Miracle in Aruna Homa: రథసప్తమి వేళ సూర్యనారాయణ స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. దేశవ్యాప్తంగా భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయం అరుణోదయ కిరణాలతో వెలిగిపోయింది. రథసప్తమి పూజల్లో దేవదేవుని విగ్రహంపై సూర్యకిరణాలు నేరుగా వచ్చిపడ్డాయి. దీంతో ఆలయం పరిసరాలు దేదీవ్యమానంగా వెలిగిపోయాయి. కాగా, రథసప్తమి పురస్కరించుకుని సూర్య భగవానుడికి అరుణ హోమం జరుగుతుండగా ఘటన జరిగింది. దీంతో అక్కడి హోమంలో పాల్గొన్న భక్తులతో పాటు స్థానికులు ఆనందోత్సవాలతో తేలిపోయారు.
రథసప్తమి రోజే ఇలాంటి దృశ్యం సాక్ష్యాత్కరించడంతో భక్తులు పులకించిపోయారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రామాలయానికి చేరుకుని సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.