్థులను నివ్వెర పరిచారు మోదీ. 2016 నోట్ల రద్దు అంశాన్ని, రాఫేల్ కొనుగోలు ఒప్పందాన్ని బూచిగా చూపించి, మోదీని గద్దె దింపాలని విపక్షాలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భావించాయి. కానీ అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్లుగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 2014 రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా 300 సీట్ల మార్కును దాటేసింది. మిత్ర పక్షాలతో కలిసి 333 సీట్లలో గెలుపొంది వరుసగా రెండోసారి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. ఇక్కడి వరకు బాగానే వున్నా.. తాజాగా మరో 12-13 నెలల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ హైకమాండ్‌లో అంతర్మధనం మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

హిందీ పార్టీగా ముద్ర

బీజేపీని తొలి నుంచి హిందీ బెల్ట్ పార్టీగా భావిస్తారు. అందుకు కారణం రామమందిర అంశాన్ని భుజానికెత్తుకున్న సందర్భంలో బీజేపీ గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో బాగా వేళ్ళూకుపోయింది. వాటిలో చాలా రాష్ట్రాలలో అధికారానికి కూడా వచ్చింది. దాంతో బీజేపీని హిందీ బెల్ట్ పార్టీగా ముద్ర వేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీ అదే కోవలో కొనసాగుతోంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోను బీజేపీ హిందీ బెల్ట్ రాష్ట్రాలలో అత్యధిక సీట్లను గెలుపొందింది. యుపీలో గాంధీ, నెహ్రూ కుటుంబీకులు దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న అమేథీ, రాయ్‌బరేలీ, అలహాబాద్ వంటి ఎంపీ సీట్లలో కాంగ్రెస్ ఓటుబ్యాంకును కొల్లగొట్టింది. అమేథీలో రాహుల్ గాంధీని .. స్మృతీ ఇరానీ ఓడించారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. 2019 కంటే ముందు నోట్ల రద్దు అంశం ప్రతికూల ప్రభావం చూపుతుందని బీజేపీ నేతలు కొందరు భయపడ్డారు. కానీ ఆ ప్రతికూలతను సర్జికల్ స్ట్రైక్ అంశం గట్టెక్కించింది. రాఫేల్ కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ రాహుల్ గాంధీ ఎంతగా ప్రచారం చేసినా జనం విశ్వసించలేదు. సర్జికల్ స్ట్రైక్‌తో ప్రతీ భారతీయ పౌరుడి ఛాతీ 56 ఇంచెస్‌ మార్కును దాటేసింది. అదే ఊపులో కమలానికి ఓట్లేసేలా చేసింది. ఆతర్వాత 2019 ఎన్నికల్లో బీజేపీ 300 సీట్ల మార్కును దాటేలా చేసేసింది. 2019లో రెండోసారి ప్రధాని అయిన తర్వాత మోదీపై నియంత అనే ముద్ర వేయడం మొదలైంది. పార్టీలోను, ప్రభుత్వంలోను తాను చెప్పిందే వేదం, చేసిందే మార్గం అన్న చందంగా మోదీ పనితీరు మారిపోయింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కట్టబెట్టిన ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న అనూహ్య నిర్ణయంతో రద్దు చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. దశాబ్దాలుగా కశ్మీర్‌లో అల్లర్లకు కారణమైన ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని బీజేపీ తొలి నుంచి చెబుతున్నా గతంలో ఆ సాహసం చేయలేకపోయింది. దానికి కారణం మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే. 2019లో సొంతంగా అధికారంలో కొనసాగే స్థాయిలో ఎంపీ సీట్లను గెలుచుకోవడంతో బీజేపీ తమ ఎజెండాలోని తొలి అంశాన్ని నెరవేర్చేసింది.

