
లైంగిక వేధింపుల బారిన పడి చాలా మంది యువత చిక్కుకుపోతున్నారు. సోషల్ మీడియాలో నకిలీ ఆకర్షణీయమైన ప్రొఫైల్‌ను సృష్టించడం ద్వారా పరిచయం పెంచుకుంటున్నారు. తర్వాత ఫేక్ ప్రొఫైల్‌లతో చాట్ చేసి పరిచయాన్ని పెంచుకుంటారు. ఆపై వారి నగ్న చిత్రాలు, వీడియోలు సేకరిస్తారు. వాటిని సోషల్ మీడియలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడతారు. వీడియో కాల్ చేయడం ద్వారా వారిని నగ్నంగా ఉండమని అడుగుతారు. అలా చేస్తున్న సమయంలో వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించి డబ్బులు దండుకుంటారు. ఇలాంటి వారి వలలో పడి చాలా మంది యువకులు విలవిల్లాడిపోతున్నారు. మహారాష్ట్రోలని పుణెలో ఘోర దుర్ఘటన జరిగింది. ఓ యువకుడిని తన నగ్న చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించడంతో అతను సూసైడ్ చేసుకున్నాడు.
పుణెకు చెందిన శంతను వాడ్కర్ వయసు 19 ఏళ్లు. అతను నగరంలోని ఓ ప్రముఖ కాలేజీలో బీకాం చదువుతున్నాడు. శంతనుకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రీత్ యాదవ్ అనే గుర్తు తెలియని ఐడీతో చాటింగ్ చేసేవాడు. అలా ఇద్దరి మధ్య చాటింగ్ లెవెల్ పెరిగింది. శాంతనును న్యూడ్ ఫొటో పంపించమని అడిగారు. దీంతో వారి మాటలు నమ్మిన శంతను అతడి న్యూడ్ ఫొటోలు పంపించాడు. అతని నుంచి ఫొటోలు సేకరించిన గుర్తు తెలియని వ్యక్తులు.. బెదిరింపులకు పాల్పడ్డారు. ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేస్తామని చెప్పి డబ్బులు ఇవ్వాలని వేధించారు. ఇలా ఫోన్ పే ద్వారా రూ.4,500 ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ డబ్బులు సరిపోలేదని ఇంకా కావాలని వార్నింగ్ ఇచ్చారు. పదే పదే బెదిరింపులు రావడంతో శంతను మనస్తాపానికి గురయ్యాడు. సెప్టెంబర్ 28 న ఇంటి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
పుణెలో లైంగిక వేధింపుల కారణంగా వరుసగా రెండు ఆత్మహత్యలు జరగడం కలకలం రేపుతోంది. వాట్సాప్‌లో గుర్తు తెలియని మహిళను గుర్తించిన తర్వాత ఒక న్యూడ్ వీడియోను రూపొందించారు. దానిని వైరల్ చేయడానికి 22 ఏళ్ల యువకుడిని బెదిరించి వేధింపులకు ప్రారంభించారు. దీంతో విసిగిపోయిన యువకుడు సూసైడ్ చేసుకున్నారు. ఈ సంఘటన సహకార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధంకవాడి ప్రాంతంలో సెప్టెంబర్ 30 న జరిగింది. లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకోగా.. మరోసారి ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఆత్మహత్య చేసుకోవడం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.