Low Cost Home: తెలంగాణా రైతు బిడ్డ మానస విజయం.. తక్కువ ఖర్చుతో పేదల కోసం గూడు.. కష్టాల కన్నీరు నుంచి కలల ఓ పాడ్ రూపకల్పన!
ఆ అమ్మాయి పేరు మానస. వయసు 23 ఏళ్ళు. సివిల్ ఇంజనీర్. ఈమె సాధించిన ఘనత ఏమిటో తెలుసా? 2000 మిల్లీమీటర్ల వ్యాసంతో ఉన్న సిమెంట్ పైపులో 120 చదరపు అడుగుల ఇల్లు తాయారు చేసింది.
కలలు కనడం.. వాటిని నెరవేర్చుకోవడం.. అంత సులభం కాదు. అందులోనూ పేదరికంలో పుట్టినవారికి. పైగా అమ్మాయిలకు. ఎంతో తపన. తమ స్వప్నాల లక్ష్యంపై సరైన అవగాహన.. పట్టుదల.. అన్నిటినీ మించి నిరంతర శ్రమ ఉంటేనే అది సాధ్యం. మన సమాజంలో సాధారణంగా ఉండే మహిళల పట్ల చిన్న చూపును ఎదుర్కుంటూ.. పేదరికంపై ఒక పక్క పోరాటం చేస్తూనే.. తన కుమార్తెలను ఒక స్థాయికి చేర్చడానికి పరితపించిన ఓ తల్లి.. మూడేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయి.. అమ్మ పడుతున్న కష్టాన్ని పారదోలాలంటే తాను ఎదో ఒకటి సాధించాలని ఓ చిన్నారి తీసుకున్న సంకల్పం ఇప్పుడు ఒక అద్భుత ఆవిష్కరణకు తెరతీశాయి.
మానస..ఒక స్వప్నం..
ఆ అమ్మాయి పేరు మానస. వయసు 23 ఏళ్ళు. సివిల్ ఇంజనీర్. ఊరు కరీంనగర్ జిల్లా బొమ్మక్కల్ గ్రామం. ఇంతకీ ఈమె సాధించిన ఘనత ఏమిటో తెలుసా? 2000 మిల్లీమీటర్ల వ్యాసంతో ఉన్న సిమెంట్ పైపులో 120 చదరపు అడుగుల ఇల్లు తాయారు చేసింది. ఈ ఇంట్లో ఒక బెడ్ రూమ్, కిచెన్, హాలు, వాష్ రూమ్, చిన్న బాల్కానీ కూడా ఉన్నాయి. ఈ ఇంటికి ఆమె ‘ఓ పాడ్’ అని పేరు పెట్టుకుంది.
ఓ-పాడ్ రూపుదిద్దుకుంది ఇలా..
మానస లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుంచి మే 2020 లో సివిల్ ఇంజనీరింగ్ లో బీ టెక్ పూర్తి చేసింది. తరువాత ఆరునెలల పాటు తన కలల సాకారం కోసం పరిశోధనలు సాగించింది. ఇంతకీ ఆమె కల ఏమిటో తెలుసా.. తక్కువ ఖర్చుతో ఇంటిని నిర్మించడం. ఇందుకోసం ఆమె జపాన్, హాంకాంగ్ వంటి ఇతర దేశాల్లో ఉన్న ఇళ్ల నమూనాలను పరిశీలించింది. వాటినుంచి మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా డిజైన్ సిద్ధం చేసుకుంది. తరువాత ఆమె జనవరి 2021లో తన కంపెనీని రిజిస్టర్ చేసుకుంది. మార్చి 2021 న తాను తయారు చేసుకున్న డిజైన్ ప్రకారం ఇంటి నిర్మాణం మొదలు పెట్టింది.
ఇందుకోసం ఆమె 12 రకాల డిజైన్లను సిద్ధం చేసుకుంది. అవి అన్నీ కూడా వేర్వేరు సెక్టార్లకు సంబంధించినవి. ఇప్పుడు ఆమె ఒక డిజైన్ ప్రకారం తన ఇంటి నిర్మాణం పూర్తి చేసింది. అదే ఓ పాడ్! ఇందులో ఒక బెడ్ రూమ్, కిచెన్, హాల్, వాష్రూమ్, షెల్ఫ్ లు ఉన్నాయి. అంతేకాదు ఈ ఇంటికి కరెంట్, నీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది మానస. అంతేనా.. ఈ ఇంతికి బాల్కానీ లాంటి లాంజ్ ప్రదేశం కూడా ఉంది.
