Snake Drink Milk : మన దేశంలో అనేక శతాబ్దాలుగా వివిధ సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఈ సంప్రదాయాలలో ప్రజలు పాములకు పాలు తాగించే సంప్రదాయం కూడా ఉంది. అయితే నిజంగానే పాములు పాలు తాగుతాయా.. ఇది తప్పు అని చాలా కొద్ది మందికి తెలుసు. చాలామంది పాముకు పాలు పోయడం ధర్మంగా భావిస్తారు కానీ ఇది సరైన పద్దతి కాదు. పాలు తాగడం వల్ల పాములు చనిపోతాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దాని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం.
పాములు మాంసాహారులు..
పాములు మాంసాహార జీవులు. అవి ఆహారంగా కప్పలు, ఎలుకలు, పక్షులు, బల్లులు, ఇతర చిన్న పాములు మొదలైనవి తింటాయి. పాములు పాలు తాగడం పూర్తిగా తప్పు. ఇది తప్పుడు సంప్రదాయం. నిజం ఏమిటంటే పాములు పాలు తాగవు. తాగడానికి ఇష్టపడవు కూడా. వాస్తవానికి ఈ తప్పుడు సంప్రదాయం వెనుక పాములు పట్టేవాళ్ల హస్తం కూడా ఉంది. వారి కుటుంబం బతకడానికి పాములపై ఆధారపడుతారు. వీరు ఒక స్థలం నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతూ పాములు ఆడిస్తూ డబ్బు, ధాన్యాలు పొందుతారు. మీడియా నివేదికల ప్రకారం.. నాగ పంచమికి ముందు పాములు పట్టేవారు అడవి నుంచి పాములను పట్టుకొని కోరలు తొలగిస్తారు. దీంతో పాము కాటు వేసినా మనిషికి ఏం కాదు.
పాలు తాగడం వల్ల పాములు చనిపోవచ్చు..
దంతాలు విరగడం వల్ల పాము నోటికి గాయం అవుతుంది. ఇది మాత్రమే కాదు పాములు పట్టేవాళ్లు అడవుల నుంచి తెచ్చిన పాములను చాలా రోజులు ఆకలితో, దాహంతో ఉంచుతారు. తద్వారా నాగ పంచమి రోజున అవి ఏదైనా తింటాయి తాగుతాయి. చాలా రోజులు ఆకలితో ఉండటం వల్ల పాలు కూడా తాగుతాయి. దీంతో వాటి నోటికి గాయమవుతుంది. అంతేకాదు పాలు తాగడం వల్ల పాము ఊపిరితిత్తులు, పేగులు దెబ్బతింటాయి. తరువాత కొన్ని రోజుల తరువాత అవి చనిపోతాయి. అందుకే పాముకు ఎప్పుడూ పాలు ఇవ్వకూడదు.