సొంత ఎజెండా అమలుకు శ్రీకారం

ఆర్టికల్ 370 రద్దుకు ముందే కశ్మీర్‌లో ఉత్పన్నమయ్యే పరిణామాలను అంచనా వేశారు మోదీ అండ్ కో. తమకు అత్యంత విశ్వసనీయ అధికారి అయిన జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్‌ని గ్రౌండ్ లెవెల్ పరిశీలనకు పంపారు. ఆయనిచ్చిన నివేదిక ఆధారంగా కార్యాచరణ రూపొందించారు. ఆగస్టు అయిదవ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్న బిల్లును లోక్‌సభ ముందుకు తెచ్చారు. విపక్షాల గగ్గోలును నిరోధించడమే కాకుండా.. తిరుగులేని స్పీచ్‌తో హోం మంత్రి అమిత్ షా అదరగొట్టారు. అమిత్ షా ప్రసంగ ప్రభావంతో తొలుత లోక్‌సభలోను, మర్నాడు రాజ్యసభలోను విపక్షాలు డిఫెన్సులో పడ్డాయి. కీలక కశ్మీర్ నేతలు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలాంటి వారిని దాదాపు రెండేళ్ళపాటు నిర్బంధించడం ద్వారా కశ్మీర్‌లో వేర్పాటువాదులు రెచ్చిపోకుండా చర్యలు తీసుకున్నారు. సరిహద్దుకు ఆవల నుంచి కశ్మీరీలను రెచ్చగొట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అందుకోసం నెలల తరబడి ఇంటర్ నెట్ కట్ చేశారు. టీవీలలో పాకిస్తాన్ ఛానళ్ళు రాకుండా చేశారు. దాంతో ఊహించిన దానికంటే తక్కువ కాలంలో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడం ప్రారంభమైంది. అదేసమయంలో కరోనా రెండు విడతలుగా దేశంలో విజృంభించడం కూడా కలిసి వచ్చింది. ప్రస్తుతం కశ్మీర్‌లోని పర్యాటక ప్రదేశాలు మరీ ముఖ్యంగా దాల్ లేక్ వంటి సుందర ప్రదేశాలు పర్యాటకులతో రద్దీగా మారడంతో కశ్మీరీలకు ఆదాయ మార్గాలు గణనీయంగా పెరిగాయి. ఆర్టికల్ 370 రద్దుతో పాటు ట్రిపుల్ తలాఖ్ అంశంలో కూడా బీజేపీ తన ఎజెండాను అమలు చేసింది. తద్వారా ముస్లిం మహిళల్లో సానుకూల వాతావరణాన్ని సాధించగలిగింది. తాజాగా దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావడానికి కూడా మోదీ సర్కార్ చర్యలు ప్రారంభించినా.. దానికి సంబంధించిన చర్యలు చాపకింద నీరులా సాగుతున్నాయి. ఇదంతా కొనసాగుతుండగానే బీజేపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి సారించింది.

ఎలెక్షన్ ఇయర్ 2023

2024 కంటే ముందు 2023 సంవత్సరం కూడా రాజకీయ పక్షాలకు అత్యంత కీలకమైనదిగా కనిపిస్తోంది. 2023లో దేశంలోని తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి రెండు నెలల్లోనే మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు ఎన్నికలు ముగిసాయి. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలలో బీజేపీ ఘనవిజయం సాధించింది. మేఘాలయలోను కాంగ్రెస్ పార్టీని నిరోధించగలిగింది. మరో వారం, రెండు వారాల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశాలున్నాయి. ఆ తర్వాత వరుస క్రమంలో మిజోరం, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. వీటిలో మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17వ తేదీన ముగియనున్నది. అంటే నవంబర్ నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. చత్తీస్‌గఢ్ అసెంబ్లీ గడువు జనవరి 3వ తేదీన (2024) ముగియనున్నది. ఆ తర్వాత జనవరి 6తో మధ్యప్రదేశ్, జనవరి 14తో రాజస్థాన్, జనవరి 16తో తెలంగాణ అసెంబ్లీల గడువు ముగుస్తుంది. ఆయా ముగింపు తేదీలకు అనుగుణంగానే కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్, కౌంటింగ్ తేదీలను ఖరారు చేస్తుందన్నది సుస్పష్టం. వాటిలో వీటిలో మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో వుండగా.. మిగిలిన రాష్ట్రాలలో బీజేపీ ప్రత్యర్థి పార్టీలు అధికారంలో వున్నాయి. ఈక్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలను ఆధారం చేసుకుని 2023లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక శ్రద్ద సారించింది. అయితే తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాలలో బీజేపీ ఇప్పటికే గరిష్ట సంఖ్యలో ఎంపీ సీట్లను కలిగి వుంది. ఆ నెంబర్‌ని వచ్చే ఎన్నికల్లో రిటైన్ చేసుకోవడమే ఇపుడు కమలనాథుల వ్యూహం. అయితే తెలంగాణ వంటి రాష్ట్రాలలో బీజేపీ నెంబర్ ఇంకా స్వల్ప స్థాయికే పరిమితమైంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటును దక్కించుకున్న బీజేపీ, 2019 సాధారణ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లను కైవసం చేసుకుని తెలంగాణలో అధికార పార్టీకి షాకిచ్చింది. సీఎం కూతురు, సిట్టింగ్ ఎంపీ అయిన కల్వకుంట్ల కవితను ఓడించింది బీజేపీ. ఆ తర్వాత రకరకాల పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఇపుడు పరిస్థితి ఉప్పూనిప్పూ అన్న చందంగా వుంది.