ఈ ఇంటి గురించి మానస ఇలా చెప్పింది.” ఓ-పాడ్ భారతదేశంలోనే మొట్టమొదటి ఇటువంటి మోడల్ ఇల్లు. 40 నుంచి 120 చదరపు అడుగుల్లో ఈ ఇంటిని తయారు చేసుకోవచ్చు. ఇది మనకు కావలసిన విధంగా చేసుకోవచ్చు.. దీనిని ఎక్కడికి కావాలంటే అక్కడికి మార్చుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడానికి 3.5 లక్షల నుంచి 5.5 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. ఇందులో మూడు బెడ్ రూమ్ లతో కూడా ఇల్లు నిర్మించుకోవచ్చు.” అని చెప్పింది.
”నేను నగరాల్లోని పేదప్రజలు సరైన ఇల్లు లేక ఎన్నో అవస్థలు పడటం నేను చూశాను. ముఖ్యంగా మురికివాడల్లో వర్షం వచ్చిన సమయంలో ప్రజలు తమ నివాసాలు నీటిలో మునిగిపోయి ఇబ్బందులు పడటం చాలా బాధ కలిగించింది. అందుకే అటువంటి వారి అవసరాలను తీర్చే ఇంటిని తక్కువ ఖర్చుతో చేయాలని భావించాను. ఓ పాడ్ ద్వారా ఇటువంటి కష్టాల నుంచి బయట పడవచ్చు.” అంటోంది మానస.
తెలంగాణా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీ, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మానసను పొగడ్తలతో ముంచెత్తారు.
” మానస చాలా చురుకైన విద్యార్థిని. ఆమె ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి పెద్ద చదువులు చదవాలని పరితపించింది. ఇటువంటి విద్యార్థినులు చాలా అరుదుగా ఉంటారు. నాకు ఆమె స్వప్నం గురించి తెలుసు. ఇప్పుడు ఇది ఆమె ఆలోచనల కార్యాచరణకు మొదటి అడుగు మాత్రమే.” అని చెప్పారు.
Hats off to Manasa, swaero of Madikonda SW School and @lpuuniversity who established a startup and designed o-pod, an affordable housing solution for families living below poverty line in urban areas. @anushabharadwaj @Swaeroes4u #swaero pic.twitter.com/g5DbJ0MHax
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) April 7, 2021
మానస గురించి కొన్ని విశేషాలు..
- మానస మూడో తరగతిలో ఉండగా తండ్రిని కోల్పోయింది. తల్లి ఆమెను, ఆమీ చెల్లిని ఎంతో కష్టపడి పెంచింది.
- ఆమె చిన్నతనంలో కానీ, చదువుకునే సమయంలో కానీ ఎటువంటి సహాయమూ సమాజం నుంచి వారికీ దొరకలేదు.
- మానస ‘వాయిస్ ఆఫ్ గర్ల్స్’ మొదటి బ్యాచ్ విద్యార్థిని. అదేవిధంగా ‘సఖి’ కార్యక్రమం కింద ఆమె శిక్షణ పొందింది.
- మానస బెంగళూరు లో నిర్వహించిన యూనిసెఫ్ (UNICEF) సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ సమావేశంలో తెలంగాణా తరఫున పాల్గొంది.
- మానస చెల్లి చైతన్య మహిళల ఆర్మ్ ఫోర్సెస్ పేపరేటరీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కెహెదువుతోంది.
- ఎవరి సహకారం లేకున్నా తన కుమార్తె మానస సాధించిన విజయం పై ఆమె తల్లి రమాదేవి ఎంతో సంతోషిస్తున్నారు.
ఇన్ని చెప్పాం కానీ, ఇంతకీ ఈ ఇల్లు ఎక్కడ నిర్మించిందో చెప్పలేదు కదూ.. మానస హైదరాబాద్ లోని చెంగిచెర్ల ప్రాంతంలో ఉన్న తన బంధువుల కోసం ఈ ఇల్లు నిర్మించింది.
Also Read: Narendra Modi: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ తర్వాత ఏమన్నారంటే..?