Sonali Phogat Death: బీజేపీ నాయకురాలు, టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగాట్ గుండెపోటుతో మరణించలేదా ? పక్కా ప్లాన్‌తోనే ఆమెను మర్డర్ చేశారా? హత్యే అయితే దానికి కారణం ఏంటి? మరణానికి కొద్ది గంటల ముందు ఏం జరిగింది? చనిపోయే ముందు కూడా ప్రశాంతంగా ఇన్‌స్ట్రాలో వీడియోస్ అప్‌లోడ్ చేసిన సోనాలీకి అంతలోనే ఏమైంది? పథకం ప్రకారమే ఆమెను గోవాకు తీసుకెళ్ళి హతమార్చారంటోన్న సోనాలీ సోదరుడు రింకూ వాదనలో నిజమెంత? ఫోన్ కాల్ డేటా ఏం చెపుతోంది? ఇలా ఫోగాట్ మరణంపై అనుమానాలెన్నో? ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు గోవా పోలీసులు ఫోగాట్ హత్య కేసులో ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రముఖ టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలీ ఫోగాట్ మృతి రోజుకో మలుపు తిరుగుతోంది. తన సహచరులు, మిత్రులతో కలిసి గోవా పర్యటనకు వెళ్ళిన సోనాలీ ఫోగాట్ హఠాత్తుగా మరణించడంతో సర్వత్రా కలకలం చెలరేగింది. తాజాగా పోస్టుమార్టం రిపోర్టు సైతం సోనాలీ ఒంటిపై అనేక చోట్ల గాయాలున్నట్టు తేల్చడం సోనాలీ మరణం వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సోనాలీని ఆమె సన్నిహితులు కొందరు గోవా తీసుకెళ్ళిందే మర్డర్ చేసేందుకంటూ సోనాలీ సోదరుడు రింకూ ఆరోపిస్తుండడం కేసులో సరికొత్త ట్విస్ట్‌గా మారింది.
సోనాలీ ఫోగాట్ ఈనెల 22న గోవా వెళ్ళారు. అయితే ఏదైనా షూట్ కోసం వెళ్ళారా అన్న అనుమానానికి కుటుంబం నుంచి లేదనే సమాధానం వస్తోంది. మరి సోనాలీ హఠాత్తుగా గోవా ట్రిప్ ఎందుకు వెళ్ళినట్లు? అరేంజ్ చేసింది ఎవరు? రెండు రూములు బుక్ చేసుకుంటే ఏయే గదుల్లో ఎవరున్నారు? ఇవన్నీ సమాధానం తేలాల్సిన ప్రశ్నలు. ఇలా సోనాలీ ఫోగాట్ మృతిపై పలు అనుమానాలు కలకలంరేపుతున్నాయి. సోనాలీ ఫోగాట్ గుండెపోటుతో మృతి చెందినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన గోవా పోలీసులు అదే విషయన్ని మొదట ప్రకటించారు. అయితే తమ కూతురి మృతిపై సోనాలీ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో కేసు అనుకోని మలుపుతిరిగింది. సోనాలీ మృతిపై కేసు నమోదయ్యే వరకు పోస్ట్‌మార్టమ్‌కి అంగీకరించలేదు కుటుంబ సభ్యలు. అయితే నిన్నటి వరకు హార్ట్‌ఎటాకే ఆమె మృతికి కారణమన్న వాదనని పోస్టుమార్టం రిపోర్టు తల్లకిందులు చేసింది. అసలింతకీ సోనాలీ మృతికి కారణమేంటి? ఇప్పుడిదే ప్రశ్న సర్వత్రా హల్‌చల్ చేస్తోంది.
అసలింతకీ ఎవరీ సోనాలీ? ఈమె నటి, టిక్ టాక్ స్టార్. అలాగే పొలిటీషియన్ కూడా. సోనాలీ సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె 2020లో వివాదాస్పద రియాలిటీ షో బిగ్‌బాస్ 14లో పాల్గొన్నారు. ఆ తరువాత సోనాలీ పొలిటీషియన్‌గా మారారు. సోనాలీ చేసిన టిక్ టాక్ వీడియోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే సోనాలీ హఠాత్తుగా గోవాలో మృతిచెందడం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాని కుదిపేస్తోంది.
ఈనెల 22న ఫ్రెండ్స్‌తో కలిసి గోవా పర్యటనకు వెళ్ళారు. సోనాలీ అస్వస్తతకు గురికావడంతో ఆమెను మంగళవారం నార్త్ గోవాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె గుండెపోటుతో మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. అయితే టిక్‌టాక్ ఫేమ్ అయిన సోనాలీ రాత్రి 7-8 గంటల మధ్య కూడా పింక్ కలర్ తలపాగా ధరించి ఉన్న తన వీడియోలు, ఫొటోలను ఇన్‌స్ట్రాలో పోస్ట్ చేశారు. దీంతో కేసులో పలుఅనుమానాలు తలెత్తాయి.
అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు గోవా పర్యటనలో సోనాలీతో పాటు ఉన్న సుధీర్ సగ్వాన్, సుఖ్విందర్ వాసీలపై హత్యానేరం కింద కేసులు నమోదు చేశారు. సోనాలీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోనాలీ సోదరుడు రింకూ ధాకా బుధవారం పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. సోనాలీ సహోద్యోగులే ఆమెను పక్కా ప్రణాళిక ప్రకారం హత్యచేసి ఉంటారంటూ కేసు నమోదు చేశారు. సోనాలీ భౌతిక కాయాన్ని ఎయిర్ అంబులెన్స్‌లో నిన్న రాత్రి ఢిల్లీకి తరలించారు. ఈ రోజు హరియాణాలోని ఆమె స్వగ్రామంలో సోనాలీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..