ప్రజా బలం ఉన్నా.. లేకున్నా.. అధిష్టానం అండదండలుంటే చాలు.. కోరుకున్న పదవిలో ఎన్నేళ్లయినా కొనసాగవచ్చు. దేశ రాజకీయాల్లో ఇది కొత్తేమీ కాదు. గల్లీ నేతగా గెలుపొందలేనివాళ్లు ఢిల్లీలో దశాబ్దాల తరబడి రాజకీయం చేయడం చూశాం. ఇకపై ఆ పరిస్థితి ఉండదని కాషాయదళం తేల్చిచెబుతోంది. పెద్దల సభగా పేరొందిన రాజ్యసభ సభ్యులు ప్రజాక్షేత్రంలో తమ సత్తా చాటాల్సిందేనని కమలదళ అగ్రనాయకత్వం చెబుతోంది. పార్టీ కోసం చేసిన సేవలకు, పార్టీ అవసరాల మేరకు కొందరిని నేరుగా రాజ్యసభకు ఎన్నుకున్నప్పటికీ.. తదుపరి కొనసాగాలంటే మాత్రం జనబలం సంపాదించుకోవాల్సిందేనని, అందుకోసం ఎన్నికల రణక్షేత్రంలో తలపడాల్సిందేనని అల్టిమేటం ఇచ్చింది. అందుకేనేమో.. హస్తిన వీధులకు పరిమితమయ్యే రాజ్యసభ సభ్యులు తమకు అనుకూలంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలను ఎంచుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు.
బీజేపీ రాజ్యసభ సభ్యులు 2024 లోక్‌సభ ఎన్నికల బరిలో దిగక తప్పని పరిస్థితి నెలకొంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ పర్యాయాలు రాజ్యసభ పదవులు పొందినవారిని మరోసారి కొనసాగించే అవకాశం లేదని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పడమే ఇందుక్కారణం. పలువురు కేంద్ర మంత్రులు తదుపరి రాజకీయాల్లో కొనసాగాలంటే లోక్‌సభ బరిలో దిగి గెలుపొందాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ క్రమంలో తమ తమ సొంత రాష్ట్రాల్లో గెలుపొందడానికి అవకాశం ఉన్న లోక్‌సభ సీట్లపై కేంద్ర మంత్రులు కర్చీఫ్ వేసుకుంటున్నారు. కేవలం సీటు ఆశించినంత మాత్రాన అధిష్టానం వారికే సీటు కట్టబెడుతుందన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దేశంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో రహస్య సర్వే నిర్వహించి అభ్యర్థుల బలాబలాలపై అధ్యయనం చేస్తోంది. ఈ తరహా సర్వేల్లో తమ పేరు ఉండేలా కేంద్ర మంత్రులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, మన్సుఖ్ మాండవియా, పురుషోత్తం రూపాలా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ తదితరులు రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారు. పార్టీ తాజా సంకేతాలు పసిగట్టిన వీరంతా తమ భవిష్యత్తు ఎన్నికల వ్యూహానికి సంబంధించిన బ్లూప్రింట్‌ను సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు. వీరితో పాటు హర్దీప్ సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింధియా కూడా 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
రెండు పర్యాయాలకు మించి రాజ్యసభ పదవి ఇవ్వకూడదన్న నిబంధనతో మంత్రివర్గానికి దూరమైన పరిస్థితి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి విషయంలో నిరూపితమైంది. ఎన్డీయే-2 మంత్రివర్గంలో కొనసాగుతున్న సమయంలోనే ఆయన రాజ్యసభ పదవీకాలం ముగిసింది. పార్టీ నఖ్వీని అప్పటికే రెండుసార్లు రాజ్యసభకు పంపడంతో మూడోసారి పంపడానికి వీల్లేకుండా పోయింది. దాంతో ఆయన తన మంత్రిపదవినే వదులుకోవాల్సి వచ్చింది. ఈ తరహా పరిస్థితి తమకు ఎదురుకావొద్దని రాజ్యసభ నుంచి కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న మంత్రులు భావిస్తున్నారు. అందుకే 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమకు అనువైన చోట నుంచి పోటీ చేసి గెలుపొందాలని చూస్తున్నారు.
ధర్మేంద్ర ప్రధాన్‌ను 2012లో తొలిసారిగా, 2018లో రెండోసారి పార్టీ రాజ్యసభకు పంపింది. అతని రెండవ పదవీకాలం 2024 మార్చితో ముగుస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రధాన్ 2024లో తన సొంత రాష్ట్రం ఒడిశాలోని డెంకనల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల ప్రధాన్ స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికను బహిరంగంగా వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ సహా ఆయన అనుచరగణం, సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా నిరంతరం డెంకనల్‌లో తిరుగుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు.
