Wheat Prices: ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి ధరలు.. పండగకు ముందే ఆకాశన్నంటుతున్న ధరలు..
దీపావళి పండగ ముందు గోధుమలు ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. గోధుమల ధర పెరుగుదలతో గోధుమ పిండి, మైదా, ఉప్మారవ్వ ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరల నియంత్రణకు భారత ప్రభుత్వం..
దీపావళి పండగ ముందు గోధుమలు ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. గోధుమల ధర పెరుగుదలతో గోధుమ పిండి, మైదా, ఉప్మారవ్వ ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరల నియంత్రణకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ తగ్గాల్సిన గోధుమ ధరలు పెరుగుతున్నాయి. రెండు రెలల్లోనే క్వింటాలు గోధుమ ధర రూ.100 పెరిగింది. అక్టోబర్ 3న ఢిల్లీలో క్వింటాలు గోధుమలకు రూ.2,519 ఉండగా.. సోమవారం నాటికి రూ.2,690 కు చేరింది. ధరల నియంత్రణకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న గోధుమ నిల్వలను మార్కెట్లోకి విడుదల చేస్తామని కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుధాంశు పాండే తెలిపారు. 14 ఏళ్లలో అత్యల్ప కనిష్ఠ స్థాయిలో కేంద్రం వద్ద గోధుమ నిల్వలు ఉన్నాయి. అక్టోబర్ 1నాటికి 227 లక్షల టన్నుల గోధుమ నిల్వలు కేంద్ర వద్ద ఉన్నట్లు రికార్డుల్లో వివరాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ నిల్వలు 51 శాతం తక్కువ. 2008 నుంచి అత్యల్ప నిల్వ కావడం గమనార్హం.
సెంట్రల్ పూల్ రూల్స్ ప్రకారం వ్యూహాత్మక అవసరాలకోసం కేంద్ర ప్రభుత్వం వద్ద 205 లక్షల టన్నుల గోధుమలు నిల్వ ఉండాలి. ప్రస్తుతం కేంద్రం వద్ద ఉన్న గోధుమ నిల్వలు వ్యూహత్మక అవసరాల కంటే చాలా స్వల్పంగానే ఉన్నాయి. బయట మార్కెట్ లో అమ్మకాలకు అవసరమైన ఎక్కువ స్థాయిలో గోధుమలు లేవు. కొన్ని రోజుల క్రితమే గోధుమ పిండి ఎగుమతులపై భారత ప్రభుత్వం నియమాలను మార్చింది. దిగుమతి చేసుకున్న గోధుమల నుంచి తయారు చేసిన గోధుమ పిండిని ఎగుమతి చేయడం ప్రారంభించింది. గోధుమ పిండి ఎగుమతి చేసే వ్యాపారుల కోసం మొదట గోధుమలు దిగుమతి చేసుకునే అవకాశం కల్పించి .. వాటి ద్వారా పిండి తయారు చేసి ఎగుమతి చేస్తారు.
ప్రస్తుతం దిగుమతి చేసుకునే గోధుమలపై 40 శాతం పన్ను విధిస్తున్నారు. అంతర్జాతీయంగా గోధుమల ధరలు ఆకాశన్నంటుతుండగా వీటికి రవాణా చార్జీలు అదనంగా భరించాలి. అస్ట్రేలియా గోధుమల ధరలు క్వింటాలుకు రూ.3 వేలు, రష్యా గోధుమల ధరలు రూ.2,600 ఉన్నాయి. మార్కెట్ లోకి రావాల్సిన గోధుమల కొత్త పంటలను పరిశీలిస్తే ఇప్పుడే విత్తు మొదలైంది. ఈ పంట ఉత్పత్తి వచ్చే మార్చ్ కంటే ముందు మార్కెట్లోకి వచ్చే పరిస్థితి లేదు. దీంతో మరో 6 నెలల పాటు గోధుమల ధరలు అధికంగా కొనసాగే అవకాశం ఉంది.
సుకుమార్, టీవీ9 తెలుగు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి