Dragon blood tree: ఈ చెట్టును నరికితే రక్తం చిందిస్తోంది !.. మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు

|

Jun 18, 2021 | 11:28 AM

ఈ అనంత విశ్వం ఎన్నో వింతలు, విచిత్రాలతో నిండి ఉంది. ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ సైంటిస్టులకు సైతం అంతుచిక్కని రహస్యాలెన్నో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలివున్నాయి.

Dragon blood tree: ఈ చెట్టును నరికితే రక్తం చిందిస్తోంది !.. మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు
Dragon Blood Tree
Follow us on

ఈ అనంత విశ్వం ఎన్నో వింతలు, విచిత్రాలతో నిండి ఉంది. ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ సైంటిస్టులకు సైతం అంతుచిక్కని రహస్యాలెన్నో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలివున్నాయి. మరీ ముఖ్యంగా భూమిపై మనకు తెలియని ఎన్నో నిగూఢ ప్రదేశాలు, జీవరాశులు ఉన్నాయి. భూమికి అధిపతి అని భావిస్తున్న మానవునికే కూడా తెలియని ఎన్నో వింతలు ఈ ప్రకృతి ఒడిలో ఇమిడి ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు మానవుని ఊహకు కూడా అందని అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. యెమన్‌లోని సాకోత్రా ద్వీప సమూహంలో కనిపించే `డ్రాగన్ బ్లడ్ ట్రీ` కూడా అటువంటిదే.. ఈ చెట్టు గురించి తెలిస్తే ప్రతిఒక్కరూ కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. సహజంగా ఈ చెట్లు చూడ్డానికి గొడుగు ఆకారంలో ఉంటాయి. ఇవి 33 నుంచి 39 అడుగుల పొడవు పెరగడంతో పాటు.. 650 సంవత్సరాల వరకు జీవించగలవు. ఈ చెట్లు వేడి, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. ఆ చెట్లకు పైభాగంలో ఆకులు, కొమ్మలు చాలా దట్టంగా ఉంటాయి. అన్నింటికంటే ప్రత్యేకమైన విషయమేంటంటే ఈ చెట్లను నరికితే అచ్చం రక్తంలా ఉండే ద్రవం బయటకు వస్తుంది. దాని బెరడు నుంచి వచ్చే ఎర్ర రంగు రెసిన్లు చూసేందుకు అచ్చం ర‌క్తంలాగే ఉంటుంది. దీనిని అక్కడి స్థానిక ప్రజలు డ్రాగన్ జంతువు రక్తం అని భావిస్తుంటారు..అందుకే ఈ చెట్టుకు డ్రాగన్‌ బ్లడ్‌ ట్రీ అని పేరు వచ్చింది. వారు ఆ ద్రవాన్ని ఔషధంగా కూడా ఉపయోగించుకుంటారు. అంతేకాకుండా ఈ చెట్ల ద్రవం జ్వరం, అల్సర్, నొప్పులు వంటి వాటిని తగ్గించడంతో పాటు లైంగిక శక్తిని పెంచుతుందని స్థానికులు చెబుతున్నారు

సుమారు యాభైవేల మంది ప్రజలు నివసిస్తున్న సాకోత్రా ద్వీప సమూహంలో..ఈ చెట్ల కారణంగానే ఎటువంటి నీటి కొరత లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ చెట్లు ఉన్న ప్రాంతాన్ని 2008లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్యం గల, విభిన్నమైన ప్రాంతంగా కూడా గుర్తించింది. అయితే ఎన్నో వందల సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్న ఈ చెట్లు ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఇటీవల తీవ్ర తుఫానుల కారణంగా సాకోత్రా ద్వీపంలో ఉన్న డ్రాగన్ బ్లడ్ ట్రీ ఫారెస్ట్ నాశనమవుతోంది. అలాగే వాటి విత్తనాలను, చిన్న చిన్న మొక్కలను మేకలు, ఇతర జంతువులు ఎప్పటికప్పుడు తినేస్తున్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకలైన ఈ చెట్లు అంతరించడం త్వరలో తలెత్తబోయే పర్యావరణ సంక్షోభానికి హెచ్చరిక అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చెట్లు పునరుత్పత్తి చేయడానికి దాదాపు అర్ధ శతాబ్దం పడుతుందని.. ఇలాంటి సమయంలో ఈ చెట్లను రక్షించుకోలేకపోతే ఈ జాతి మొత్తం త్వరలోనే అంతరించిపోతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: పోలీస్ కుటుంబాల‌నూ వ‌ద‌ల‌ని సైబ‌ర్ కంత్రీగాళ్లు.. తాజాగా సీఐ భార్య‌ను ఎలా మాయ చేశారంటే

అభిమానికి చిరు ఫోన్.. త‌న మ‌న‌సుకు ఎంతో ఆనందంగా ఉంద‌న్న మెగాస్టార్