Elephant herd : చిత్తూరు జిల్లా పలమనేరులో 15 ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. ఈ ఉదయం పలమనేరు టౌన్ దగ్గరున్న రాధా బంగ్లా యందు సుమారు 15 ఏనుగులు ఇళ్ల మధ్యలో నుంచి రోడ్డు దాటాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానిక ప్రజలు సంభ్రమాశ్చర్యాలు, భయాందోళనకు గురయ్యారు. ఈ ఏనుగులు ఒక్కక్కసారి టౌన్ లోకి వస్తున్నాయని.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సి వస్తోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, రాత్రి వేళ పలమనేరు పట్టణంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు రాత్రంతా కురప్పపల్లి, రామాపురం ప్రాంతంలోని పంట పొల్లాలోకి దిగాయి. పలమనేరు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని రాధా బంగ్లా, మిషన్ స్కూల్ కాంపౌండ్ ప్రాంతంలో బీభత్సం సృష్టించాయి.
పెద్ద సంఖ్యలో ఏనుగులు ప్రవేశించడంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఏనుగుల గుంపు నుంచి తమను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.