అవరోధాలే అధికం

దక్షిణ భారతంలో మొత్తం 129 లోక్‌సభ స్థానాలున్నాయి. వాటిలో కేవలం 29 సీట్లు మాత్రమే బీజేపీ ఖాతాలో వున్నాయి. వీటిలో హెచ్చుస్థానాలు కర్నాటకలోనే వున్నాయి. దాంతో ఉన్నవాటిని కాపాడుకోవడంతోపాటు మిగిలిన 100 సీట్లలో కనీసం 50 సీట్లు కైవసం చేసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే బీజేపీ దక్షిణాది యాత్రకు కొన్ని అవరోధాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీపై వున్న హిందీ ముద్ర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలలోకి పాకకుండా నిరోధిస్తోంది. తెలంగాణలో బీజేపీకి అవకాశాలు కనిపిస్తున్నా.. దక్షిణ ప్రాంత జిల్లాల్లో మరీ ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బీజేపీ చాలా వీక్‌గా కనిపిస్తోంది. బీజేపీ హిందుత్వ ఐడియాలజీ కూడా బీజేపీకి తమిళనాడు, ఏపీ, కేరళ రాష్ట్రాల ఎంట్రీకి అడ్డంకిగా కనిపిస్తోంది. సంఘ్ పరివార్ సంస్థలు ద్రవిడియన్ సంప్రదాయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోలేదు అన్న అభిప్రాయాలు, విశ్లేషణలు కూడా తరచూ కనిపిస్తుంటాయి. ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో హిందీ కంటే ఇంగ్లిషునే తమకు అనుకూల భాషగా భావిస్తుంటారు. హిందీని తమపై బలవంతంగా రుద్దే యత్నాలు జరుగుతున్నాయని ఈ రాష్ట్రాల్లో చాలా మంది భావిస్తుంటారు. హిందీ వ్యతిరేక భావం కేరళ, ఏపీలతో పోలిస్తే తమిళనాడులో చాలా ఎక్కువగా వుంది. హిందీ అనుకూల పార్టీగా ముద్ర వున్న బీజేపీకి ఇదే అంశం తమిళనాడులో ఎంపీ సీట్ల సంఖ్యను పెంచుకోవడంలో ప్రధాన అవరోధంగా కనిపిస్తోంది. 2023 ఏప్రిల్ నెలలో జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ దక్షిణాది దండయాత్ర ప్రభావం ఎలా వుంటుందో కొద్ది మేరకు తేల్చబోతున్నాయి. అయితే, కర్నాటక రాష్ట్రంలో గత సంవత్సరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక గాలులు వీచే అవకాశాలను సూచిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ అనైతిక రాజకీయాలకు పాల్పడిందన్న అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాతిపదిక అయితే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగానే వచ్చే అవకాశాలుంటాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలే పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపాలని లేదు. దానికితోడు దేశానికి బలమైన నాయకుడు అధినేతగా వుండాలన్ని అభిప్రాయం దేశవ్యాప్తంగా బలపడుతోంది. ఇది కర్నాటక అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలు వేరువేరుగా రావడానికి కారణమయ్యే అవకాశాలున్నాయి. ఇక తమిళనాడు విషయంలో హిందీ భాష వ్యతిరేకత, హిందీ జాతియతా భావం, బలహీనమైన మిత్రపక్షం అన్నా డిఎంకే వంటి అంశాలు బీజేపీకి ప్రతికూలంగా వున్నాయి. కేరళలోను దాదాపు ఇవే అంశాలు బీజేపీకి ప్రతికూలంగా వున్నాయి. అయితే, అక్కడ 45 శాతం వున్న మైనారిటీల మనసులు గెలుచుకునేందుకు బీజేపీ యధాశక్తి ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో సక్సెస్సయితే అక్కడ రెండో, మూడో సీట్లు బీజేపీకి దక్కవచ్చు. కర్నాటకలోని 28 ఎంపీ సీట్లలో సగం గెలుచుకున్నా.. ఏపీలోని 25, తెలంగాణలోని 17, తమిళనాడులోని 39, కేరళలోని 20 ఎంపీ సీట్లు కలిపితే 91 పార్లమెంటు సీట్లలో బీజేపీ ఏ మేరకు అవకాశాలున్నాయన్నదే ఇపుడు కీలకం. తెలంగాణలోని నాలుగు సీట్లను ఎంతో కొంత పెంచుకునే అవకాశం వున్నా ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఒకట్రెండు సీట్లు గెలుచుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ దక్షిణాది యాత్ర ఏమేరకు సఫలమవుతుందన్నది ఆసక్తి రేపుతోంది.