మోడీ ప్రభుత్వంలోని మరో దిగ్గజ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను బీజేపీ ఇప్పటికే రెండుసార్లు రాజ్యసభకు పంపింది. భూపేంద్ర యాదవ్ 2018 ఏప్రిల్‌లో రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అతని పదవీకాలం కూడా 2024 మార్చితో ముగుస్తుంది. ఈ పరిస్థితుల్లో భూపేంద్ర యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్ లేదా హర్యానాలోని భివానీ-మహేందర్‌గఢ్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. అయితే హర్యానాలోని మహేంద్రగఢ్‌లో ఆయన ఎక్కువ క్రీయాశీలంగా పనిచేస్తున్నారు. అందుకే ఆయన పర్యటనలు, కార్యక్రమాలు అక్కడి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.
కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా మూడోసారి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. రాజ్యసభలో రూపాలా మూడో పర్యాయం పదవీకాలం కూడా 2024 మార్చితో ముగియనుంది. దీంతో గుజరాత్‌లో అనుభవజ్ఞుడైన నాయకుడిగా పేరొందిన రూపాలా లోక్‌సభ ద్వారా పార్లమెంటులో ప్రవేశించాలనుకుంటే, తన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అమ్రేలి లేదా రాజ్‌కోట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా తనకు సురక్షితమైన మరియు బలమైన లోక్‌సభ సీటు కోసం చూస్తున్నారు. రాజ్యసభలో మాండవ్య రెండో పర్యాయం పదవీకాలం 2024 మార్చితో ముగియనుంది. ఆయన గుజరాత్‌లోని భావ్‌నగర్ లోక్‌సభ స్థానంపై కన్నేసినట్టు తెలుస్తోంది. అయితే, గుజరాత్ రాజకీయ సమీకరణాలు, ప్రధాని మోడీ హవాతో సూరత్ లేదా పోర్‌బందర్ లోక్‌సభ స్థానాలు కూడా తనకు సురక్షితమైనవేనని ఆయన భావిస్తున్నారు.
కేంద్ర మంత్రి పీయూష్ ఇప్పటికే మూడో పర్యాయం రాజ్యసభలో కొనసాగుతున్నారు. 2010లో తొలిసారిగా, 2016లో రెండోసారి, 2022లో మూడోసారి గోయల్‌ను బీజేపీ రాజ్యసభకు పంపింది. ఆయన ప్రస్తుత రాజ్యసభ పదవీకాలం 2028 జులైతో ముగుస్తుంది. అయినప్పటికీ పీయూష్ గోయల్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పీయూష్ గోయల్ సొంత రాష్ట్రం మహారాష్ట్రతో పాటు ఉత్తరప్రదేశ్‌లో సురక్షితమైన సీటు కోసం చూస్తున్నట్టు తెలిసింది.
పీయూష్ గోయల్ మాదిరిగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా పార్టీ మూడుసార్లు రాజ్యసభకు పంపింది. నిర్మలా సీతారామన్ 2014లో తొలిసారి, 2016లో రెండోసారి, 2022లో మూడోసారి రాజ్యసభ సభ్యురాలిగా రాజ్యసభలో కొనసాగుతున్నారు. 2014లో మధ్యంతరంగా ఆమెను తీసుకోవడంతో రెండేళ్లు మాత్రమే పదవిలో ఉన్నారు. నిర్మలా సీతారామన్ ప్రస్తుత పదవీకాలం 2028 జూన్‌లో ముగుస్తోంది. పార్టీ హైకమాండ్ సూచనలు, తమిళనాడులో పార్టీ విస్తరణ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని, సీతారామన్ తన సొంత రాష్ట్రం తమిళనాడులోనే సురక్షితమైన సీటును వెతికే పనిలో ఉన్నారని తెలిసింది. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కూడా ఆమె కార్యక్రమాలను పెరిగాయి. కొద్ది నెలల క్రితం, చెన్నైలోని స్థానిక మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేస్తూ స్థానిక ప్రజలతో మమేకమవుతూ కనిపించారు.
మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా కూడా 2024 లోక్‌సభ ఎన్నికలలో తన సాంప్రదాయ సీటు గుణ నుండి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ నుంచి 2020 జూన్‌లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2026 నవంబర్‌లో కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి రాజ్యసభ రెండవ పర్యాయం పదవీకాలం ముగియనుంది. ఈ పరిస్థితుల్లో 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చునని తెలుస్తోంది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమృత్‌సర్ నుంచి పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. ఈసారి క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకుంటూ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..