
తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిమాణాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. అధికారం కోసం అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. అయితే గతంలో సీఎం కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన వైఎస్ షర్మిల ఇటీవల సైలంట్‌గా ఉంటున్నారు. అయితే ఆమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. షర్మిల ఇటీవలే కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ వ్యవహారం అంతా కూడా డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ చూసుకుంటున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధిన వ్యవహారాన్ని ప్రియాకం గాంధీ తరపున ఆయన చూసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం పార్టీలని, చేరికలు, వీలినాలపై కూడా ఆయన దృష్టి పెట్టారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు షర్మిలతో ఆయన చర్చలు జరిపారు. అయితే ఇప్పుడు తాజాగా ఆమె బెంగళూరుకి వెళ్లినట్లు సమాచారం. మరోసారి డీకే శివకుమార్‌తో చర్చల అనంతంరం ఆమె ఢిల్లీకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రెండు, మూడు రోజుల్లో షర్మిల పార్టీ విలీనంపై స్పష్టత
మరో విషయం ఏంటంటే డీకే శివకుమార్‌తో సహా షర్మిల ఢిల్లీకి వెళ్లి అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకునే అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇతర విషయాల్లో బిజీగా ఉండటం వల్ల షర్మిల పార్టీ విలీనంపై ఇంకా చర్చలు మొదలుకాలేవు. మరోవైపు షర్మిల పార్టీ విలీనంపై కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఆమెను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిమితం చేయాలని తెలంగాణలో వద్దని చెబుతున్నారు. అయితే ఈ అంశంపై డీకే శివకుమార్ తెలంగాణ నేతలతో చర్చింది ఓ స్పష్టతకి వచ్చినట్లు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ నేతలకున్న అభిప్రాయాన్ని, అలాగే షర్మిల విజ్ఞప్తులను హైకమాండ్ ముందు పెట్టి ఓ నిర్ణయం తీసుకోవాలని కోరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా షర్మిల సామాజిక మాధ్యమాల్లో పొగుడుతున్నారు. అలాగే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా పునరద్దరించడంపై ఆమె తన స్పందన తెలియజేశారు. వాస్తవానికి సోమవారం రోజున రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. కానీ షర్మిల ఒక రోజు ఆలస్యంగా రాహుల్ గాంధీని అభినందిస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. దీనికి కూడా ఓ కారణముందని.. పార్టీ విలీనంపై ముందడుగు పడటమేనని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా షర్మిలను తెలంగాణ రాజకీయాలకు పరిమితం చేయవద్దని.. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించాలని సలహా ఇస్తున్నారు. కానీ షర్మిల మాత్రం తెలంగాణలోనే రాజకీయాలు చేయాలని ఆశపడుతున్నారు. షర్మిల వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పాలేరు టిక్కెట్ అడుగుతున్నారు. ఇలా వీటన్నంటిపై ఒక అభిప్రాయం వస్తే విలీనం ప్రకటనకు సంబంధించి.. ఈ వారంలో తెలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.