Barabanki Villagers to escape Covid-19 vaccination: దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారికి అడ్డుకట్టవేయాలంటే.. వ్యాక్సినేషన్, నిబంధనలు పాటించడం తప్పనిసరి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే.. ఓ గ్రామస్థులు మాత్రం కరోనా వ్యాక్సిన్ వేస్తారనే భయంతో పారిపోయారు. అదికూడా ఆపసోపాలు పడుతూ ఓ నదిని సైతం దాటారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. దేశంలో ఒకవైపు కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం చాలా మంది నిరీక్షిస్తుండగా.. మరోవైపు వ్యాక్సిన్ వేసేందుకు గ్రామానికి వచ్చిన అధికారుల బృందాన్ని చూసి గ్రామస్థులు నదిలోకి దూకి పారిపోవడంపై అందరూ ఆశ్యర్యం వ్యక్తంచేస్తున్నారు.
ఈ సంఘటన యూపీలోని బారాబంకీ గ్రామంలో జరిగింది. బారాబంకీ గ్రామస్థులకు శనివారం టీకాలు వేయడానికి ఆరోగ్యశాఖ అధికారుల బృందం గ్రామానికి చేరుకుంది. దీంతో వారిని గమనించిన గ్రామస్థులు కోవిడ్ టీకాలు వద్దంటూ.. గ్రామ ఒడ్డున ఉన్న సరయూ నదిలోకి దూకి ఈత కొడుతూ పారిపోయారని రామ్ నగర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు రాజీవ్ కుమార్ బారాబంకీ గ్రామంలో కోవిడ్ టీకా ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి అపోహాల గురించి గ్రామస్థులకు వివరించారు. అయినప్పటికీ.. గ్రామస్థులంతా నదిలో దూకి పారిపోగా, కేవలం 14 మంది మాత్రమే కొవిడ్ టీకాలు వేయించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే.. ఇది కోవిడ్ వ్యాక్సిన్ కాదని, విషపూరితమైన ఇంజెక్షన్ అంటూ కొంతమంది చెప్పండంతో నదిలోకి దూకి పారిపోయినట్లు గ్రామస్థులు ఆ తర్వాత వెల్లడించారు. కాగా.. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్న తరుణంలో.. బారాబంకీ గ్రామస్థులు తమకు టీకాలు వద్దంటూ పారిపోవడం సంచలనం రేపింది.
Also Read: