నోరు జారిన కాంగ్రెస్ సీనియర్ నేత.. హిందూ అనే పదంపై వివాదస్పద వ్యాఖ్యలు..

కర్ణాటక ప్రదేశ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ ఎమ్మెల్యే సతీష్ లక్ష్మణరావు జార్కిహోళి హిందువులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ రచ్చను రాజేస్తున్నాయి. హిందువు అనే పదం అర్థం తెలుసుకుంటే సిగ్గు పడతారంటూ వివాద స్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో..

నోరు జారిన కాంగ్రెస్ సీనియర్  నేత.. హిందూ అనే పదంపై వివాదస్పద వ్యాఖ్యలు..
Congress Leader Satish Jarkiholi

Updated on: Nov 08, 2022 | 12:10 PM

కర్ణాటక ప్రదేశ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ ఎమ్మెల్యే సతీష్ లక్ష్మణరావు జార్కిహోళి హిందువులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ రచ్చను రాజేస్తున్నాయి. హిందువు అనే పదం అర్థం తెలుసుకుంటే సిగ్గు పడతారంటూ వివాద స్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాజకీయదుమారాన్ని రేపుతోంది. సతీష్ లక్ష్మణరావు జార్కిహోళి.. కర్ణాటక కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిండెంట్ తో పాటు యమకనమర్ది నియోజకవర్గం నుంచి కర్ణాటక శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. తాజాగా బెళగావిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. హిందువు అనే పదానికి భారతదేశానికి ఏ సంబంధం అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హిందూ అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉందని, ఆ పదం పర్షియా నుంచి వచ్చిందన్నారు. భారత్‌లో దానికి ఎటువంటి మూలాలు లేవని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా హిందువు అంటే అర్థం తెలుసుకుంటే సిగ్గుపడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత సతీష్ లక్ష్మణరావు జార్కిహోళి వ్యాఖ్యలపై బీజేపీతో పాటు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని, వారి భావజాలాన్ని బయటపెడుతున్నాయంటున్నారు బీజేపీ నాయకులు. కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు.

కర్ణాటకలో వచ్చే ఏడాది శాసనభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీకి తలనొప్పిని తెచ్చిపెట్టాయి. హిందువులపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని జార్కిహోళి బయటపెట్టారంటూ కర్ణాటక బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు హిందువులను అవమానించేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయంటోంది బీజేపీ.

ఇవి కూడా చదవండి

జార్కిహోళి వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు రణదీప్ సింగ్ సూర్జేవాల స్పందిస్తూ.. ప్రతి మతాన్ని, ప్రజల నమ్మకాలు, విశ్వాసాలను గౌరవించేలా కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని నిర్మించిందన్నారు. జార్కిహోళి వ్యాఖ్యలు దురదృష్టకరమని, హిందుత్వం జీవన విధానమంటూ రణదీప్ సింగ్ సూర్జేవాల ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..